DailyDose

₹46వేలకు చేరువలో బంగారం-వాణిజ్యం

Gold Price Today - Reaches Close to 46000 Due To Corona

* చమురు విషయంలో సౌదీ అరేబియా, రష్యా మధ్య నెలకొన్న ధరల యుద్ధానికి తెరపడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పతనమైన ధరలకు మద్దతునిచ్చేలా చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌), రష్యా సహా ఇతర కీలక దేశాల మధ్య ఒప్పందం ఖరారైంది. రోజుకు 9.7 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించారు. తొలుత దీన్ని 10 మిలియన్‌ బ్యారెళ్లుగా నిర్ణయించినప్పటికీ మెక్సికో అంగీకరించకపోవడంతో లక్ష్యాన్ని 9.7 మిలియన్‌ బ్యారెళ్లకు కుదించారు. శుక్రవారమే దీనిపై ఓ అంగీకారానికి వచ్చినప్పటికీ.. మెక్సికో ముందుకురాకపోవడంతో తుది ఒప్పందం ఖరారు చేయడానికి ఆదివారం మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. ఈ మేరకు ఆయన సౌదీ అరేబియా, రష్యా దేశాధినేతలను అభినందించారు.

* ఇప్పుడంతా ఆన్‌లైన్ ప్రపంచమైంది. కాలు బయట పెట్టకుండానే కావాల్సినవన్నీ కొనేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కాలుబయట పెట్టలేని పరిస్థితి. దాంతో కంపెనీలే ప్రజల వద్దకు వస్తున్నాయి. దానిలో భాగంగా క్లిక్‌ టు డ్రైవ్‌ పేరుతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్‌ ఆన్‌లైన్‌లో కార్లను కొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వైరస్‌ విజృంభణతో గత నెల రోజులుగా చాలా కంపెనీలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. సౌకర్యవంతమైన, సురక్షితమైన పద్ధతులతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు చాలా కంపెనీలు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడం.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రభావం మన మార్కెట్లపై పడింది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్‌ 469.60 పాయింట్లు నష్టపోయి 30,690.02 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 118.05 పాయింట్లు కోల్పోయి 8,993.85కి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.27గా ఉంది.

* మార్చి త్రైమాసికం ముగిసేసరికి తనఖా రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలో వాటాను చైనా కేంద్ర బ్యాంక్‌ అయిన పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా పెంచుకుంది. ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్‌ బ్యాంక్‌ చైనాకు 1,74,92,090 షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్‌ క్యాపిటల్‌లో ఇది 1.01 శాతానికి సమానం. కరోనా భయాలతో గత రెండు నెలల్లో సూచీలు గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. ఇదే సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఏ ధర వద్ద షేర్లను కొనుగోలు చేసిందన్న వివరాలు తెలియలేదు. జనవరి 1న రూ.2,433.75 వద్ద హెచ్‌డీఎఫ్‌సీ షేరు.. మార్చి 31కి రూ.1,630.45కు దిగొచ్చింది.

* కరోనా వైరస్‌ లాక్ డౌన్‌ కారణంగా దుకాణాల్లో బంగారం కొనుగోళ్లు జరగనప్పటికీ… సోమవారం నాటికి పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. నిన్న క్లోజింగ్‌ సమయంలో రూ.45,294గా ఉన్న పది గ్రాముల బంగారం ధర, ఈ ఉదయం తొమ్మిది గంటలకు రూ.45,680కి చేరుకుంది. కొద్ది గంటల్లోనే పసిడి ధరలో 1.45 శాతం పెరుగుదల నమోదైంది. ఉదయం 11:00 గంటలకు రూ.45,950కి చేరింది. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో బంగారానికి దేశీయంగా అంతగా డిమాండు లేనప్పటికీ… అంతర్జాతీయంగా ధరలు పెరగటంతో ఈ విధంగా జరిగిందని విశ్లేషకులు అంటున్నారు.

* ప్రపంచానికి పెను విపత్తుగా మారిన కొవిడ్‌-19 ‘అదృశ్య హంతకి’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. మనుషుల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిదిమేయక ముందే ఈ మహమ్మారిని అంతమొందించాలని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ద్రవ్యం అందుబాటులో ఉంచడం కీలకమని వెల్లడించారు. వ్యవస్థలో అన్ని రంగాలు సక్రమంగా నడవాలంటే ద్రవ్య వినిమయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.