తెలుగు చిత్రసీమ హాస్య నటుల పాలిట ఓ పుష్పకవిమానం అంటుంటారు. ఎంత మంది వచ్చినా మరొకరికి చోటుంటుంది. తెలుగు తెరపై మెరిసిన హాస్యనటుల్లో ఒకొక్కరిది ఒక్కో శైలి. తాగుబోతు పాత్రలపై తనదైన ముద్ర వేశారు ఎమ్మెస్ నారాయణ. పేరడీ పాత్రలన్నా… దర్శకనిర్మాతలకి మొట్ట మొదట గుర్తుకొచ్చే నటుడు ఎమ్మెస్ నారాయణే. రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఆ తరువాత హాస్య నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభని చాటారు. ఎమ్.ఎస్.నారాయణ 16 ఏప్రిల్ 1951న పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రులో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ తల్లిదండ్రులు. ఎమ్మెస్ అసలు పేరు మైలవరపు సూర్య నారాయణ. ఇల్లందులో చదువుకున్న ఎమ్మెస్, పదో తరగతి తరువాత పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదేళ్ల భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశాడు. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయన దగ్గరే శిష్యరికం చేశారు ఎమ్మెస్. అదే ఆయన రచయితగా స్థిరపడటానికి కారణమైందటంటారు. తన సహాధ్యాయిని అయిన కళాప్రపూర్ణని ప్రేమించి పెళ్లిచేసుకొన్నారు ఎమ్మెస్. మొదట అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంబించిన ఎమ్మెస్ కళారంగంపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగుపెట్టారు. ‘వేగు చుక్క పగటి చుక్క’ చిత్రంతో కథారచయితగా మారారు. ఆ తరువాత ఎనిమిది చిత్రాలకి పనిచేశారు. ‘ఎమ్.ధర్మరాజు ఎమ్.ఎ’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. ‘పుణ్యబూమి నాదేశం’, ‘రుక్మిణి’ చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆయనకి ఈవీవీ దర్శకత్వం వహించిన ‘మా నాన్నకి పెళ్ళి’ తిరుగులేని పేరు తీసుకొచ్చింది. దర్శకులు తనకి ఇచ్చిన పాత్రలకి తానే సంభాషణలు రాసుకొని సినిమాల్లో పలికేవారు ఎమ్మెస్. ‘రామసక్కనోడు’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘సర్దుకుపోదాం రండి’, ‘శివమణి’, ‘దూకుడు’ చిత్రాలకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. సుమారు 200 చిత్రాల్లో ఆయన తాగుబోతు పాత్రధారిగా నటించి నవ్వించారు. ‘దూకుడు’, ‘డిస్కో’, ‘దుబాయ్ శీను’ తదితర చిత్రాల్లో పేరడీ పాత్రలు చేసి మెప్పించారు. తన తనయుడు విక్రమ్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘కొడుకు’ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్. ఆ చిత్రం పరాజయం చవిచూసింది. మళ్లీ ‘భజంత్రీలు’ అనే చిత్రం చేశారు. అది కూడా ఫలితాన్నివ్వలేదు. కుమార్తె శశికిరణ్ కూడా దర్శకురాలే. సుమారు 700పైగా సినిమాలు చేసిన ఎమ్మెస్ నారాయణ 2015లో సంక్రాంతి పండగకి సొంతూరు వెళ్లి, అక్కడే అస్వస్థతకి గురై తుదిశ్వాస విడిచారు. ఆయన పుట్టినరోజు ఈ రోజు.
హాస్యంతో “మనల్ని సంతోషపెట్టిన(MS)” నారాయణ
Related tags :