* దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 170 జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా ప్రకటించింది. లాక్‌డౌన్ కాలం పొడిగించినందున అవకాశం ఉన్నంత మేరకు కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు. హాట్ స్పాట్ జిల్లాలతో పాటు కంటైన్‌మెంట్ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు.
* తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 650కి చేరింది. వీరిలో 118 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా…18 మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 514 మంది చికిత్స పొందుతున్నారు.
* కరోనా లాక్‌డౌన్ సమయంలో భౌతిక దూరం వంటి నిబంధనలను అతిక్రమించి మంగళవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లో వేలాదిమంది వలసదారులు గుమిగూడారు. కాగా, ఈ ఘటనలో సుమారు 1000 మందిమీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని…ఈ ఘటనకు బాధ్యుడని భావిస్తున్న వినయ్ దూబె అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల అనంతరం ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన… తదనంతరం లాఠీఛార్జికి కూడా దారితీసింది.
* దేశవ్యాప్తంగా 170 జిల్లాలు కరోనా వ్యాప్తికి ప్రజ్వలన కేంద్రాలు (హాట్‌స్పాట్స్)గా గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్‌జోన్‌లోనూ ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సంయుక్త మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
* క్వారంటైన్ కేంద్రంలో గడువు పూర్తయిన కరోనా అనుమానితులందరికీ రూ.2వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాలల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించాలని.. రోజువారీ కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
* కరోనా వైరస్‌పై యావత్ దేశం పోరాడుతోంది. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు అహర్నిశలూ శ్రమిస్తుండగా.. ప్రజలంతా భౌతిక దూరం పాటించేలా పోలీసులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో బుల్లి యంత్రాలైన డ్రోన్లు తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలను భౌతిక దూరం పాటించడంతో పాటు క్రిమి సంహారక మందుల పిచికారీకి ఉపయోగపడుతున్నాయి.
* వారం రోజుల్లోనే 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల ఆదాయపన్ను రీఫండ్ బదిలీ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. కొవిడ్-19 పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడొద్దని వేగంగా ఈ ప్రక్రియ చేపట్టామని వెల్లడించింది. పెండింగ్‌లో ఉన్న రూ.5 లక్షల్లోపు రీఫండ్లు వేగంగా చెల్లిస్తామని గతవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
* ఈ సంవత్సరం మనదేశంలో సాధారణ వర్షపాతం ఉండొచ్చని బుధవారం భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ‘2020లో వర్షపాతం పరిమాణం 5 శాతం అటూఇటుగా దీర్ఘకాలిక సగటులో 100 శాతంగా ఉండనుంది’ అని ఎర్త్‌సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలకు సంబంధించి లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్ మొదటి దశలో ఐఎండీ వివిధ ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యే తేదీలను అంచనా వేసింది.
* ప్రపంచ ఆరోగ్యసంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచంలో సంచలనం సృష్టించింది. బిల్‌గేట్స్‌తో పాటు అనేక దేశాలు ఈ చర్య తగదన్నాయి. అయితే చైనాలో ప్రారంభమైన మహమ్మారి కరోనా గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో ఆరోగ్యసంస్థ విఫలమైందన్నది అమెరికా ఆరోపణ. దీంతో పాటు చైనా వైపు పక్షపాత ధోరణితో వ్యవహరించిందని అమెరికా.. తదితర దేశాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచంలో ఐరాస సభ్యత్యమున్న దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ ఆరోగ్యసంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (వ్హో)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపివేశారు. అమెరికా ప్రజల క్షేమాన్ని కోరని ఆ సంస్థకు అమెరికన్లు చెల్లించిన పన్నుల్లోంచి ఒక్క డాలరూ విడుదల చేయనని తెగేసి చెప్పారు. సరైన సమయంలో కచ్చితత్వంతో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను ‘చైనా వైరస్’ అని పదేపదే ఆరోపించారు. ఆయన నిర్ణయంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అవాక్కయ్యాయి. వైరస్‌కు సరిహద్దులు లేవన్నాయి. ఐకమత్యంతో ఉండాల్సిన తరుణంలో ఇలా చేయడం సరికాదని చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలన్నీ అనడం గమనార్హం.