Fashion

మహిళా నాయకత్వం…జిందాబాద్!

New Zealand Women PM Is An Inspiration To Every Woman-Telugu Fashion & lifestyle news

కరోనా కల్లోలానికి అగ్రరాజ్యాలే ఉలికిపడుతున్న వేళ.. ‘న్యూజిలాండ్‌ ఊపిరి పీల్చుకో.. నేనున్నాను’ అంటున్నారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌. ఆమె పాలనా దక్షత.. మహిళగా ముందుచూపు.. న్యూజిలాండ్‌కు కరోనా నుంచి రక్షణ కవచంగా మారాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలుచేస్తూనే.. అమ్మ మనసును చాటుకుంటున్నారామె!

ఫిబ్రవరి 28 కరోనా న్యూజిలాండ్‌ తలుపు తట్టింది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు వైరస్‌ సోకిందని తేలింది. అధికారులను రంగంలోకి దింపారు జెసిండా. విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. అంతకు కొద్ది రోజుల ముందు నుంచి విదేశాల నుంచి వచ్చిన వారిని వెనువెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితం.. కరోనా జడలు విప్పకముందే.. అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా తన పని తాను చేసుకుపోయింది. అవకాశం ఉన్న చోట విజృంభించడం మొదలుపెట్టింది. మరిన్ని చర్యలు తీసుకున్నారు జెసిండా. మార్చి 15 నుంచి పద్నాలుగు రోజుల పాటు ప్రజలంతా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని ఆదేశించారు. ఈ గడువు ముగియకముందే మార్చి 26 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆమె నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు పలికారు. లాక్‌డౌన్‌ను పక్కాగా పాటిస్తున్నారు. అప్పటి నుంచి కేసుల తీవ్రత తగ్గింది. వైరస్‌ వ్యాప్తి ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారామె. కరోనా పీడిత ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి పరిస్థితులు చేజారకుండా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసేలా చూస్తున్నారు.

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా.. నిత్యావసరాలకు కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు జెసిండా. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించడంతో న్యూజిలాండ్‌లో వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. వీలైనంతమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడంతోనే ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలిగామని చెబుతున్నారామె. న్యూజిలాండ్‌లో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 1,349. దాదాపు 471 మంది పూర్తిగా కోలుకున్నారు. నలుగురే మృతి చెందారు. కేసుల పెరుగుదల కూడా స్వల్పంగానే ఉంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఆమె తీసుకున్న చర్యలు ఇప్పుడు మెరుగైన ఫలితాన్నిస్తున్నాయి.