ఒకరోజు సిద్ధార్థుడు, దేవదత్తుడు ఉదయాన్నే నడకకు బయలుదేరారు. వారిపై నుంచి ఒక కొంగ ఎగరడాన్ని గమనించారు. సిద్ధార్థుడు నిలువరించే లోపే దేవదత్తుడు బాణం వేశాడు. ఆ బాణం తగిలి కొంగ కిందపడింది.
ఇద్దరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. సిద్ధార్థుడు ముందుగా చేరుకొని కొంగను చేతుల్లోకి తీసుకొని, గుచ్చుకున్న బాణం తీశాడు. రక్తం కారకుండా కట్టు కట్టాడు. దేవదత్తుడు దాన్ని చూసి ‘‘ఆ పక్షిని నాది, నాకిచ్చెయి’ అని అన్నాడు. అందుకు సిద్ధార్థుడు ససేమిరా అన్నాడు. దాంతో దేవదత్తుడు న్యాయం చేయమని కోరుతూ సభను ఆశ్రయించారు.
‘‘ఆ పక్షిని బాణంతో పడగొట్టింది నేనే. కాబట్టి ఆ పక్షి నాదే’’ అన్నాడు దేవదత్తుడు.
‘‘దానికి గాయం తగ్గేలా చికిత్స చేసి ప్రాణం పోసింది నేను’’ అన్నాడు సిద్ధార్థుడు.
సిద్ధార్థుని చేతిలో ఉన్న పక్షిని చూశాడు న్యాయమూర్తి.
‘‘నువ్వు బాణం వేసి పక్షిని చంపాలనుకున్నావు. కానీ సిద్ధార్థుడు ఆ పక్షి ప్రాణాలు కాపాడాడు. రక్షించిన వానిదే పక్షి. అంతేకానీ చంపాలనుకున్న నీకు చెందదు’’ అని తీర్పు చెప్పాడు న్యాయమూర్తి.
గాయం పూర్తిగా కోలుకున్న పక్షిని సిద్ధార్థుడు గాలిలోకి ఎగరేశాడు. ఆ కొంగ స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్లిపోయింది.