Politics

ఉచిత మాస్క్‌ల పంపిణీకి జగన్ ఆదేశాలు

YS Jagan Orders Three Free Masks To AP People

రాష్ట్రంలోని అందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ నివారణ చర్యలపై ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున మొత్తం 16కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. హైరిస్కు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో విడత సర్వే పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ..శనివారం రాత్రి వరకు 32,349 మందిని రిఫర్‌ చేయగా.. వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే, 32,349 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల కొవిడ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతర వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యుత్తమ ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం.. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్‌, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు. ఇవాళ ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 417 కేసులు నమోదైనట్లు అధికారులు సీఎంకు వివరించారు.