Agriculture

అధిక లాభాలు అందించే పందిరి సాగు

Telugu Agricultural News-Creepers Cultivation Is Highly Profitable

ఒక్క ఎకరంలో పందిరి నిర్మించాలంటే 185 కడీలు అవసరమౌతాయి. ఒక్కో కడికి కడికి మధ్యదూరం 15 ఫీట్లు, 18 ఫీట్ల వెడల్పుతో కడీలను నిర్మించుకోవాలి. అయితే సొర లాంటి పంటలు అధిక బరువు పడినప్పుడు కొన్నిసార్లు దూరం ఎక్కువై బరువు ఎక్కువై పడిపోతున్నాయి. కాబట్టి కేవలం సొరకాయ పంట వేసే రైతులు 15X16 ఫీట్ల వెడల్పుతో పెట్టుకోవచ్చు. పందిరి నిర్మాణానికి మాత్రం కనీసం 9 నుంచి 10 ఫీట్ల కడీలు తప్పనిసరిగా వాడాలి. చాలామంది రైతులు 8 ఫీట్ల కడీ లు వాడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే 8 ఫీట్ల కడీలు వాడినప్పుడు భూమి లోపలికి కనీసం 2 ఫీట్ల దూరం పోతే మిగిలింది 6 ఫీట్లే. ఆ కడీలకు తీగ 5.5 ఫీట్ల దగ్గరో లేక 6 ఫీట్లదగ్గర అల్లడం వలన రైతు పంటను తీగపైకి ఎక్కించగానే బరువుతో కనీసం అరఫీటు నుంచి ఫీటు దూరం కిందికి కుంగిపోతుంది. అప్పుడు కనీసం 2 ఫీట్ల పొడవు బీరకాయ అయితే కాయలు కోసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కొత్తగా పందిరి నిర్మించుకునే రైతులు కచ్చితంగా 9 లేదా 10 ఫీట్ల కడీలు వాడాలి. భూమి నుంచి 6.5 ఫీట్ల ఎత్తు దగ్గర తీగ అల్లుకోవడం చాలా ఉపయోగకరం, లాభదాయకం. చాలామంది పందిరి అల్లే తీగ విషయంలోనూ చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వెంటనే తప్పుపట్టే తీగను వాడకూడదు. మార్కెట్‌లో వివిధ రకాలైన తీగలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో అధునాతన పద్ధతుల్లో జింక్‌ కోటెడ్‌వి 10 నుంచి 15 ఏండ్లు కంపెనీ వారే గ్యారంటీ ఇస్తున్నా రు. అలాంటి వాటిని తీసుకోవాలి. సపోర్టు కడీలు వేసేటప్పుడు కనీసం ఫీటు మందం రెండు ఫీట్ల పొడవు తీసుకోవాలి. 2 నుంచి 2.5 ఫీట్ల లోతులో వేసి బలంగా దాన్ని మూయాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలతో పందిరి నిర్మించుకుంటే అధిక లాభాలు పొందవచ్చు. పందిరి నిర్మాణం ఒకసారి చేస్తే ఏడాదిలో కనీసం మూడు పంటలు తీయవచ్చు.

*** పంటల ఎంపిక-విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు
పంటలు వేసేటపుపడు పంట చేతికి వచ్చేసరికి మార్కెట్‌లో ఏ పంటకు ధర ఉంటుందో వంటి విషయాల మీద అధ్యయనం చేయాలి. బీర, కాకర, సొర వంటి పంటలకు ఏడాది పొడవునా మంచి ధర లభిస్తున్నది. ఇది రైతులకు కలిసి వచ్చే అంశం. అయి తే విత్తనం కొనేటప్పుడు రైతులు సూటిరకాలను కొన్నా, సంకర జాతి రకాలైన F1 హైబ్రిడ్‌ విత్తనాలు మార్కెట్‌లో మంచి లాభాలను ఇస్తున్నాయి. రైతులు విత్తనం తీసుకున్న తర్వాత కొన్న రశీదు, ఆ విత్తనం ప్యాకెట్‌ను తప్పకుండా భద్రపరుచుకోవాలి. ఎందుకంటే విత్తనం వేస్తే ఫెయిల్‌ అయ్యి పంట సరిగా రాకపోతే ఫిర్యాదు చేయవచ్చు. అందుకే కొనేటప్పుడు ఆ ప్యాకెట్‌పై లాట్‌నెంబర్‌, పరీక్ష చేసిన తేదీ, దాని కాలపరిమితి వంటి విషయాలను రైతులు గమనించాలి. అట్లనే ఆ ప్యాకెట్లపై ట్రూత్‌ఫుల్లీ లేబుల్డ్‌ ఉన్నదా లేదా సర్టిఫైడ్‌ సీడ్‌ అని ఉన్నదా చూసుకోవాలి. ఈ రెండింటిలో ఏదీ లేకపోతే అలాంటి విత్తనాలను కొనుగోలు చేయవద్దు.

*** పంట వేసే ముందు పాటించాల్సినవి
కడీల కింద పంట వేస్తున్నాం. కాబట్టి రెండుమూడుసార్లు లోతు దుక్కులు దున్నుకొని ఎకరానికి కనీసం 10 ట్రాక్టర్ల పశువుల పేడను పోసి కలియదున్నాలి. అనంతరం బెడ్‌మేకర్‌తో భూమిపైన కనీసం 15-20 సెం.మీ. ఎత్తులో కనీసం ఒక మీటరు వెడల్పుతో బెడ్‌ ఉంచుకోవాలి. లేకుంటే వేసుకున్న పంటకు బలం సరిపోదు. బెడ్‌లు సాధారణంగా పోసే బెడ్‌ల కంటే ఎక్కువదూరంలో 4 లేదా 6 ఫీట్ల దూరంలో వచ్చేవిధంగా బెడ్‌మేకర్‌తో పోయాలి. ఆ తర్వాత డ్రిప్‌ మధ్యలో పరుచుకొని దానిపై మల్చింగ్‌ షీట్‌ను అమర్చుకోవాలి.

*** మల్చింగ్‌షీట్‌పైన రంధ్రాలు పెట్టడం
సాధారణంగా మల్చింగ్‌ షీట్‌పైన జిగ్‌జాగ్‌ పద్ధతిలో లేదా ఒకే వరుస క్రమంలో రంధ్రాలు పెట్టుకోవాలి. రెండో పంటకు దానికి ఎదురుగా ఇంకో పంటను కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పందిరి సాగులో మల్చింగ్‌ సహాయంతో చేస్తే రెండు పంటలు తీసుకునే అవకాశం ఉన్నది. దీనివల్ల రెండో పంటకు 50 శాతం ఖర్చులు తగ్గించుకోవచ్చు. గింజలునాటిన తర్వాత 4నుంచి 6 రోజుల తర్వాత మొలకెత్తుతాయి. ఒకవేళ ఎక్కడైనా గింజలు మొలకెత్తకపోతే 10 రోజుల వరకు చూసి, మళ్లీ సావు గింజలు పెట్టుకోవాలి. తర్వాత గింజలు మొలకెత్తిన 12 నుంచి 15 రోజు ల వరకు ఎలాంటి ఫెర్టిగేషన్‌ ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చిన్నమొక్కలు ఆ సమయంలో ఇచ్చినా తీసుకునే స్థితి లో ఉండవు. కాబట్టి రైతులు గింజలు పెట్టిన 12-15 రోజుల తర్వాత మాత్రమే ఎరువులను నీటితో కలిపి ఫెర్టిగేషన్‌ (నీరు+నీటిలో కరిగే ఎరువులు) రూపంలో ఇవ్వాలి.

*** స్టేకింగ్‌ (తీగపైకి కట్టడం)
మొక్కలు మొలకెత్తిన 20-25 రోజుల మధ్యలో 4-6 ఆకుల దశకు పెరిగిన తర్వాత నెమ్మదిగా సుతిలి లేదా చిన్న తాడు సహాయంతో తీగను పందిరికి ఎక్కించాలి. తర్వాత మళ్లీ 30-35 రోజుల వయస్సులో మళ్లీ పక్కలకు వచ్చిన తీగను కూడా తాడు సహాయంతో పైకి కట్టాలి. ఇలా కనీసం రెండు లేదా మూడుసార్లు తీగను పైకి కట్టాలి. ఒకసారి పూర్తిగా పందిరిపైకి ఎగబాకిన తర్వాత తీగ నెమ్మదిగా పందిరిపైన పరుచుకుంటూ గుబురుగా మారుతుంది. అయితే ఈ సమయంలో చాలామంది రైతులు పక్కల నుంచి వచ్చిన తీగను కత్తిరిస్తుంటారు. అయితే దీనివల్ల తీగ పైకి బాగా పెరుగుతుంది. కానీ పక్కల నుంచి వచ్చే కాయలను నష్టపోతాము. ఎప్పుడైతే తీగ పూర్తిగా ఒత్తుగా పైకి పరుచుకున్నప్పుడు ఈ పక్కల నుంచి కాయలు అయిపోతాయి. దాదా పు 55-60 రోజుల వయస్సు వచ్చినప్పుడు పక్కల ఉన్న కొమ్మలను పై పంట రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు స్టేకింగ్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

*** నీటి యాజమాన్యం
మొక్కలు మట్టి నుంచి వేర్లు నీటి చెమ్మను పీల్చుకుంటాయి. చాలామంది విపరీతమైన నీళ్లు పెట్టినప్పుడు అదనంగా అనేక రోగాలు వస్తాయి. నీరు తక్కువ అయినప్పుడు బెట్టకు గురై చనిపోతాయి. కాబట్టి రైతులు ఎప్పుడూ ఆ మల్చింగ్‌ షీట్‌లో మొక్క ల వేర్ల దగ్గర నీటి చెమ్మ ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. తద్వారా అధిక నీటి లభ్యత ఉండి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక దిగుబడులు సాధించే రైతులు ఉద యం, సాయంత్రం పంట వయస్సును బట్టి అర్ధగంట నుంచి గంట వరకు రెండుపూటలా నీరు అందిస్తున్నారు. అయితే ఇది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది.

*** ఎరువులు యాజమాన్యం
డ్రిప్‌ ద్వారా నీరు అందిస్తున్న రైతులు ప్రతిరోజూ మొక్కల వేరు వ్యవస్థకు మొక్కలకు నీటిలో కరిగే ఎరువులు అందుబాటులో ఉంచాలి. తద్వారా మొక్కలు బాగా పెరుగుతా యి. ఎరువులను రెండు భాగాలుగా విడగొట్టి ఇవ్వాలి. ఒకటి శాఖీయ దశలో, రెండు పంట దిగుబడి దశలో. శాఖీయ దశలో యూరియా 19-19-19 పాస్ఫారిక్‌ ఆసిడ్‌ అమ్మోనియం సల్ఫేట్‌ 12-61-0 లెక్కన మొక్క నాటిన 12 నుంచి 15 రోజుల తర్వాత ప్రారంభించి, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒక కిలో నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు డ్రిప్‌ ద్వారా ఇవ్వాలి. వీటితోపాటు సూక్ష్మపోషకాలైన EDTA జింక్‌, బోరాన్‌, మాలిబ్డినమ్‌, కాపర్‌, ఐరన్‌ వంటివి 200 గ్రాముల ఉంచి 250 గ్రాముల వరకు నీటిద్వారా కలిపి ఇవ్వాలి. వీటితోపాటు కాల్షియం, అమ్మోనియం నైట్రేట్‌ వంటి ఎరువులను ప్రతిరోజు లేదా రోజు తర్వాత రోజు డ్రిప్‌ ద్వారా ఎరువులను ఉదయం లేదా సాయంత్రం సమయంలో నీటిలో కలిపి ఇవ్వాలి. తద్వారా మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. దీనితోపాటు 2 లేదా 4 ఆకుల దశలో మారినప్పుడు బోరాన్‌ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దానితోపాటు 20-25 రోజుల వయస్సు వచ్చినప్పుడు Formula-4 లేదా 6లను 5 గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పైనుంచి పిచికారీ చేయాలి. పంటదిగుబడి దశలో 13-0-45, (పొటాషియం నైట్రేట్‌) 0-0-50 (వైట్‌ పొటాష్‌) మొక్కలకు పైన చెప్పిన ఎరువులతో పాటు కిలో మొదలు 4 నుంచి 5 కిలోల వరకు ఇవ్వాలి. దీంతోపాటు కాల్షియం అమ్మోనియం నైట్రేట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌ 19-19-19,మైక్రో నూట్రియంట్స్‌ను వేరువేరుగా కలిపి ఇవ్వాలి. అన్నింటిని ప్రతిరోజు ఇవ్వకుండా ఏదో ఒకదానిని అధికారుల సూచనల మేరకు అందించాలి. ఈ విధంగా చేయ డం ద్వారా నాణ్యమైన కాయలు వచ్చి మార్కెట్‌ మంచి ధర రావడానికి ఆస్కారం ఉంటుంది.

వ్యవసాయంలో మారుతున్న ఆధునికపద్ధతుల్లో ఉద్యానపంటల పాత్ర కీలకమైంది. రైతులు ఈ పంటల్లో స్వల్పకాలిక పంటలు పండించి మంచి లాభాలు సాధిస్తున్నారు. స్వల్పకాలిక పంటలైన బెండ, బీర, కాకర, సొర, దోస, గోరుచిక్కుడు వంటివి బాగా పండిస్తున్నారు. అయితే ఈ పంటల్లో తీగజాతి కూరగాయల్లో అధిక లాభాలు ఆర్జించవచ్చు. అందుకే రైతులు తీగజాతి కూరగాయలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తీగజాతి కూరగాయలను నేలపైన కంటే పందిరి విధానంలో పండిస్తే ఎక్కువ లాభాలు సాధించవచ్చు. ఈ పద్ధతిలో సాధారణంగా నేలపైన పండించే విధానం కంటే 30-40 శాతం దిగుబడి అధికంగా ఉంటుంది. కాయల్లో నాణ్యత,మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నది. దీనివల్ల చాలామంది రైతులు ఈ విధానం పట్ల మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే పందిరి సాగు ద్వారా బీర, కాకర వంటి పంటలు పండించి సుమారు 100 రోజుల్లోనే ఒక్కో ఎకరానికి 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు నికర ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే ఈ సాగు చేయాలంటే చాలా శ్రద్ధ, నిత్యం అందుబాటులో ఉండి పంటలు పండించాలి. పందిరి సాగు పద్ధతుల గురించి ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ నియోజకవర్గ అధికారి రావుల విద్యాసాగర్‌ అందించిన వివరాలు.