Editorials

తెలుగుతల్లి పీక మీద కాలు పెట్టి….

How English Is Crushing Telugu-An Insight Into How Andhrites Lost A Language

తెలుగు భాషలో అనేకపదాలు చచ్చిపోయాయి. అంగ్లభాష మీది మోజుతో ప్రతిరోజు కొన్ని వందల పదాలను తెలుగువారమైన మనం హత్య చేస్తున్నాం.ఒకప్పుడు ఈ దమనకాండ ఈస్టిండియా తాబేదార్లకే పరిమితమై వుండేది. తరువాత తరువాత ఈ చంపుడు కార్యక్రమం విసృంఖలమై మొత్తం తెలుగు సమాజాన్నే ఆవరించింది. అగ్ని ఆజ్యం తోడైనట్టు ఏకీకృత (కార్పోరేటు ) వ్యవస్థలు ఏకీకృత విద్యాసంస్థలు చివరికి వార్తాపత్రికలు దృశ్య (TV) మాధ్యమాలు బహిరంగంగా తెలుగును నడిరోడ్డుమీద హత్యలు చేస్తున్నాయి.

భావవ్యక్తీకరణకు మేధోసంపత్తి వికాసానికి మాతృభాషకు మించిన మాధ్యమం లేదని వేయిగొంతులు కోడైకూస్తున్నా, విశేషించి తెలుగువారు తెలుగుతల్లి పీకను నొక్కేస్తున్నారు.

మీ గుండెలపై చేయివేసుకొని చెప్పండి మనం నిత్యం ఉపయోగించిన క్రింద పేర్కొన్న ఇంటివస్తువుల పేర్లు తెలుగులో మీ పిల్లలకు తెలుసా అని.

(1) రోలు
(2) రోకటి
(3) కొడవలి
(4) కవ్వం
(5) అటక
(6) చూరు
(7) పొంత
(8) మూకుడు
(9) కాడి
(10) పగ్గం
(11) పడ్డ
(12) చల్ల
(13) ముంత
(14) లిక్కి
(15) అంజనం
(16) గొత్తు, గూటం
(17) పశువుల గాడి
(18) తునక
(19) సారె
(20) నిట్రాయి
(21) మోకు
(22) కపిల / మోట
(23) వలపట/దాపట
(24) ఇడ్డెన
(25) చేద

ఇలా వ్రాసుకొంటూ పోతే వందలు కాదు వేలల్లోనే తెలుగు పదాలను మనం చంపి మరల బతుకుతాయోమోనని ఉప్పుపాతర వేసేసాం.

ఇటీవల మా మిత్రుడు నడిపే పాఠశాలకు వెళ్ళడం తటస్తించింది. ఐదో తరగతి విద్యార్థికి “బాబు కిటికి కింద కూచున్నావ్, లేచేటపుడు జాగ్రత్త ” అనంటే వాడు వెంటనే కిటికి అంటే ఏమిటంకుల్ ప్రశ్నించాడు.ఉపాధ్యాయుడు ఒరే నాయనా విండో అంటే అనంటే, కిటికి అంటే విండోనా అంకుల్ అని వాడు సమాధానమిచ్చాడు. ఇది వాస్తవ సంఘటన.

అమ్మానాన్నలకు ఉపాధ్యాయులకు యాజమాన్యానికి పిల్లలకు చదువు జ్ఞానం రాకపోయినా ఫరవాలేదు, ఆంగ్లంవస్తే చాలు మాట్లాడితే చాలు అదే పదివేలని మురిసిపోతున్నారు.

ఇలా గొంతుచించుకొని ఎవరెంత అరిచినా గీ పెట్టినా తెలుగోడు మారడు. తెలుగును చంపకమానడు. ఇదే మనవాడి గొప్పతనం.

పులు కడిగిన ముత్యం అనే జాతీయం ఎంత మందికి తెలుసో, ఎందరు మరిచిపోయారో నాకైతే తెలియదుకాని ఆ జాతీయానికి అర్థం చెపుదా వినండి.

పులు అంటే బురద. బురదలో పడిన ముత్యం అశుభ్రంగా వుండి కాంతిహీనంగా మారినా తన స్వభావాన్ని కోల్పోదు. అలా బురదలో పడిన ముత్యాన్ని కడిగితే మిలమిల మెరుస్తుంది.

కొంతమంది వ్యక్తులు చెడనే బురదలో పడినప్పటికి సహజ మంచితనాన్ని కోల్పోరు. అలాంటి వారిని సంస్కరిస్తే బాగా వికసిస్తారు.

తెలుగునేలలో పులేరు, పులేటిపల్లి పేరుతో గ్రామాలున్నాయి.అర్థమేమిటంటే అక్కడ ప్రవహించిన ఏరు బురద ఏరని (పులు + ఏరు = పూలేరు ) అలాగే పులేటిపల్లి కూడా.

పులు అంటే రెల్లుగడ్డనే అర్థముంది. ఈ రెల్లుగడ్డి కూడా నదీగర్భంలో పరివాహక ప్రాంతంలో పెరుగుతుంది.
రెల్లుగడ్డినే సంస్కృతంలో శరవణ అంటారు.

కుమారస్వామికి శరవణభవుడు అనగా రెల్లుగడ్డిలో పుట్టినవాడని అర్థం.( శరవణ = రెల్లు, భవుడు = పుట్టినవాడు.)
————————————————————————-
జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.