విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల అభ్యాసం కీలకమైనది. ఇక్కడ నేర్చుకున్న పాఠ్యాంశాల ఆధారంగా వారి భవిష్యత్తుకు పునాది ఏర్పడుతుంది. ఇంటర్నెట్‌యుగంలో సరికొత్తగా డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ద్వారా విద్యార్థులకు సరికొత్తగా బోధించడం ఇప్పటికే అనేక విద్యాసంస్థల్లో ప్రారంభమయింది. పాఠ్యాంశాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల్లో బోధించడాన్నే డిజిటల్ స్టోరీ టెల్లింగ్‌గా పిలుస్తున్నారు. దీనికి అదనంగా చిత్రాలు, వెబ్ సమాచారం కూడా జోడిస్తున్నారు.
*** ఉపయోగాలు..
స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల రాకతో అనేకమంది విద్యార్థులు సాంకేతికంగా ముందున్నారు. వీరితో పాటు ఇతర విద్యార్థులకు సాంకేతికాంశాలతో కూడిన విద్యను బోధించేందుకు డిజిటల్ స్టోరీ టెల్లింగ్‌ను ప్రవేశపెట్టారు. దృశ్య, శ్రవణ మాధ్యమాలతోపాటు అధ్యాపకులు వారికి అర్థవంతంగా పాఠాలు చెప్పడంతో అందరికి అవగాహన కలుగుతుంది. దీంతో ఆయా పాఠ్యాంశాల్లో మంచి మార్కులు సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
*** ఎలా చేయాలి..
ముందుగా బోధించాల్సిన అంశంపై ముసాయిదా సిద్ధం చేసుకోవాలి. అనంతరం పరిశోధన చేసి సమగ్రంగా రచించాలి. తరువాత ఫొటోలు, ఆడియో, వీడియో సిద్ధం చేసుకోవాలి. అనంతరం ఒక సారి సరి చూసుకొని బోధించాలి. ఇందులో ప్రతి పాఠ్యాంశమూ ఒక ప్రాజెక్టుగా ఉంటుంది. టెక్నాలజీ సమ్మేళనంలో భాగంగా విద్యార్థులు ఇందులో భాగమవుతారు. బోధన అందరికి నచ్చుతుంది కాబట్టి విద్యలో వెనకబాటు ఉండదు.
** విద్యకే పరిమితం కాదు..
డిజిటల్ స్టోరీ టెల్లింగ్ కేవలం పాఠశాలలకే పరిమితం కావడం లేదు. అన్ని రంగాలకు విస్తరించింది. నచ్చిన అంశమైతే సోషల్ మీడియాలో యూజర్లు షేర్ చేస్తుంటారు. దీంతో వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. పోటీ పరీక్షల కోచింగ్, ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ కార్యక్రమాలు.. తదితర రంగాల్లోనూ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ దూసుకుపోతోంది.