DailyDose

రికార్డులు బద్ధలుకొట్టిన బంగారం ధర-వాణిజ్యం

రికార్డులు బద్ధలుకొట్టిన బంగారం ధర-వాణిజ్యం

* అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఏడు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఉదయం ఔన్సు బంగారం ధర 1715.25 డాలర్లు పలికింది. ఏడు సంవత్సరాల క్రితం(డిసెంబర్‌ 2012)లో పసిడి ధర 1722.20 డాలర్లుగా నమోదు కాగా.. ఆ తర్వాత పుత్తడికి ఇంత ధరపలకటం ఇదే తొలిసారి. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తితో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నయనే భయాందోళనలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడే సురక్షితమని భావిస్తున్న ఇన్వెస్టర్లు, బులియన్‌ మార్కెట్కు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఈ పరిణామాలతో వివిధ దేశాలలో లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ… బంగారం ధర తారస్థాయికి చేరుకుందని పరిశీలకులు తెలిపారు.

* కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పరిశ్రమలన్నీ తమ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ తొలగించిన అనంతరం, పరిస్థితులు కుదుటపడిన తర్వాత తమ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయని ఆటో మొబైల్ పరిశ్రమలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లో కరోనా మహమ్మారి అలవాటు చేసిన సామాజిక దూరమే అందుకు కారణంగా చెప్తున్నాయి. దీనికి సంబంధించి మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. మరో ప్రయాణికుడితో కలిసి ప్రయాణించడానికి భయపడటం కొనుగోళ్లు పెరగడానికి కారణంగా మారొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరిగా భారతీయులు అలాగే ఉండరని, కొనుగోలు విషయంలో వారి ఆలోచనల్లో మార్పులు వస్తాయని ఆయన తెలిపారు. ఆర్థిక స్తంభన తర్వాత గతంతో పోల్చుకుంటే చైనా దేశీయులు వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు చూపుతున్న ఆసక్తే భార్గవ వ్యాఖ్యలకు కారణం.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న చర్యలకు గూగుల్‌ చీఫ్‌ సుందర్‌ పిచాయ్‌ మద్దతుగా నిలిచారు. ఈ విపత్తుపై పోరాడుతున్న స్వచ్ఛందసంస్థ (ఎన్‌జీఓ) గివ్‌ ఇండియాకు రూ.5 కోట్లను విరాళంగా అందించారు. చిన్న వ్యాపార సంస్థలకు మూలధనం అందించేందుకు బ్యాంకులు, ఎన్‌జీవోల కోసం 200 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1520 కోట్ల) నిధిని గూగుల్‌ ప్రకటించిన సంగతి విదితమే.

* ప్రభుత్వ అధికారులు, ఐటీ దిగ్గజాలతో ఒక అత్యున్నత స్థాయి కమిటీని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎమ్‌ఓ) ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌పై ప్రజలకు సూచనలు చేయడంతో పాటు వాస్తవ వివరాలు, వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండేందుకు సహకరిస్తున్న ఆరోగ్య సేతు యాప్‌ తదుపరి వెర్షన్‌ రూపకల్పనతో పాటు కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి అవసరమైన సొల్యూషన్లపై ఇది పనిచేస్తుంది. ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌ రాఘవన్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఐటీ కార్యదర్శి అజయ్‌ సాహ్ని, ట్రాయ్‌ ఛైర్‌పర్సన్‌ ఆర్‌ఎస్‌. శర్మ, టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్‌, టాటా ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టెక్‌మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ, ఐఐటీ చెన్నై ప్రొఫెసర్‌ వి.కామకోటి, గూగుల్‌ మ్యాప్‌ వ్యవస్థాపకుడు లలితేశ్‌ కాట్రగడ్డ ఈ కమిటీలో ఉంటారు. వారానికి మూడు నాలుగు సార్లు సమావేశమై తదుపరి కార్యాచరణను ఈ కమిటీ నిర్ణయిస్తోంది. ఆరోగ్యకరమైన దేశం కోసం డిజిటల్‌, టెక్నాలజీ పరిష్కారాలను కనుగొనాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య సేతు యాప్‌ అన్ని రకాల ఫోన్లలో పనిచేసేలా టెక్‌మహీంద్రా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇది స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే పరిమితమన్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 2న ఆరోగ్య సేతును కమిటీ తీసుకురాగా.. ఇప్పటికి కోటి మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

* కొత్త పన్ను విధానం కావాలా వద్దా అన్న విషయాన్ని ఉద్యోగులు, తమ సంస్థల నిర్వాహకులకు తెలియచేయాలని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. తద్వారా వేతనాల నుంచి టీడీఎస్‌ మినహాయించడానికి వీలు కల్పించాలని కోరుతోంది. బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పన్ను వ్యవస్థ ప్రకారం.. నిర్దిష్ట పన్ను మినహాయింపులను పొందని పక్షంలో తక్కువ పన్ను రేట్లు వర్తిస్తాయన్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు తమ ఎంపికను కంపెనీలకు తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేదు. రూ.2.5-5 లక్షలకు 5%; రూ.5-10 లక్షలపై 20%; రూ.10 లక్షల పైన 30 శాతం పన్ను విధిస్తారు. కొత్త పన్ను విధానం(ఆప్షనల్‌) ప్రకారమైతే.. రూ.2.5-5 లక్షలపై 5%; రూ.5-7.5 లక్షలపై 10%; రూ.7.5-10 లక్షలపై 15%; రూ.10-12.5 లక్షలపై 20%; రూ.12.5-15 లక్షలపై 25%; రూ.15 లక్షలపైన 30 శాతం పన్ను వర్తిస్తుంది. అయితే పన్ను మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుంది.