కరోనా వైరస్.. డాలర్ డ్రీమ్స్‌ను చెదురగొడుతున్నది. డాలర్లు సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలనే తపనతో హెచ్1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయుల కలలు సమాధి కాబోతున్నాయి. కరోనాతో అమెరికా ఆర్థిక రంగం కుదేలుకాగా.. అనేక సంస్థలు హెచ్1బీ ఉద్యోగులపై వేటువేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు మూడు లక్షల మంది హెచ్1బీ వీసాదారులుండగా.. రానున్న 5-7 నెలల్లో 20-30 శాతం మంది అంటే దాదాపు 90 వేల మందిని బలవంతంగానైనా స్వదేశాలకు పంపుతారని ప్రముఖ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. హెచ్1బీ వీసాదారులు 60 రోజులకుపైగా నిరుద్యోగులుగా ఉంటే అమెరికా విడిచివెళ్లిపోవాలన్న నిబంధన వారిపాలిట గండంగా మారనున్నది. ఈ గడువును 180 రోజులకు పెంచాలంటూ ఎన్నారైలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
*కరోనా.. డాలర్ డ్రీమ్స్‌ను చెదురగొట్టబోతున్నదా? ఆర్థికంగా స్థిరపడాలనే తపనతో అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయుల కలలు..కల్లలు కాబోతున్నాయా?. ప్రస్తుత పరిణామాలు, కొన్నిసర్వేలు ఇది నిజమేనని చెప్తున్నాయి. కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక రంగం కుదేలైంది. దీంతో సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే క్రమంలో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తూ.. హెచ్1బీ వీసాదారులపై వేటు వేస్తున్నాయి.
*20-30 శాతం మంది ఇంటికి
అమెరికాలో మూడు లక్షల మంది హెచ్1బీ వీసాదారులు ఉన్నారు. ఇందులో సగానికిపైగా భారతీయులే. వారికి అక్కడి భారతీయ ఐటీ కంపెనీలు కల్పతరువులుగా ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాల్లో కోతవిధించడం మొదలుకావడంతో వీరంతా మూటాముల్లె సర్దుకొని భారత్‌కు తిరిగిరావాల్సి ఉంటుంది. రానున్న 5-7 నెలల్లో 20-30 శాతం మంది హెచ్1బీ, హెచ్4 వీసాదారులను స్వదేశాలకు పంపవచ్చని అంచనా. అంటే.. దాదాపు 90 వేల మంది కలలు సమాధి అవుతాయన్నమాట.
*పెరుగుతున్న నిరుద్యోగం
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 4.7 కోట్ల మంది నిరుద్యోగులున్నట్టు అంచనా. గతవారం 60 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. హోట్ మేజర్ మారియట్ నాలుగువేల మందిని, నార్వేజియన్ విమానయాన సంస్థ 50 శాతం, బ్రిటిష్ ఎయిర్‌వేస్ 30వేల మంది ఉద్యోగులను తొలిగించాయి. వీరిలో ఎక్కువ మంది హెచ్-1బీ వీసాదారులేనని నివేదికలు చెప్తున్నాయి.
*180 రోజులకు పెంచండి
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 60 రోజులుగా ఉన్న గడువును 180 రోజులకు పెంచాలని కోరుతూ ప్రవాస భారతీయులు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌కు ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ పంపారు. అమెరికాతోపాటు అంతర్జాతీయంగా రాకపోకలపై నిషేధం ఉన్నదని, ఈ పరిస్థితుల్లో భార్యాపిల్లలను తీసుకొని స్వదేశానికి వెళ్లలేమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై 53వేల మంది సంతకాలు చేశారు. అయితే లక్ష మంది సంతకాలు చేస్తేనే ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
*గండంగా మారిన గడువు
హెచ్1బీ వీసా నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి అమెరికాకు చేరిన తర్వాత లేదా ఒక కంపెనీ నుంచి ఉద్యోగం కోల్పోయిన తర్వాత 60 రోజుల్లోగా ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే హెచ్1బీ వీసా రద్దయ్యి.. బీ2 (విజిటింగ్)వీసాగా మారుతుంది. మరోవైపు కొందరి హెచ్1బీ వీసాల గడువు ముగుస్తున్నది. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారి పరిస్థితి సైతం ఇలాగే ఉన్నది.
మీ H1B అయిపోతే….ఆ వీసాలోకి వెళ్తారు
Related tags :