* కరోనా వైరస్ పరీక్షలు కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారితో పాటు ఎవరెవరికీ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది. గత వారం మహమ్మారి నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రైవేట్ లాబొరేటరీస్ ఉచితంగా చేయలేమని పేర్కొనడంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
* ప్రజల ప్రాణాలు కాపాడాలని ఓ వైపు ప్రభుత్వం మాంసం విక్రయాలపై ఆంక్షలు విధిస్తుంటే.. అందుకు విరుద్ధంగా ప్రజలు పూడ్చిన మాంసాన్ని తీసుకెళ్లిన ఘటన వెంకటగిరిలో జరిగింది. క్రాస్‌రోడ్డులో ఓ వ్యాపారి వద్ద 25 కేజీల పొట్టేలు మాంసం, గొడ్డేరు వాగులో వధించిన ఆవు తలను, త్రిభువని కూడలి వద్ద 16 కోళ్లను మున్సిపల్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మాంసాన్ని డంపింగ్‌యార్డులో పాతిపెట్టే వేళ 9 కేజీలు, 8 కోళ్ల్లు మాత్రమే ఉన్నాయి. పూడ్చిపెట్టిన మాంసాన్ని సైతం కొందరు తవ్వి తీసుకెళ్లారు. ఎన్టీఆర్కాలనీ శివారు ప్రాంతంలో ఓ ఇంటిలో దాచిన చేపలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల కిందటి చేపలను ఐస్‌లో భద్రపరిచి విక్రయిస్తున్నారని, వీరిపై కేసులు నమోదు చేస్తామని ఆర్ఐ మహేశ్ తెలిపారు. ఎస్సై వెంకటరాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
* రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారని మంత్రి కొడాలి నాని కొనియాడారు. హమాలీలు సైతం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమవుతుందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్ రాష్ట్రాలతో మాట్లాడారని నాని తెలిపారు. కేవలం 92 లక్షల కార్డులను మాత్రమే కేంద్రం పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. వారికి మాత్రమే కేంద్రం ప్రకటించిన సాయం అందుతుందని.. అయితే రాష్ట్రంలో కోటి 40 లక్షల కార్డులు ఉన్నాయని మంత్రి మీడియాకు వెల్లడించారు.
* భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశంలో ఈ వైరస్ బారినపడి 35మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌తో మృతిచెందినవారి సంఖ్య 308కి చేరింది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 9152కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 857మంది కోలుకోగా ప్రస్తుతం మరో 7987మంది చికిత్స పొందుతున్నారు.
* ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 12 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు ఈ కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో పేర్కొన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో గుంటూరులో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 432కి పెరిగింది.
* ఏపీ ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత కామినేని శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది జంద్యాల రవి ఈ పిటిషన్ వేశారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఎస్ఈసీగా తొలగించడంపై భాజపా అధిష్ఠానం అనుమతితోనే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు కామినేని పేర్కొన్నారు.
* మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ చిన్నారితో సహా ఇద్దరు యువతుల మృతదేహాలను జవహర్‌నగర్‌లో పోలీసులు గుర్తించారు. డెంటల్ కాలేజీ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద ఇద్దరు యువతుల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కన్పించాయి. ఘటనాస్థలిలోనే చిన్నారి మృతదేహం కూడా లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
* కొవిడ్-19 నేపథ్యంలో దిగజారిన ఆర్థిక పరిస్థితి వల్ల భారత్‌కు చెందిన కార్పొరేట్ సంస్థలు బలహీనపడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దీన్ని అదునుగా భావించి భారత కంపెనీల్ని విదేశీ సంస్థలు కొనుగోలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ పారిశ్రామిక రంగం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో అలా జరగకుండా నియంత్రించాలని ప్రభుత్వానికి సూచించారు.
* ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో కొవిడ్-19 మరోసారి విజృంభించింది. ఆదివారం ఒక్కరోజే 108 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో 98 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. వీరి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో చైనాలో వైరస్ విజృంభణ రెండో విడత ప్రారంభమయ్యే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
* కరోనా వైరస్‌తో బాధపడుతూ తమ ఆస్పత్రిలో చేరిన ముగ్గురు భారత అమెరికన్లు ‘ప్లాస్మా థెరపీతో’ కోలుకుంటున్న సంకేతాలు కనపడ్డాయని హ్యూస్టన్‌లోని సెంట్ లూక్స్ మెడికల్ సెంటర్ వైద్యులు ఆదివారం వెల్లడించారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్ లేని కారణంగా అమెరికాలోని పలు ఆస్పత్రుల్లో ‘ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్’ పాత పద్ధతిని అవలంభిచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
* అమెరికాలో కరోనా వైరస్ విజృంభణకు అధ్యక్షుడి వైఖరే కారణమంటూ ఆ దేశ ప్రముఖ వార్తా ప్రతిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన కథనాన్ని ట్రంప్ తప్పుపట్టారు. అది తప్పుడు వార్త అంటూ కొట్టిపారేశారు. కరోనా ప్రారంభ దశలోనే అమెరికా ఇంటలిజెన్స్, జాతీయ భద్రతా వర్గాలు, ప్రభుత్వ ఆరోగ్య అధికారులతో పాటు అన్ని కేబినేట్ విభాగాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధ్యక్షుడిని హెచ్చరించినా, ఆయన పెడచెవిన పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ పత్రిక తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. 12.30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోయి 30834.04 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో 9028.05 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.36గా ఉంది.