DailyDose

రైల్వేకు సరుకు రవాణాతో భారీ ఆదాయం-వాణిజ్యం

Indian Railways Profitting From Goods Transport-Telugu Business News Roundup Today

* కరోనా కట్టడిలో భాగంగా దేశంలోని ప్యాసిజర్‌ రైళ్లను నిలిపివేయగా.. దక్షిణ మధ్య రైల్వే గూడ్స్‌ రైళ్లను నడుపుతూ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 65 మార్గాల్లో 507 రైళ్లలో నిత్యావసర వస్తువులను రవాణా చేయడంతో రూ.7.54 కోట్ల ఆదాయం వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 14వ తేదీ ఒక్కరోజే 77 రైళ్లలో 1835 టన్నుల సరకు రవాణా జరిగింది. దీంతో రూ. 63 లక్షల ఆదాయం సమకూరింది.

* పదిహేను రోజుల్లో 3.31 లక్షల పీఎఫ్‌ క్లెయిమ్స్‌ను పరిష్కరించామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా దరఖాస్తు చేసుకున్న చందాదారులకు రూ.950 కోట్లు విడుదల చేశామని వెల్లడించింది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు గురవ్వకుండా ఉండేందుకు పీఎఫ్‌ నగదును ప్రత్యేకంగా ఉపసంహరించుకొనేందుకు కేంద్రం ప్రభుత్వం 2020, మార్చి 28న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) పథకంలో భాగంగా సంఘటిత కార్మికులకు కొంత ఉపశమనం కల్పించింది.

* భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నుంచి విమానయాన రంగం వరకు, నిరుద్యోగం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చించారని తెలిసింది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రంగాల కోసం రెండో ఉద్దీపన పథకం ప్రకటించే అవకాశముందని సమాచారం.

* కొవిడ్‌-19 మహమ్మారితో ఆర్థిక పతనం ఎంత మేరకు ఉంటుందో అనే భయాల నడుమ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్‌ 122 పాయింట్ల నష్టంతో 30,257 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 8,897 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.28 పైసలుగా ఉంది. వేదాంతా, జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభాల్లో, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

* గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు ఏప్రిల్‌ 20 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడంపై పరిశ్రమ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఓ వైపు కార్యకలాపాలు పునఃప్రారంభిస్తూనే కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి. అయితే ఎగుమతుల ఆర్డర్లను పూర్తి చేసేందుకు జౌళి, దుస్తులు, వాహన రంగ పరిశ్రమలకు కూడా ఏప్రిల్‌ 20 నుంచి కార్యకలాపాల ప్రారంభానికి అనుమతినివ్వాలని కోరాయి. ఎవరెవరు ఏమన్నారంటే.. ‘దశలవారీగా లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయం మే 3 తర్వాత పారిశ్రామిక కార్యకలాపాల పునఃప్రారంభానికి మార్గసూచీగా ఉపయోగపడుతుంది. కార్మికుల ఆదాయాలపై ప్రభావం ఎక్కువగా ఉన్న రంగాలకు కూడా తదుపరిదశలో తగు ఆరోగ్య జాగ్రత్తలతో ప్రభుత్వం అనుమతినిస్తుందని భావిస్తున్నాం’

* కొవిడ్‌-19 దేశ ఆర్థిక వ్యవస్థ మూలాధారమైన నిర్మాణ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి నష్టాలను అదుపు చేయాలని ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన కేపీఎంజీ విశ్లేషించింది. అంతేగాక ఆర్థిక వ్యవస్థను సత్వరం మళ్లీ గాడిలో పెట్టాలంటే ఈ రంగానికి పెద్దపీట వేయాలని తాజాగా ఒక నివేదికలో సూచించింది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ వెంటనే ప్రారంభం అయ్యేందుకు చర్యలు తీసుకోవటంతో పాటు, ఏఏ ప్రాజెక్టులు ముందుగా చేపట్టాలి- అనేది నిర్దేశించుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరింది. ఈ రంగంలో ఉన్న మానవ వనరులు, యంత్రసామగ్రికి వెంటనే మళ్లీ పూర్తిస్థాయిలో పని దొరకకపోవచ్చు, అందువల్ల ఆ మిగులు వనరులను వినియోగించుకోవటానికి వీలుగా ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని సూచించింది. ‘‘కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ నుంచి వచ్చే కొద్ది రోజుల్లో సడలింపు దొరకవచ్చు, ఆ తర్వాత కొంతకాలానికి పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉంది. నిర్మాణ రంగం భాగస్వామ్యం లేకుండా ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం అనేది సాధ్యం కాదు. ప్రస్తుతం నిర్మాణ రంగ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన కార్యాచరణతో నిర్మాణ రంగ కార్యాకలాపాలు మొదలుపెట్టి వేగవంతం చేయటానికి పూనుకోవాలి’’ అని ఈ నివేదిక విశ్లేషించింది.