అమెరికాలో చిక్కుకుపోయిన 2.5 లక్షల మంది విద్యార్థులు. భారత రాయబారితో తమ గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు. అమెరికాలో పరిస్థితులు బాగా లేవన్న రాయబారి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 2.5 లక్షల మంది భారత విద్యార్థులు అమెరికాలో చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు అమెరికాలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 20 వేలు దాటింది. యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడడంతో హాస్టళ్ల నుంచి విద్యార్థులు పంపించివేస్తున్నారు. ఈ క్రమంలో 500 మంది భారత విద్యార్థులు భారత దౌత్య కార్యాలయ అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో అమెరికాలో భారత రాయబారి తరంజీత్ సింగ్ సంధూ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో విద్యార్థులతో మాట్లాడారు. అమెరికాలో పరిస్థితులు బాగా లేనందున, ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని సూచించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. అమెరికాలో మరికొంతకాలం ఉండేలా వీసాలు పొడిగించేందుకు భారత దౌత్య కార్యాలయం సహకరిస్తుందని తెలిపారు. కాగా, అమెరికాలోని భారత ప్రధాన దౌత్య కార్యాలయంతో పాటు ఐదు కాన్సులేట్లు కూడా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి.
F1 విద్యార్థులు ఎక్కడివారు అక్కడే

Related tags :