తన బ్యాటింగ్ విధానానికి రామాయణంలోని అంగదుడి పాత్రే స్ఫూర్తి అని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ఆదివారం రాత్రి ఓ ట్వీట్ చేసిన విధ్వంసకర ఓపెనర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. రామాయణంలోని వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అవుతాడు. వాలి కుమారుడు అంగదుడు యువరాజు అవుతాడు. ఇక రావణాసురిడితో యుద్ధానికి ముందు రాముడు అంగదుడిని చివరిసారి రాయబారానికి పంపుతాడు. ఈ సందర్భంగా రావణాసురిడి ముందు అంగదుడు తన ధీరత్వంతో పాటు బల ప్రదర్శననూ చూపిస్తాడు. సహజంగా అంగదుడు ఎంతో బలవంతుడు. ఒక్కసారి ఆయన కాలుపెట్టి నిలబడితే కదిలించడం ఎవరితరం కాదు. ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ సెహ్వాగ్ ఓ ఫొటో పోస్టు చేసి ఇలా అన్నాడు. ‘ఒక్కసారి నిలుచుంటే కాళ్లు కదపలేకపోవడమే కాదు, అది అసాధ్యం కూడా. అంగడ్ జీ రాక్స్’ అని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ నిజంగానే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఎన్నోసార్లు బెంబేలెత్తించాడు. క్రీజులో కుదురుకున్నాడంటే అతడిని ఆపడం ఎవరివల్లా కాదు. అంతలా తన బ్యాటింగ్‌తో అలరించాడు వీరేంద్ర సెహ్వాగ్. అతడు క్రికెట్ నుంచి తప్పుకున్నా తరచూ వైవిధ్యమైన ట్వీట్లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన బ్యాటింగ్‌కు స్ఫూర్తినిచ్చిన అంగదుడి గురించి వివరించాడు.
వీరేంద్రుడి రహస్యం అంగదుడు
Related tags :