###############
* ఎమ్.ఎన్.రాయ్ తొలి భార్య విషయం గోప్యంగా ఎందుకుంచారు? *
ఎమ్.ఎన్.రాయ్ అత్యున్నత స్థాయిలో సోవియట్ యూనియన్ లో రాజకీయాలు కొనసాగిస్తుండగా అనుకోని పరిణామం జరిగింది. భారత కమ్యూనిస్టులకు, అభ్యుదయవాదులకు సహాయపడే నిమిత్తం యూరోపు నుండి పత్రికలు నడుపుతూ ఓడల ద్వారా వాటిని అందిస్తూ రాయ్ దంపతులు నిర్విరామ కృషిలో నిమగ్నులయ్యారు. అయితే బ్రిటీష్ పోలీస్ రాయ్ ని వెంటాడుతుండడం వల్ల అతను తరచు వివిధ ప్రదేశాలు మారుస్తూ రష్యా వెళ్ళివస్తూ గడపవలసి వచ్చింది. యూరోప్ లో ఆయన లేని లోటును ఎవిలిన్ తీరుస్తూ పత్రికలు ఆగకుండా నడుపుతూ సిద్ధాంతపరమైన రచనలు చేస్తూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. ప్రామాణికమైన పరిశోధనా వ్యాసాలను రాసి ఎవిలిన్ ప్రచురించింది. అయితే ఆవిడ శాంతిదేవి అనే పేరుతో కార్యకలాపాలు కొనసాగించింది. అన్యోన్యంగా సంసారాన్ని పదేళ్ళపాటు సాగించిన రాయ్ దంపతుల మధ్య పెద్ద అవాంతరం ఏర్పడింది. అది అనూహ్యమైన సంఘటన. ఆ వివరాలకి పోయే ముందు ఎవిలిన్ జీవిత పరిణామాన్ని సంక్షిప్తంగా ప్రస్తావిద్దాం. ఎవిలిన్ పూర్తి పేరు ఎవిలిన్ లియొనారా ట్రెంట్ (1892-1970). ఆమె తండ్రి లెమార్టిన్ ఛార్లెస్ ట్రెంట్. తల్లి మేరీ డిలోమ్ నెక్లోడ్. తండ్రి గనుల ఇంజనీరుగా పేరు ప్రఖ్యాతులు గాంచి జపాను కూడా ఓడలో వెళ్ళివచ్చాడు. వారు సాల్ట్ లేక్ సిటీ నుంచి కాలిఫోర్నియాకు మారారు. ఎవిలిన్ 8వ బిడ్డగా వారి సంతానంలో ఆఖరి కుమార్తె. ఆమె హైస్కూలులోనూ, పోలిటెక్నిక్ లోనూ చాలా చురుకైన విద్యార్థిని. 1912 నాటికి స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చేరి 1915కు కోర్సు పూర్తి చేసింది. యూనివర్సిటీ ఛాన్సలర్ డేవిడ్ జోర్డాన్ స్టార్ కు, అతని భార్యకు సన్నిహితురాలయింది. అదే సమయంలో ఎథెల్ రే డుగాన్ అనే యువతి స్నేహితురాలిగా ఉండేది. ఎవిలిన్ ఆటలలోనూ, కళా రంగంలోనూ అత్యుత్సాహంతో పాల్గొంటుండేది. స్టాన్ ఫర్డ్ లో కోర్సు పూర్తి చేసిన తర్వాత పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పటం, యూనివర్సిటీలో వున్న బెంగాలీ విద్యార్థులతో రవీంద్రనాథ్ ఠాగోర్ గురించి చర్చించటం, యూనివర్సిటీ పత్రికలో రాయటం, ఆవిడ పేరును బాగా వెలికి తెచ్చాయి. ఆమె స్నేహితురాలు ఎథెల్ డుగాన్, ధన్ గోపాల్ ముఖర్జీని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంది. ఆ దశలో ఎమ్.ఎన్.రాయ్ అక్కడికి రావడం ధనగోపాల్ సూచనపై తన పేరు నరేంద్రనాథ్ నుండి మానవేంద్రనాథ్ గా మార్చుకోవడం గమనించదగిన విషయం. ధనగోపాల్ ద్వారా రాయ్ కు ఎవిలిన్ పరిచయం అయ్యింది. భారత విప్లవకారుడు జాదూగోపాల్ ముఖర్జీకి ధన్ గోపాల్ కు సన్నిహిత పరిచయం వున్నది. అప్పటి నుండి మానవేంద్రనాథ్ పేరు స్థిరపడింది. ఎథెల్ రే డుగాన్ – ధన గోపాల్ పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకోగా – రాయ్ ఎవిలిన్ లుకూడా పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కానీ ఎవిలిన్ కుటుంబం ఎదురు తిరిగి అందుకు అంగీకరించలేదు. కానీ ఎవిలిన్ రాయ్ పట్ల ఆకర్షణతో కుటుంబాన్ని ఎదిరించి రాయ్ తోపాటు వుండిపోయింది. అక్కడ కూడా పోలిస్ గూఢచారులు వెంటబడటంతో వారిరువురు న్యూయార్క్ కు వెళ్ళిపోయారు. అక్కడ ఎవిలిన్ సోదరుడు ఉన్నప్పటికీ అతడు ఏమాత్రం సహయపడలేదు. అందువల్ల ఎవిలిన్ ఏవో చిన్నా చితకా పనులు చేసి కొద్దో గొప్పో సంపాదించి జీవితాన్ని గడపవలసి వచ్చింది. వెంట వెంటనే నివాస ప్రాంతాలు కూడా మార్చుకోవలసి వచ్చింది. న్యూయార్క్ లోని ఒక సిలోన్ రెస్టారెంట్ అడ్రస్ ఇచ్చి తమకు వచ్చే ఉత్తరాలు తెప్పించుకున్నారు. న్యూయార్క్ లో వున్న కొందరు భారత విప్లవకారులు కూడా ఎవిలిన్ ను పెళ్ళి చేసుకోవటం పట్ల రాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ దశలో పంజాబ్ కేసరిగా పేరొందిన భారత స్వాతంత్ర్య యోధుడు లాలాలజపతి రాయ్ న్యూయార్క్ లో వుంటూ కొంతమేరకు రాయ్ దంపతులకు సహాయపడ్డారు. తన పనులు కొన్ని వారికి అప్పగించి అవి చేసిపెట్టినందుకు డబ్బిచ్చేవారు. ఈలోగా పొలీసులు రాయ్ ను నిర్బంధించి 1917 మార్చి 7న విచారించారు. గ్రాండ్ జ్యూరీ రాయ్ ను విడుదల చేస్తూ మళ్ళీ పిలిచినప్పుడు హాజరు కావడానికి సిద్ధంగా వుండమన్నారు. అదే ఆసరాగా తీసుకుని రాయ్ దంపతులు రైలులో మెక్సికో సరిహద్దుల వరకు వెళ్ళిపోయారు. న్యూయార్క్ లో పెళ్ళి చేసుకున్నందున వారికి పెళ్ళి సర్టిఫికెట్ లభించింది. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యక్షులు ఇచ్చిన పరిచయ లేఖ వలన మెక్సికోలో ప్రవేశించి చరిత్ర మలుపులు తిప్పగలిగారు. ఆ తరువాత మెక్సికోలో వారి పాత్ర చరిత్రాత్మకమైనది. అక్కడ నుండి వారు మాస్కో రావడం లెనిన్ ఆహ్వానంపై అత్యున్నత స్థానంలో వుండడం వేరే చోట విస్తారంగా వివరించాం. ఎవిలిన్ తన దేవత అని శ్లాఘిస్తూ తన వెంటే అన్నిచోట్లకూ రాయ్ తీసుకు వెళ్ళేవారు. ఎవిలిన్ మేథస్సు వ్యక్తీకరణకు తోడ్పడటమే గాక రాజకీయాల్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కోవటంలోనూ రాయ్ కు అండగా నిలిచింది. తొలుత జర్మనీలో ప్రవేశించినపుడు రాయ్ దంపతులు ఆరునెలలు అక్కడే వుండటం వలన అనేకమంది జర్మన్ కమ్యూనిస్టు మేథావులను కలుసుకొని చర్చించగలిగారు. కమ్యూనిస్టు పార్టీ మానిఫెస్టో ముసాయిదాను తయారు చేశారు. ఆ తరువాత రష్యాలో రాయ్ వెంట అన్నిచోట్లకూ వెళ్లి కమ్యూనిస్టు మేథావులను ఎవిలిన్ కలుసుకోవటమే గాక రాజకీయ పాఠాలు కూడా నేర్పింది. తాష్కెంట్ లో ఏర్పడిన ప్రవాస భారత కమ్యూనిస్టు పార్టీలో ఎవిలిన్ కు కార్యవర్గంలో స్థానం లభించింది. తిరిగి మాస్కో వచ్చి భారత కమ్యూనిస్టు పార్టీకి తోడ్పడే నిమిత్తం యూరోపులో రాయ్ తో పాటు అష్టకష్టాలు పడింది. ఇంటర్నేషనల్ ప్రెస్ కరస్పాండెన్స్, మాసెస్, వాన్ గార్డ్, అడ్వాన్స్ వాన్ గార్డ్ అనే సిద్ధాంత పత్రికలు నడపటంలో రాయ్ తోపాటు సిద్ధహస్తురాలయ్యింది. యూరోపులో పరిచయమయిన భారత, బ్రిటీషు కమ్యూనిస్టులతో చర్చలు జరిపింది. ఇల్లు వదలి రాయ్ తో పాటు వచ్చేసిన తర్వాత ఎవిలిన్ అప్పుడప్పుడూ తన అనుభవాలనూ, పరిచయాలనూ తెలియజేస్తూ… తల్లికి ఉత్తరాలు రాసేది. అందువల్ల కూడా కొంత సమాచారం లభించింది. రాయ్ ఆమెకు రాసిన కొద్ది లేఖలు జాగ్రత్తగా అట్టిపెట్టుకున్నది. రాయ్ దంపతులకు కుటుంబ మిత్రుడుగా, సన్నిహితుడుగా ఉన్న ఇండొనేషియా కమ్యూనిస్టు నాయకుడు స్నీవ్ లైట్ తో ఎవిలిన్ ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేది. యూరోపులో గడపడం రాను రాను రాయ్ కు కష్టమైపోయింది. అందువలన మళ్ళీ రష్యా వెళ్ళిపోయాడు. ఎవిలిన్ యూరోపులో కొనసాగుతుండగా హఠాత్తుగా 1925 ప్రాంతాలలో రాయ్ నుండి ఎడబాటు కబురు అందింది. ఆమెను అమెరికా వెళ్ళిపొమ్మని సలహా ఇచ్చాడు. కారణాలేమీ చెప్పలేదు. ఎవిలిన్ చాలా పర్యాయాలు రాయ్ ను కలుసుకోవటానికి మాట్లాడటానికి ప్రయత్నించినా సాఫల్యంకాలేదు. కారణాలు అడిగినా అతడేమీ సమాధానం చెప్పలేదు. కారణాలేమిటో కనుక్కోమని స్నీవ్ లైట్ ను కోరింది. అతడు కూడా ఆ విషయంలో నిస్సహాయుడైపోయాడు. ఇక తప్పనిసరి పరిస్థితులలో ఎవిలిన్ అయిష్టంగానే అమెరికా వెళ్ళిపోయింది. ఇదంతా పెళ్ళయిన పది సంవత్సరాలకు జరిగిన ఘట్టం. ఎమ్.ఎన్.రాయ్ ఉత్తరోత్తరా ఇండియాలో తన జీవిత చివరి దశలో స్వీయ అనుభవాలు చాలా విపులంగా ఆకర్షణీయంగా రాశారు. కానీ ఎవిలిన్ తో విడిపోయే వరకే రాసి ఆపేశారు. ఇక్కడ అర్థం కానిది, ఆశ్చర్యకరమైనది ఏమంటే అబద్ధాలని వేటాడటం తన వృత్తి అని చెప్పుకున్న ఎమ్.ఎన్.రాయ్ తన మొదటి భార్య సంగతి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇది కావాలని చేసిన పనిగా స్పష్టపడుతున్నది. చివరి దశలో ఆయన తన జీవితాన్ని చెబుతుండగా రెండవ భార్య ఎలెన్ సంక్షిప్త లేఖినిగా రాసిందంటారు. కనుక మొదటి భార్య విషయం చెప్పటానికి సంకోచించాడా…? మొహమాట పడ్డాడా…? అనేది చర్చనీయాంశం. రాయ్ రాస్తున్నప్పుడే రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికలో అది సీరియల్ గా వెలువడింది. తన ప్రస్తావన ఎక్కడైనా తెస్తాడేమోనని పత్రిక తెప్పించుకొని ఎవిలిన్ చాలా నిరుత్సాహపడింది. మొత్తం మీద రాయ్ జీవితంలో అదొక లోటుగానూ, మచ్చగానూ మిగిలిపోయింది. రాయ్ ను గురించి తెలుసుకోవటానికి ఇండియా, ఇంగ్లండ్, అమెరికాలలో కొందరు రాజకీయ పండితులు ప్రయత్నించినపుడు ఎవిలిన్ సదభిప్రాయాలనే వెల్లడించింది. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో వున్న రాజకీయ అధ్యాపకులు రాబర్ట్ నార్త్ ద్వారా సమాధానాలిచ్చింది. ఆమె ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల చాలా కాగితాలు డైరీలు తగలబడిపోవడంతో ఆ సమాచారం లేకుండా పోయింది. ఎమ్.ఎన్. రాయ్ రెండవ భార్య ఎలెన్ మొదటి భార్యతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది.
Evelyn writings
1920: An Indian Communist Manifesto
1922: The Crisis in Indian Nationalism
1922: The Fourth Anniversary of the Red Army in Moscow
1922: The Famine in Russia: How the Capitalist States Helped
1922: The Debacle of Gandhism
1922: The Truth about the Sikh Rebellion
1923: The Funeral Ceremony at Gaya
1923: Politics in Gaya
1923: The Metamorphosis of Mr C. Das
1923: Mahatma Gandhi: Revolutionary or Counter-Revolutionary?
1924: Some Facts About the Bombay Strike
1924: The Revolution in Central Asia—The Struggle for Power in Holy Bokhara, pt. I
1924: The Revolution in Central Asia—The Struggle for Power in Holy Bokhara, pt. II
1925: Indian Political Exiles in France
Evelyn Trent as Moderator of World News of San Francisco Chronical in 1928
Evelyn Roy in Moscow
EVELYNS’ FAMILY
Evelyn, Louise, Suzie, Francis Meredith
Diven Merideth, Adele, Evelyn, Louise – 1968
Dorothy Cooper and Evelyn Trent
###############
* చైనా విప్లవంలో ఎమ్.ఎన్.రాయ్ పాత్ర (1927) *
ఎమ్.ఎన్.రాయ్ తన భార్య ఎవిలిన్ ను అర్ధాంతరంగా అమెరికా వెళ్ళిపొమ్మని, కారణం ఏం చెప్పకుండా ఆమె అడిగినా సమాధానం ఇవ్వకుండా వింతగా ప్రవర్తించాడు. గత్యంతరం లేక ఎవిలిన్ అయిష్టంగానే అమెరికా వెళ్ళిపోయింది. రాయ్ రష్యాలో వుంటూ తన పనులు చూసి పెట్టటానికి లూసీ గైస్లర్ ను నియమించుకున్నాడు. ఆమె జర్మన్ కమ్యూనిస్టు. రోజా లగ్జెంబర్గ్ పెంపొందించిన కమ్యూనిస్టు ఉద్యమంలో ఆమె పనిచేసింది. అయితే 1919లో రోజా లగ్జెంబర్గ్ ను జర్మనీలో చంపేసిన తర్వాత ఈమె ఉద్యమంలో కొనసాగుతూ రాయ్ సన్నిహితురాలయింది. లోగడ ఎవిలిన్ చేసిన పనులన్నీ రోజా చేపట్టి కార్యదర్శివలె పనిచేసింది. రష్యా రాజకీయాల్లో స్టాలిన్ కు సన్నిహితుడుగా అగ్రస్థాయి నాయకుడుగా ఉన్న ఎమ్.ఎన్.రాయ్ కొత్త పాత్రను నిర్వహించవలసి వచ్చింది. ఆయన చైనా వెళ్ళి అక్కడ జరుగుతున్న పోరాటాలలో కమ్యూనిస్టు పార్టీకి తోడ్పడవలసిందిగా సోవియట్ నాయకత్వం కోరింది. అప్పటికే రాయ్ చైనా విషయంలో చాలా అధ్యయనం చేశారు. అది దృష్టిలో పెట్టుకుని రాయ్ కు కొత్త బాధ్యతలు అప్పగించారు. రాయ్ తన బృందంతో చైనా వెళ్ళేసరికి అప్పటికే బరోడిన్ అక్కడ వున్నాడు. లోగడ బరోడిన్ మెక్సికోలో రాయ్ ను కలిపినప్పటి నుంచి వారు సన్నిహిత మిత్రులుగా వున్నారు. చైనాలో వారిరువురు అవలంబించిన ధోరణి భిన్నరీతులలో సాగింది. 1920 నాటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి పనిచేస్తున్నది. సన్ ఎట్ సన్ కొమిన్ టాంగ్ ఆధ్వర్యాన 1924లో కమ్యూనిస్టుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అది జాతీయ ప్రభుత్వం. లోగడ భారత దేశ విప్లవానికి సహాయపడమని ఎమ్.ఎన్.రాయ్ సన్ ఎట్ సన్ ను కలిశారు. అప్పుడు నరేంద్రనాథ్ పేరుతో కలిశారు. ఆ పరిస్థితులు వేరు. ప్రస్తుతం రాయ్ చైనా వెళ్ళేసరికి 1925లోనే సన్ ఎట్ సన్ మరణించాడు. ఆయన స్థానంలో నాయకుడుగా ప్రభుత్వ అధికారాన్ని వాంగ్ చిన్ వై చేపట్టాడు. కమ్యూనిస్టుల సహకారం వారికి వున్నది. రాయ్ వెళ్ళి వచ్చేసరికి బరోడిన్ ఒక ధోరణిలో ఉద్యమానికి సహకరిస్తున్నాడు. జాతీయ బూర్జువా వర్గంతో సహకరిస్తూ సామ్రాజ్య వాదంపై పోరాడాలని చైనా కమ్యూనిస్టులు భావించారు. రష్యా ప్రభుత్వం కూడా ఇందుకు మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో 1926లో చాంగ్ కై షేక్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతేగాక ఉత్తరాది దండయాత్ర కూడా ప్రారంభించాడు. కమ్యూనిస్టులు దీనిని బలపరిచారు. గాలెన్ అనే రష్యా సైనిక సలహాదారు ఈ పథకాన్ని సమర్ధించాడు. రైతులు, కార్మికులు ఇందులో బాగా చేరిపోయారు. దండయాత్ర ముందుకు సాగింది. షాంగైలో ప్రవేశించిన దండయాత్రలో కార్మికులపై దారుణ హింసలు చేశారు. కార్మిక సంఘాలు రద్దు చేశారు. ఇదంతా అవకాశవాదమని రాయ్ ఖండించారు. గ్రామాలలో కమ్యూనిస్టులు బలపడి గ్రామ పాలనలు అధీనం చేసుకుని పార్టీ నిలదొక్కుకున్న తరవాత ఉత్తరాది యాత్ర సాగించాలని రాయ్ కోరాడు. రాయ్ పక్షానికి, బరోడిన్ పక్షానికి వ్యతిరేకత ఏర్పడింది. కార్మికులు, కర్షకులు బలపడిన తర్వాత దండయాత్ర సాగించాలని, ఇంతవరకు ఉద్యమాన్ని లోతుపాతులతో బలపరచాలని రాయ్ కోరాడు. ఈ విషయంలో బరోడిన్ కు రాయ్ కు తేడా వచ్చింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించమని 1926 నవంబర్ లో అత్యవరసర సమావేశం ఏర్పాటు చేశారు. 1926లో చాంగ్ కై షేక్ ప్రభుత్వాన్ని వశం చేసుకోగా అప్పటివరకూ పెత్తనం చెలాయిస్తున్న వాంగ్ చిన్ వై దేశం వదిలి వెళ్ళిపోయాడు. ఉత్తరాది యాత్ర సాగుతుండగా కమ్యూనిస్టులు అదే అదనుగా విప్లవాన్ని విస్తరింపచేయవచ్చునని బలపరిచారు. ఊహాన్ నగరాలు ఆక్రమించుకున్నారు. విప్లవ ప్రభుత్వం అక్కడ కేంద్రాన్ని ఏర్పరచింది. అదంతా కమ్యూనిస్టు విజయంగా చెప్పుకున్నా గ్రామస్థాయిలో పట్టు ఏర్పరచటంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. షాంగ్ కై షేక్ కార్మికులను దారుణంగా అణిచివేశాడు. కార్మిక సంఘాలు రద్దు చెయ్యమన్నాడు. విప్లవానికి వ్యతిరేకంగా చియాంగ్ సాగిపోతున్న అతన్ని వ్యతిరేకిస్తే జాతీయవాదులు సహకరించరని బరోడిన్ వర్గం భావించింది. ఎమ్.ఎన్.రాయ్ ఈ విషయంలో విప్లవం ఎలా తప్పుదోవన పడుతున్నదీ హెచ్చరిస్తూ పోయాడు. రష్యానుండి వచ్చిన ఇరు ప్రతినిధి వర్గాల తీవ్రమైన అభిప్రాయ బేధం రావడం వలన 1926 నవంబర్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అప్పట్లో యువ నాయకుడుగా వున్న మావో సెటుంగ్ కూడా ఆ సమావేశానికి వచ్చారు. ఆయన రాయ్ ని చూడటం అదే మొదలు. కానీ వారు ఎక్కువగా చర్చలు చేసుకునే అవకాశం కలగలేదు. హాంకౌలో కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గాన్ని రాయ్ ఏర్పాటు చేశాడు. రైతు, కార్మిక సంఘాలు బలపడి ఉద్యమాన్ని లోతుగా తీసికెళ్లాలని గ్రామస్థాయిలో పెత్తనం చేజిక్కుంచుకోవాలని కోరాడు. రాయ్ కోరిన మేరకు తీర్మానాలు చేశారు. బరోడిన్ ఈ విషయంలో రాయ్ ని వ్యతిరేకిస్తూ అలా చేస్తే వామపక్షం వారికి కమ్యూనిస్టులకు సహకారం ఉండదని వాదించాడు. రాయ్ సర్వాధికారాలతో రష్యానుండి వచ్చినా ఆర్థికపరమైన కీలకమంతా బరోడిన్ చేతిలో వుండటం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అదీగాక బరోడిన్ నాలుగేళ్ళ నుండే చైనాలో వుండటం వలన అందరితో పరిచయాలు పెరిగి ఆయన చెప్పినట్లు వినసాగారు. రాయ్ విబేధించిన తర్వాత చైనాలో వాంగ్ చిన్ వై రష్యానుండి కచ్చితమైన హామీ కోరాడు. ఆమేరకు రాయ్ రష్యాతో సంప్రదించి ఒక టెలిగ్రాం పంపించమని కోరాడు. మాస్కో నుండి సందేశం స్వయంగా చూస్తే తాను రాయ్ చెప్పినట్లు వింటానన్నాడు. వాంగ్ కోరిన ప్రకారం మాస్కో నుండి వచ్చిన టెలిగ్రాంను రాయ్ అతనికి చూపించాడు. వెంటనే ఆ సందేశాన్ని వాంగ్ తన అనుచరులకు కూడా అందజేశాడు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వున్న వారికి రష్యా సందేశం మంచి ఆయుధం అయింది. కమ్యూనిస్టులను చైనా ద్రోహులంటూ కొమిన్ టాంగ్ నుండి బహిష్కరించారు. రష్యా నుండి వచ్చిన సలహాదారులను వెంటనే వెళ్ళిపొమ్మన్నారు. ఆ దశలో తిరోగమనానికి సిద్ధం కావాలని బరోడిన్ ఇచ్చిన సలహాలు కమ్యూనిస్టు పార్టీ పాటించింది. అయితే రాయ్ అప్పట్లో బరోడిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళటానికి నిరాకరించాడు. మరొకవైపు కమ్యూనిస్టులను దారుణంగా హింసించాడు, నిర్దుష్టమైన విప్లవమార్గం చేపట్టాలని రాయ్ చేసిన సూచనలు నిరాకరించటంతో చైనా కమ్యూనిస్టులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయంలో రాయ్ తప్పు చేశాడని కానీ ఆయన నిర్ణయాలు వక్రమార్గాన పడ్డాయని కానీ సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అధికారికంగా అనలేదు. కానీ కమ్యూనిస్టులకు చైనాలో తాత్కాలికంగా ఎదురు దెబ్బ తగిలింది. చైనాలో ఎదుర్కొంటున్న ప్రమాదపరిస్థితుల దృష్ట్యా రాయ్ ప్రతినిధి వర్గం, బరోడిన్ ప్రతినిధి వర్గం రష్యా వెళ్ళిపోవలసి వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు రాయ్ వర్గం చాలా ఇబ్బందులకు గురయ్యారు. గోబీ ఎడారిలో ఒకసారి చిక్కుకు పోగా కార్లు కదలకుండా నిలిచిపోగా, హఠాత్తుగా, అకాలంగా వర్షం పడింది. అందువలన ఇసుకలో చిక్కుకున్న కార్లు మళ్ళీ ప్రయాణం చెయ్యగలిగాయి. మొత్తం మీద ప్రతినిధి వర్గం సురక్షితంగా మాస్కో చేరింది. చైనాలో జరిగిన విషయాలూ పూర్వాపరాలూ అన్నీ లోతుపాతులతో రాయ్ సుదీర్ఘంగా రాశాడు. ది చైనీస్ రివల్యూషన్ అనే రాయ్ రచన నిర్దుష్టమైన ఆధారాలతో రష్యన్ భాషలో వెలువడింది. రష్యన్ స్టేట్ పబ్లిషింగ్ డిపార్డ్ మెంట్ దీన్ని వెలువరించింది. ఈ గ్రంథానికి కావలసిన విషయ సేకరణ అంతా రాయ్ నాటి రష్యా ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఇతర భాషలలో దీనిని ప్రచురించరాదని సోవియట్ ప్రభుత్వం ఏ కారణాలు చేతనో ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ గ్రంథం బయట పెట్టవలసిన బాధ్యత రష్యా ప్రభుత్వానిది. అప్పుడు చైనాలో రాయ్ పాత్ర ఇంకా సమగ్రంగా బయటపడుతుంది. చైనాలో రాయ్ చేసిన పనుల గురించి రాబర్ట్ సి. నార్త్ మరొక ప్రొఫెసర్ తో కలిసి పరిశోధన చేసి వెలువరించారు. అది లభిస్తున్నది.
###############