Movies

శకుని అంటే ధూళిపాళే-ప్రత్యేక కథనం

Remembering Veteran Villain Dhulipalla On His Deatrh Anniversary

తెలుగు చిత్రసీమలో శకుని అనే పేరు వినిపించగానే గుర్తుకొచ్చే నటులు… సీఎస్సార్, లింగమూర్తి. వాళ్ల తర్వాత ఆ పాత్రపై తనదైన ముద్ర వేసిన నటుడు ధూళిపాళ. ప్రత్యేకమైన వాచకం, హావభావాలతో శకుని పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేశారాయన. తెలుగు నాటక, చలన చిత్ర రంగాలపై బలమైన ప్రభావం చూపించిన ఆయన… 1922 సెప్టెంబరు 24న గుంటూరు జిల్లా, దాచేపల్లిలో శంకరయ్య, రత్నమ్మ దంపతులకి జన్మించారు. ఆయన పూర్తి పేరు ధూళిపాళ సీతారామశాస్త్రి చిన్నప్పట్నుంచే రంగస్థలంపై మక్కువ పెంచుకొన్నారు. బతుకు తెరువు కోసం గుంటూరులో కొంతకాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేసిన ఆయన 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. 1941లో స్టార్‌ థియేటర్‌ని స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన రంగస్థలం మీద దుర్యోధన, కీచక పాత్రల్ని పోషించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకి వెళ్లినప్పుడు, ఆ పోటీల న్యాయ నిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే కాకుండా, దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకి పరిచయం చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు ‘భీష్మ’ (1959)లో దుర్యోధనుడి పాత్రని ఇచ్చారు. అందులో భీష్ముడిగా ఎన్టీఆర్‌ నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభని మెచ్చుకున్న ఎన్టీఆర్‌ తర్వాత నత సంస్థలో నిర్మించిన ‘శ్రీకృష్ణ పాండవీయం’లో శకుని పాత్రని ధూళిపాళకి ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి పలు పౌరాణిక పాత్రలు పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి మెప్పించిన ఆయన ‘దానవీర శూరకర్ణ’, ‘మాయాబజార్‌’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘నర్తనశాల’, ‘బొబ్బిలియుద్ధం’, ‘వీరాభిమన్యు’, ‘పూలరంగడు’, ‘శ్రీకృష్ణావతారం’, ‘జగన్మోహిని’, ‘కథానాయకుడు’, ‘ఆత్మగౌరవం’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’… ఇలా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారు. తమిళ పత్రికలు సైతం ఆయన నటనని, ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చి నటనలో పులి… నడతలో గోవు అని అర్థం వచ్చేలా ‘నడిప్పిళ్‌ పులి నడత్తల్‌ పసువు’ అని కీర్తించాయి. బాంధవ్యాలు చిత్రంలో నటనకిగానూ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి ‘చూడాలని ఉంది’, ‘శ్రీఆంజనేయం’, ‘మురారి’ వంటి చిత్రాల వరకు… మూడున్నర దశాబ్దాలకి పైగా సాగిన ఆయన నట ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఉన్నట్టుండి ఆయన ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. తనకున్న సంపదని త్యజించి, 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా సన్యాస దీక్షని స్వీకరించారు. అప్పట్నుంచి ఆయన శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో చలామణీ అయ్యారు. గుంటూరు మారుతీనగర్‌లో మారుతీ దేవాలయాన్ని నిర్మించి… రామాయణం, సుందరకాండలని తెలుగులోకి తిరగరాశారు. ధూళిపాళ ట్రస్టుని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేశారు. కొద్దికాలం ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడిన ఆయన 2007, ఏప్రిల్‌ 13న తుదిశ్వాస విడిచారు. ఆయనకి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఈరోజు ధూళిపాళ వర్ధంతి.
Dhulipala photo gallery - Telugu cinema actor