DailyDose

అపోలోలో తెలుగు వైద్యుడు మృతి-TNI కథనాలు

Telugu Doctor Dies In Madras Apollo-TNILIVE COVID19 Special Stories

* కోవిడ్ పాజిటివ్ తో చెన్నై అపోలో లో చికిత్స పొందుతున్న నెల్లూరు డాక్టర్ ఈ రోజు మధ్యాహ్నం 2 గం.ల సమయంలో మృతి చెందారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తితో రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో వివిధ విభాగాలతో సమన్వయానికి తెలంగాణ భాజపా కమిటీలు నియమించింది. పార్టీలోని ముఖ్యనేతలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఈ కమిటీలు వేశారు. శాంతిభద్రతలు, ఆరోగ్య సమస్యలు, నిత్యావసరాలు, వలస వచ్చిన ప్రజల పర్యవేక్షణపై కమిటీలు నియమించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివిధ స్థాయిల్లో అధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. కమిటీ సభ్యుల వివరాలను భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విడుదల చేశారు.

* కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నాం. ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తున్నాం. దేశంలో కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయి. 80శాతం కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయి. ఆస్పత్రులు, ఐసోలేషన్‌ కేంద్రాల సంఖ్యను పెంచుకుంటున్నాం’’ అని తెలిపారు.

* కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఎంసెట్‌ సహా మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు ఉన్నట్లు ఆయన చెప్పారు.

*ఏపీ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ప్రభుత్వం విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 405కు చేరింది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్తగా 24 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 17, కర్నూల్ 5, ప్రకాశం,కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు వచ్చాయి. 405 కేసుల్లో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బారినపడి ఆరుగురు చనిపోయారు. అనంతపురం 2, కృష్ణా 2, గుంటూరు 1, కర్నూలు 1 చొప్పున చనిపోయారు. ప్రస్తుతం 388 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

* కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రమూ లాక్‌డౌన్‌ను పొడిగించేస్తున్నాయి. పంజాబ్‌, ఒడిసా ఇప్పటికే ప్రకటించగా- తాజాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ కూడా ఈనెల 30 దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు వెల్లడించాయి. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక కూడా ప్రధాని ప్రకటన దాకా ఆగలేదు. అయితే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు కర్ణాటక సీఎం బీఎస్‌ యడ్యూరప్ప శనివారంనాడు చెప్పారు. నిజానికి ఎత్తివేత లేదా సడలింపు నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలొద్దని, కేంద్రమే ప్రకటించాలని మెజారిటీ సీఎంలు శనివారంనాడు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు.

* కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ తమ మంత్రిత్వ శాఖలకు వచ్చి విధులు నిర్వర్తించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత జరగాల్సిన పనులు, ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడం… తదితర అవసరాల దృష్ట్యా కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ తమ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించాలని కోరినట్లు సమాచారం.ఇప్పటికే అన్ని శాఖల జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులకు ఈ ఉత్తర్వులు వెళ్లినట్లు తెలుస్తోంది.

* శానిటైజర్‌లో మత్తు ఉందని, దానిని తాగిన ప్రైవేటు ఉద్యోగి మృతిచెందాడు. కోయంబత్తూర్‌ జిల్లా సూలూరు ప్రాంతానికి చెందిన ఫెర్నాండెజ్‌ ప్రైవేట్‌ గ్యాస్‌ సంస్థలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆ సంస్థ ఆరోగ్య భద్రత నిమిత్తం ఉద్యోగులకు శానిటైజర్‌లను అందించింది. మందుకు బానిసైన ఫెర్నాండెజ్‌ శానిటైజర్‌లో కూడా ఆల్కహాల్‌ ఉందని కొందరు చెప్పిన మాటలు నమ్మి మత్తు కోసం తాగాడు. వాంతులు చేసుకుంటూ స్పృహ తప్పి పడిన ఆయనను కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.