DailyDose

జగన్ సర్కార్‌కు ₹5కోట్లు ఇచ్చిన అంబానీ-తాజావార్తలు

జగన్ సర్కార్‌కు ₹5కోట్లు ఇచ్చిన అంబానీ-తాజావార్తలు

* కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ భారీ సాయం అందించింది. కొవిడ్‌ 19 నివారణ చర్యల కోసం రూ.5కోట్లు విరాళం ప్రకటించింది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ విరాళాన్ని ఏపీ సీఎం సహాయ నిధికి జమ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారు. ఈ విరాళం కొవిడ్‌ 19 నివారణ చర్యలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి విరాళం ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్పారు.

* ఏపీలో మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలివేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. లాక్‌డౌన్‌ పొడిగింపుతో సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకు నగదును వెనక్కి ఇవ్వనున్నట్టు తెలిపింది.

* ముంబయిలోని బాంద్రా ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడారు. బాంద్రా పశ్చిమ బస్టాండ్‌ వద్దకు భారీగా వలస కార్మికులు చేరుకోవడంతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు కరోనా నివారణకు చేస్తున్న పోరాటాన్ని బలహీనపరుస్తాయని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అమిత్‌ షా సూచించారు.

* కరోనా వైరస్‌కు టీకా మందు కనిపెట్టడంలో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ దేశ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తున్న ఓ పరిశోధన సంస్థ రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలు పెట్టింది. క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు మూడు వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని అక్కడి అధికార పత్రిక షిన్హువా తెలిపింది.

* ఏపీలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్‌కు కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు. హిందూపురంలో నివసిస్తున్న తహసీల్దార్‌.. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకాలేదు. దీంతో నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా కరోనా సోకినట్లు నిర్ధారించారు. అనంతరం తహసీల్దార్‌ను అనంతపురంలోని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.

* మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విడుదల చేసిన వీడియో సందేశంపై భాజపా విమర్శలు చేసింది. మీ ఆరోగ్యం జాగ్రత్త సోనియాజీ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి కొద్ది గంటల ముందు సోనియా ఆ వీడియోను విడుదల చేశారు. దానిలో ఆమె కరోనాపై పోరులో ముందుండి దేశ రక్షణకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిని ప్రశంసించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దామని పిలుపునిచ్చారు. ఆ వీడియో సందేశాన్ని ఉద్దేశించి జేపీ నడ్డా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘థ్యాంక్యూ సోనియాజీ, మీ ఆరోగ్యం జాగ్రత్త’ అని ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో కూడా కాంగ్రెస్‌ రాజకీయాలకు పాల్పడుతోందని గతంలో కూడా ఆ పార్టీ అధినేత్రిపై విమర్శలు గుప్పించారు.

* మంగళవారం ఉదయం ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తునట్టు ప్రకటించిన నేపథ్యంలో ముంబయిలో వలసకూలీలు ఆందోళన బాట పట్టారు. వేలాదిగా పశ్చిమ బాంద్రా బస్టాండుకు తరలివచ్చి తాము స్వస్థలాలకు వెళ్లేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. కరోనాపై పోరులో భాగంగా దాని వ్యాప్తిని అరికట్టేందుకే ప్రధాని మోదీ మార్చి 23న లాక్‌డౌన్‌ ప్రకటించగా వలస కూలీలంతా ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వీరికి కావాల్సిన ఆహారం, ఇతర అత్యవసర అవసరాలను తీరుస్తూ ఎన్జీవోలు, పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

* లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు కేటీఆర్‌, ఈటల అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

* నిత్యావసరాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బియ్యం ఇచ్చే ప్రతికార్డుకూ రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్‌ సరకుల పంపిణీలో ఇబ్బందులను అధిగమించేలా చర్యలు చేపట్టామని బొత్స చెప్పారు.

* ఏప్రిల్‌ 20 నుంచి కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో దిల్లీలో ఆయన ఈటీవీతో మాట్లాడారు. తీవ్రస్థాయిలో లేకపోయినా కొన్నిచోట్ల కేసులు ఎక్కువగానే ఉంటున్నాయని అన్నారు. కరోనాను నియంత్రిస్తే ప్రజల ప్రాణాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దవచ్చని చెప్పారు. ఒక్కసారి పాజిటివ్‌ వచ్చి ఆ తర్వాత తగ్గినప్పటికీ బాధితులు ఇళ్లల్లో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 20 వరకు అన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాల్సిందేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు.

* బీపీఎల్‌ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయం ఇప్పటి వరకు అందలేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దానితో కలిపి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. వలస కూలీల కోసం 200 ఫుడ్‌ సెంటర్లు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని నిలదీశారు. మీడియా పట్ల సీఎం కేసీఆర్‌ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో 27 రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారని.. తెలంగాణలో అలా ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వలేదన్నారు. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు 50 శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 15 లేదా 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

* ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు మరో వారం పాటు కఠినంగా అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అప్పటివరకూ ప్రతి రాష్ట్రం, ప్రతి పట్టణం, ప్రతి పోలీస్‌ స్టేషన్‌ స్థాయివరకు దిగ్బంధాన్ని ఎంత పటిష్టంగా అమలు చేస్తారనే విషయంపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. కరోనా వైరస్‌ నుంచి ప్రతీ ప్రాంతం తనను తాను ఎలా రక్షించుకున్నదీ గమనిస్తారు. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాకుండా, వైరస్‌ తీవ్రత తక్కువ ఉంటేనే ఆ ప్రాంతంలో ఆంక్షలు సడలిస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం తన ప్రసంగంలో తెలియజేశారు.

* మహమ్మారి కరోనా మన కంటికి కనిపించని శత్రువని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. లాక్‌డౌన్‌ అమలుతో కొంత వరకు వైరస్‌ను కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. కరోనాపై అందరూ వీరోచితంగా పోరాడాల్సిన అవసరముందని చెప్పారు. ‘‘ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి. నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్‌ చేశాను. మోదీతో మాట్లాడాలని అనుకున్నా. ఇవాళ ఉదయం 8.30కి ప్రధాని నాకు ఫోన్‌ చేశారు. ఆయనకు కొన్ని విధాన పరమైన సూచనలు చేశాను. అంతకుముందు ఆయనకు రాసిన లేఖలోనూ కొన్ని సలహాలిచ్చాను’’ అని చంద్రబాబు చెప్పారు.

* 14 రోజులు పూర్తయిన వాళ్లను ఇంకా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నారని.. నిర్దేశించుకున్న వైద్య విధాన ప్రక్రియను పూర్తిచేసి వారిని ఇళ్లకు పంపించాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఒకటికి రెండుసార్లు పరీక్షలు చేసి నెగిటివ్‌ వస్తే పంపించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్లకు వెళ్లే వారికి పౌష్టికాహారం తీసుకొనేలా సూచనలు చేయాలన్నారు. ఈనెల 16 నుంచి మరోదఫా రేషన్‌ పంపిణీ దృష్ట్యా కౌంటర్ల సంఖ్యను పెంచాలని సీఎం సూచించారు. అర్హత ఉన్నవారు వస్తే రేషన్‌కార్డు ఇవ్వాలని చెప్పారు.

* భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్వాగతించింది. కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యల్ని ఈ సందర్భంగా సంస్థ ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ ప్రశంసించారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. కొవిడ్‌పై పోరులో భారత్‌ దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతుందని కొనియాడారు. అయితే వైరస్‌ వ్యాప్తి విషయంలో ఇది ఎంతవరకు ఫలిస్తుందో చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి దేశప్రజలను రక్షించడానికే మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. భారతీయుల రక్షణ కోసం ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపత్కాల సందర్భంలో రాష్ట్రప్రభుత్వాలు కేంద్రానికి సహకరిస్తున్న విధానం ప్రశంసనీయమని అమిత్‌ షా పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని, సమన్వయాన్ని కొనసాగిస్తూ లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలుపరచాలని సూచించారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు.

* లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన వెంటనే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చివరకు ప్రజల్ని వారిని వారే సంరక్షించుకోవాల్సిన స్థితిలో వదిలేశారని విమర్శించారు. లాక్‌డౌన్‌ నిర్ణయానికి మద్దతునిస్తూనే.. ఆయన ఈ విమర్శలు చేయడం గమనార్హం. ‘‘తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ని పొడిగించడాన్ని మేం అర్థం చేసుకోగలం. ఈ నిర్ణయానికి మేం మద్దతునిస్తున్నాం. కానీ, నిధుల కోసం ముఖ్యమంత్రులు చేసిన అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోలేదు.ఇక నా దేశం ఏడవాల్సిందే’’ అని చిదంబరం ట్వీట్‌ చేశారు.

* కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ‘కొవిడ్ 19 విజృంభణ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధనల కొనసాగింపుగా అన్ని ప్యాసింజర్‌ రైళ్లను మే 3 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. వాటిలో ప్రీమియమ్, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్, సబర్బన్‌, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైల్వే తదితర రైళ్లు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల సరఫరా దృష్ట్యా కొన్ని గూడ్స్‌, పార్శిల్ రైళ్లకు మాత్రం అనుమతి ఉంది’ అని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

* కరోనాపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య, పోలీస్‌ విభాగాల కృషి ఎంతో ఉంది. ప్రాణాలకు తెగించి మరీ వీరు విధుల్లో పాల్గొంటున్నారు. కర్తవ్య దీక్షతో పనిచేస్తున్న పోలీస్ అధికారుల‌తో యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ముచ్చటించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌న్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయ్‌ పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నించారు.

* అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఏడు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఉదయం ఔన్సు బంగారం ధర 1715.25 డాలర్లు పలికింది. ఏడు సంవత్సరాల క్రితం(డిసెంబర్‌ 2012)లో పసిడి ధర 1722.20 డాలర్లుగా నమోదు కాగా.. ఆ తర్వాత పుత్తడికి ఇంత ధరపలకటం ఇదే తొలిసారి. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తితో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నయనే భయాందోళనలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడే సురక్షితమని భావిస్తున్న ఇన్వెస్టర్లు, బులియన్‌ మార్కెట్కు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు.

* అమెరికాలో వేల మంది ప్రాణాలను బలితీసుకుంటున్న కరోనా వైరస్‌ అక్కడి గర్భిణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో గర్భస్రావాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అబార్షన్‌ కేంద్రాలను నిషేధించడంతో అనుమతులున్న ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు వెల్లడించారు. ఇటీవల గర్భస్రావాలకు సంబంధించి తమకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారని, అలాగే నిర్దేశిత సమయం కన్నా ముందే అబార్షన్‌ చేయించుకోడానికి సిద్ధపడుతున్నారని కాన్సాస్‌, ఓక్లహామాలలో క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఓ వైద్యుడు పేర్కొన్నారు.