DailyDose

విమానాలు కూడా ఎగరవు-వాణిజ్యం

విమానాలు కూడా ఎగరవు-వాణిజ్యం-Telugu Business News Roundup Today

* దేశీయ, అంతర్జాతీయ విమానసర్వీసులపై నిషేధం ఏప్రిల్‌ 15 తరువాత మరికొన్నిరోజులుపాటు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనాపై పోరులో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 15తో ముగియనుంది. అయితే దేశంలోని తాజా పరిస్థితులను బట్టి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగించేయోచనలో ఉన్నట్టు సృష్టమౌతోంది. ఈ నేపధ్యంలో విమానసర్వీసులపై కూడా నిషేధం పొడిగించొచ్చని దేశీయ విమానయానసంస్థలు అంటున్నాయి . త్వరలోనే ప్రభుత్వం దీనిపై ఒక అధికారిక ప్రకటనను చేయనున్నట్టు తెలుపుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 15 నుంచి సంవత్సరకాలానికి గానూ విమానప్రయాణాలకు చాలామంది టికెట్లు బుక్‌చేసుకున్నారు. దీనికి సంబంధించి స్పైస్‌జెట్‌ విమానయానసంస్థ ప్రయాణికులందరికి వారి ప్రయాణాలను సెప్టెంబరు 30 వరకు రీషెడ్యూల్‌ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. అలాగే ప్రయాణికుల పీఎన్‌ఆర్‌లను కూడా భద్రపరచనున్నట్టు విమానసంస్థలు వెల్లడించాయి. అంతకుమందు ఏప్రిల్‌ 2న సీనియర్‌ ఏవియేషన్‌ అధికారి ఒకరు 21 రోజుల లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత అన్ని విమానసర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటి వరకు విమానసర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పౌరవిమానయానశాఖమంత్రి హర్దీప్‌సింగ్‌పూరి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అంతకుముందు చేసిన ప్రకటన అప్పటి పరిస్థితులను బట్టి చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నామని, వాటిని బట్టే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.

* కరోనా ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుందని నిపుణులు భావిస్తున్నారని తాను చెప్పినట్లుగా వస్తున్న వార్తలను ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సంస్థ ఛైర్మన్‌ రతన్‌ టాటా తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రకటనలను తాను చేయలేదని, ఇది నకిలీ వార్త అని ట్విటర్‌ వేదికగా తెలిపారు. తాను చెప్పినట్లుగా ప్రచురితమైన కథనం చిత్రాన్ని జోడించి ట్వీట్‌ చేశారు.

* డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే సెట్‌-టాప్‌ బాక్స్‌ మార్చకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకునేందుకు వీలు కలగనుంది. ఈ మేరకు శనివారం భారత్‌ టెలికాం నియంత్రణ ప్రాధికారత సంస్థ (ట్రాయ్‌) పలు సిఫార్సులు జారీ చేసింది. సెట్‌-టాప్‌ బాక్సులను పరస్పరం మార్చుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయా సంస్థలకు సూచించింది. ఈ సెట్‌-టాప్‌ బాక్సుల సాయంతో వినియోగదారులు కొత్త బాక్సులు కొనకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకోవచ్చు. ఈ మేరకు నిబంధనలను రూపొందించాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ట్రాయ్‌ సూచించింది. ఈ ప్రక్రియ అమలులో సమన్వయానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్‌ శాఖ, ట్రాయ్‌, బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌), టీవీలు ఉత్పత్తి చేసే సంస్థలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. మరోవైపు అన్ని డిజిటల్‌ టీవీలు యూఎస్‌బీ పోర్ట్‌కు సపోర్ట్ చేయాలని, కేబుల్‌, శాటిలైట్‌ సిగ్నళ్లు స్వీకరించగలిగేలా తయారు చేయాలని సూచించింది.

* కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందించేందుకుగానూ తమ సంస్థ ఇప్పటి వరకు రూ.100 కోట్లు సేకరించినట్లు ప్రముఖ డిజిటల్‌ లావాదేవీల వేదిక పేటీఎం ప్రకటించింది. రూ.500 కోట్ల సేకరణే లక్ష్యంగా పేటీఎం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీనికి ఎవరైనా విరాళాలు అందించేందుకు అనుమతించింది. అలాగే పేటీఎం ద్వారా ఇచ్చే ప్రతి విరాళానికి, చేసే ప్రతి లావాదేవికీ తమ తరఫున అదనంగా రూ.10 కలుపుతామని తెలిపింది. ఇలా 10రోజుల్లో రూ.100 కోట్లు సమకూరినట్లు సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అమిత్‌ వీర్‌ తెలిపారు.

* లాక్‌డౌన్‌ కారణంగా ఇంధన విక్రయాలు పదోవంతు కంటే తక్కువకు చేరడంతో భారీ నష్టాలు వస్తున్నట్లు పెట్రోలు పంపు ఆపరేటర్లు చెబుతున్నారు. చమురు కంపెనీల నుంచి ఆర్థిక ప్యాకేజీని కోరుతున్నట్లు 64,000 పెట్రోలు బంకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం(ఏఐపీడీఏ) తెలిపింది. ఆ మేరకు మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీల మార్కెటింగ్‌ అధిపతులకు ఏఐపీడీఏ అధ్యక్షుడు అజయ్‌ బన్సల్‌ పేర్కొన్నారు. ఒకప్పుడు ఒక్కో అవుట్‌లెట్‌లో సగటున నెలకు 170 కిలోలీటర్ల విక్రయాలు జరగగా.. ఇపుడు అది 15 కిలోలీటర్లకు చేరింది. 170 కిలోలీటర్ల విక్రయానికి డీలరు మార్జిన్‌ రూ.27,500 వచ్చేదని.. విక్రయాలు ఎంత తక్కువగా జరిగితే మార్జిన్‌ అంత తగ్గుతుందని ఆయన వివరించారు. ‘తక్షణం డీలర్ల కమీషన్‌ను పెంచాలని మేం కోరుతున్నాం. విద్యుత్‌, సిబ్బంది వేతనాలపై చమురు కంపెనీలు సబ్సిడీని ఇవ్వాలనీ విజ్ఞప్తి చేస్తున్నామ’ని ఆ లేఖలో కోరారు.