WorldWonders

కిమ్ కంట్రీలో కరోనా వస్తే కాల్చేస్తారు

కిమ్ కంట్రీలో కరోనా వస్తే కాల్చేస్తారు

నావెల్‌ కరోనా వైరస్‌ గతేడాది చివర్లో వుహాన్‌లో పురుడు పోసుకుంది. చైనాలోని ప్రధాన నగరాల్లో సంక్రమణ చెందింది. సరిహద్దులు దాటింది. విదేశాల్లో అడుగుపెట్టింది. దేశం మారినప్పుడల్లా దాడి చేసే పద్ధతిని మార్చుకుంది. ఇప్పుడు సమస్త భూమండలాన్నీ తన గుప్పిట బంధించింది. నగరాలు, రాష్ట్రాలు, దేశాలని లాక్‌డౌన్‌ చేయించింది.

ఆధునిక వైద్య సదుపాయలకు పేరెన్నికగన్న అగ్రరాజ్యాలను వణికిస్తున్న కొవిడ్‌-19 వ్యాప్తిని చిన్న చిన్న దేశాలు సమర్థంగా అడ్డుకున్నాయి. తజికిస్థాన్‌, దక్షిణ సుడాన్‌, యెమెన్‌, బురుండి, మాలవి, లెసెథో వంటి దేశాల్లో వైరస్‌ వ్యాప్తి లేదు. ప్రపంచానికి ఓ కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాలోనూ కరోనా కేసులు నమోదు కాలేదు. చైనాకు పక్కనే ఉండే ఈ దేశం ఇంతకీ ఏం చేసిందో తెలుసా!?

*** కాల్చేయడం నిజమా?
ఉత్తర కొరియా అంటే గుర్తొచ్చేవి ఆ దేశ నియంత పాలకుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, క్షిపణి ప్రయోగాలు. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో సమాచారం ఉండదు. ప్రజల జీవిన విధానం, స్వేచ్ఛ, హక్కుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రపంచ దేశాలతో ఉత్తర కొరియాకు ఉన్న దౌత్య సంబంధాలు అంతంత మాత్రమే. దాదాపుగా చైనాతోనే 90% వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. నేరుగా ఆ దేశానికి వెళ్లలేరు. చైనా నుంచే అక్కడికి చేరుకోవాలి. విదేశీ పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీసుకోవడానికి వీల్లేదు. స్థానికులతో మాట్లాడేందుకు అవకాశం ఉండదు. అక్కడి వ్యవస్థ గురించి ఆరాతీస్తే ఇక అంతే సంగతులు. మరి ఇలాంటి దేశం కొవిడ్‌-19 మహమ్మారిని అడ్డుకోవడం ఆశ్చర్యమే. అయితే.. ఎవరికైనా కరోనా సోకితే తుపాకీతో కాల్చి చంపేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న చిత్రాలు మాత్రం అవాస్తవమే.

*** సరిహద్దులు బంద్‌
చైనాలో గతేడాది చివర్లోనే నావెల్‌ కరోనా వైరస్‌ విజృంభించింది. ఈ విషయం తెలియగానే కిమ్‌ కఠిన చర్యలకు ఆదేశించారు. జనవరి నుంచే దేశ సరిహద్దులను మూసేయించారు. అంతర్జాతీయ విమాన, రైలు ప్రయాణాలను నిషేధించారు. వాస్తవంగా 90 శాతం ప్రయాణాలన్నీ చైనాకే ఉంటాయి. సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు బంద్‌ చేయించారు. విదేశాలకు వెళ్లేందుకు స్థానికులకు అనుమతి ఇవ్వలేదు. బయట నుంచి వచ్చేవారికి కఠిన వైద్య పరీక్షలు, తనిఖీలు నిర్వహించాకే అనుమతించారు. ఆ వచ్చేవారినీ ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. ఇక ఆ దేశానికి వెళ్లే విదేశీయులు ఎవ్వరైనా ప్రతి రోజూ అధికారుల వద్ద రిపోర్ట్‌ చేయాల్సిందే. కాబట్టి సమస్య రాలేదు. జనవరిలో కొరియాలో పర్యటిస్తున్న విదేశీయుల్ని క్వారంటైన్‌ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు.