NRI-NRT

H1B శుభవార్త

H1B శుభవార్త

కరోనా వైరస్‌ మహమ్మారితో అమెరికాలో ఇరుక్కుపోయిన వేలాది భారతీయులకు ఊరట లభించింది. హెచ్‌-1బి వీసాదారుల మరికొంత కాలం ఉండేందుకు దరఖాస్తులు స్వీకరించాలని యూఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక నైపుణ్యం విదేశీయులను అమెరికా కంపెనీలు నియమించుకొనేందుకు హెచ్‌-1బి వీసా ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఏటా భారత్‌, చైనా సహా ఇతర దేశాల నుంచి వేల మందిని అక్కడి టెక్‌ సంస్థలు నియమించుకుంటాయి.

కొవిడ్‌-19 కారణంగా ఇమ్మిగ్రేషన్‌ సవాళ్లు ఎదురయ్యాయని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సేవలు రద్దవ్వడంతో చాలామంది హెచ్‌-1బి వీసాదారులు అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అందులో కొందరి వీసా అనుమతులు త్వరలోనే ముగుస్తాయి. వీరి గడువు పొడిగించేందుకు త్వరలోనే దరఖాస్తుల స్వీకరిస్తామని డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది. వైరస్‌ కారణంగా అధికారిక గడువు ముగిసినా కొందరు ఇక్కడే ఉండిపోయినట్టు తాము గుర్తించామని పేర్కొంది.

‘ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించేందుకు మాకున్న వనరులతోనే మేం జాగ్రత్తగా పనిచేస్తాం. మహమ్మారి సమయంలో అమెరికన్ల ఉపాధి, విధానాలు, ప్రక్రియలను పరిగణనలోకి తీసుకుంటాం. అభ్యర్థులు సరైన సమయంలో దరఖాస్తులు చేస్తే వారు చట్టవిరుద్ధంగా ఉంటున్నట్టుగా భావించం. ప్రస్తుత యజమాని, ఇప్పుడున్న నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఉంటే 240 రోజుల గడువు దానంతట అదే లభిస్తుంది. కరోనాతో కాకుండా ఇతర కారణాలతో దరఖాస్తులు ఆలస్యమైతే కష్టం’ అని డీహెచ్‌ఎస్‌ తెలిపింది.

యూఎస్‌ సిటిజెన్‌, ఇమ్మిగ్రేషన్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకారం హెచ్‌-1బి వీసాల ద్వారా భారతీయులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని తెలిసింది.