ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జగన్ ప్రభుత్వం పదవీకాలం, సర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ఆధారంగా నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. అయితే వీటిపై హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఓ అంశం కలిసి రానుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ఆధారంగా ఆయన తనపై వేటు చెల్లదని చెప్పుకునే అవకాశముందని చెప్తున్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. వీటిలో ఒకటి కమిషనర్ పదవీకాలం తగ్గింపు, రెండు సర్వీస్ రూల్స్ సవరణ ద్వారా అర్హతలను మార్చడం. ఇందులో పదవీకాలం తగ్గింపు ద్వారా కమిషనర్ ను ఆటోమేటిగ్గా తప్పుకునేలా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది. ఇందులో పదవీకాలం తగ్గింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా దానితో పాటే చేసిన సర్వీస్ రూల్స్ సవరణ మాత్రం కీలక ప్రశ్నలను లేవనెత్తేలా ఉంది. నిమ్మగడ్డ తొలగింపు కోసం జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో ప్రధానమైన అంశం అర్హతల మార్పు. పదవీకాలం మార్చడం ద్వారా ప్రస్తుత కమిషనర్ ను పదవికి అనర్హుడిగా మార్చడం వరకూ సరిపోతున్నా.. కొత్తగా ఆ పదవిలోకి వచ్చే కమిషనర్ కోసం సర్కారు తీసుకొచ్చిన కొత్త అర్హత ఇప్పుడు కీలకంగా మారుతోంది. కొత్తగా కమిషనర్ పదవిలోకి వచ్చే వారు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అయి ఉండాలన్న నిబంధన పైకి చూసేందుకు బాగానే ఉన్నా.. అది ప్రస్తుత కమిషనర్ తొలగింపు కోసం వాడుకున్నట్లు అవుతోంది. అదే ఇప్పుడు ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించేలా ఉంది. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు రాజ్యాంగ పరంగా కొన్ని రక్షణలు ఉన్నాయి. కమిషనర్ ను తొలగించాలంటే హైకోర్టు న్యాయమూర్తి తరహా అభిశంసన ప్రక్రియ ద్వారా ఉద్వాసన ఒకటి కాగా, సర్వీసు నిబంధనల మార్పు రెండవది. ఇందులో సర్వీసు నిబంధనల మార్పు కూడా కమిషనర్ కు నష్టం కలగకుండా ఉండాలనే రక్షణ కూడా ఉంది. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో పదవీకాలం మార్పుతో పాటు సర్వీసు నిబంధనలను మార్చడం ( అర్హతల మార్పు ) ఇప్పుడు మొత్తం ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించేలా ఉంది. ఎన్నికల కమిషనర్ గా తన తొలగింపు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో సర్వీసు నిబంధనల మార్పు అంశాన్నే ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావించబోతున్నారు. పదవీకాలం మార్పు విషయంలో తనకు రాజ్యాంగ రక్షణ లేకపోయినా పదవిలో ఉన్న తనకు నష్టం కలిగించే సర్వీసు నిబంధనలను మార్చకూడదన్న ఆర్టికల్ 243k ప్రస్తావనను నిమ్మగడ్డ ప్రధానంగా హైకోర్టు దృష్టికి తీసుకురానున్నారు. దీంతో ఇప్పుడు ఆర్డినెన్స్ లో ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్న చర్చ నడుస్తోంది.
నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ సర్కార్ ఇది మరిచింది
Related tags :