Kids

పాలిచ్చేటప్పుడు జాగ్రత్త

NewBorns Must Be Treated With Care During Corona While Feeding

కరోనా మహమ్మారిగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు అనుసరించవలసిన మార్గదర్శకాలను అమెరికా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హెల్త్‌ చెకప్స్‌ కోసం వెళ్లే సమయంలో వీళ్లు కూడా అందరిలాగే చేతులు శుభ్రం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే మిగతా వారితో పోలిస్తే, గర్భిణులకు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా లేనప్పటికీ, గర్భధారణ వల్ల వారి శరీరంలో, రోగనిరోధకవ్యవస్థలో వచ్చే మార్పుల కారణంగా వారి శ్వాసకోశ వ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు తేలికగా గురయ్యే వీలు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరిస్తోంది.ఇప్పటివరకూ కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఫలితంగా గర్భస్రావం జరిగినట్టు, గర్భిణి నుంచి గర్భస్థ శిశువుకు వైరస్‌ సోకినట్టు ఆధారాలు లేవు. అయితే మార్చి నెలలో లండన్‌లో ఓ పసికందుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. అయితే ఈ ఇన్‌ఫెక్షన్‌ గర్భంలో ఉన్నప్పుడే శిశువుకు సోకిందా లేక ప్రసవ సమయంలో సోకిందా అనే విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పటివరకూ ఈ వైరస్‌తో తీవ్ర అనారోగ్యానికి లోనైన పసికందుల కేసులు లేకపోయినప్పటికీ, 12 నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకితే, వారికి రిస్క్‌ ఎక్కువే!అయితే ‘కొవిడ్‌ – 19’ కారక వైరస్‌ తల్లి పాలలో ఉన్న ఆధారాలు ఇప్పటివరకూ లేవు. కరోనా లక్షణాలు ఉన్న తల్లులు బిడ్డకు పాలిచ్చే సమయంలో ముఖానికి మాస్క్‌ ధరించడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కరోనా సోకినంత మాత్రాన తల్లులు బిడ్డకు పాలివ్వకూడదని నిపుణులు అనడం లేదు. ఇందుకు కారణం తల్లి పాలల్లో వైరస్‌తో పోరాడడానికి తోడ్పడే యాంటీబాడీలు ఉండడమే!