* తీవ్ర మందగమనంలో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 గుదిబండలా మారిందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 2.8కి కుచించుకుపోనుందని అంచనా వేసింది. ఈ మేరకు ‘సౌత్ ఏషియా ఎకనామిక్ అప్‌డేట్: ఇంప్యాక్ట్ ఆఫ్ కొవిడ్-19’ పేరిట శనివారం ఓ నివేదికను విడుదల చేసింది.
* భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పాలసీదార్లకు ఊరట. మార్చి, ఏప్రిల్ నెల ప్రీమియం చెల్లింపులకు గ్రేస్ పీరియడ్‌ను ఎల్‌ఐసీ నెల రోజులు పొడిగించింది. అన్ని రకాల బీమా పాలసీలకు ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల విషయంలో పాలసీదార్లకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎల్‌ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల ప్రీమియాన్ని కూడా ఏప్రిల్ 15వ తేదీ వరకు చెల్లించేందుకు వీలు కల్పించింది. అలాగే పాలసీదార్లు ఆన్‌లైన్ పద్ధతిలోనూ ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి సేవా రుసుం పడదని ఎల్‌ఐసీ తెలిపింది. యూపీఐ ఆధారిత యాప్‌లు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఎల్‌ఐసీ యాప్ ఎల్‌ఐసీ పే డైరెక్టు ద్వారా కూడా ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే కొవిడ్-19కు సంబంధించిన మరణాలకు కూడా ప్రస్తుత, కొత్త పాలసీల కింద పరిహారం లభిస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది. అంతేకాకుండా ఈ తరహా క్లెయిమ్‌లకు తక్షణ ప్రాతిపదికన పరిహార చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు ఇలాంటివి 16 క్లెయిమ్‌లను ప్రాసెస్ చేశామని పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు 5 బీమా పథకాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. అవి.. ఎల్‌ఐసీ టెక్ టర్మ్, జీవన్ సాథీ యాన్యూటీ ప్లాన్, కేన్సర్ కవర్, ఎస్‌ఐఐపీ, నివేశ్ ప్లస్.
* ప్రపంచ దేశాలతో పాటు భారత దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. ప్రస్తుత ప్రాథమిక అంచనాల ప్రకారం నెల రోజుల లాక్‌డౌన్ వల్ల జాతీయ స్థూల ఉత్పత్తిలో వార్షిక ఉత్పత్తి 8.5 శాతం తగ్గుతుంది. అంటే ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 0.5 శాతానికి మించదు. జీడీపీలో వినిమయం మాత్రం సాధారణంగా 63 శాతం ఉంటుంది. లాకౌడ్ వల్ల ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోయి, ప్రభుత్వ సహాయం అందక వినిమయం ఆరు నుంచి ఎనిమిది శాతం తగ్గవచ్చు. అయినప్పటికీ వినిమయం 55–57 శాతం ఉంటుంది.
* ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కొత్త, బడ్జెట్ ధర స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఐఫోన్ ఎస్ఈ2 (ఐఫోన్ 9) పేరుతో దీన్ని ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసేందుకు యాపిల్ సిద్ధ మవుతున్నట్లు తెలిసింది. అనుకున్నట్టు లాంచింగ్ పూర్తయితే, ఏప్రిల్ 22 నుంచే వినియోగదారులకు ఇది లభ్యం కానుంది. ఈ ఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ కరోనా వైరస్ సంక్షోభంతో విడుదల వాయిదా పడింది. నిజానికి మార్చి 31వ తేదీనే మార్కెట్లో విడుదల కానుందని అంతా భావించినా, కోవిడ్ -19 ఆందోళన నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. 4.7, 5.5 అంగుళాల డిస్ ప్లే సైజుల్లో అతి చవక ధరలో ఐఫోన్ ప్రేమికులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ 2లో ఐఫోన్ 8 తరహాలోనే డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగల్లో లాంచ్ కానున్న ఈ ఐఫోన్ లో 3డీ టచ్‌ను జోడించిందట. అయితే ఫేస్ ఐడీ ఫీచర్ చేర్చలేదని సమాచారం. ఇక ధర విషయానికి వస్తే రూ.30 వేల లోపు ధరకే విక్రయించాలని అనుకుంటుందట. ఇందుకు గాను ఆయా దేశాల్లో ఉన్న తమ ఆథరైజ్డ్ డీలర్లతో యాపిల్ ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసింది. అయితే ఈ విషయంపై స్పష్టతకు మరో నాలుగురోజులు వేచి చూడక తప్పదు.