DailyDose

రెండో ప్యాకేజీపై మోడీ-నిర్మలల కసరత్తు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - Modi Nirmala Work On Second Round Of Package

* భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నుంచి విమానయాన రంగం వరకు, నిరుద్యోగం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చించారని తెలిసింది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రంగాల కోసం రెండో ఉద్దీపన పథకం ప్రకటించే అవకాశముందని సమాచారం. వుహాన్‌లో పుట్టిన వైరస్‌తో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సంస్థలు జీడీపీ వృద్ధి అంచనాలను బాగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, భవిష్యత్తులో ఏం చేయాలన్న అంశాలపై ప్రధాని చర్చించారని అభిజ్ఞ వర్గాల సమాచారం.

* దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.90 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటివరకు 1489 మంది బాధితులు కోలుకోగా 414 మంది మృతి చెందినట్లు చెప్పారు. నిన్న ఒక్కరోజే 941 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. 37 మంది మృతిచెందారన్నారు. దేశంలో 325 జిల్లాల్లో కరోనా కేసులు లేవని ఆయన వెల్లడించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎక్కడా అత్యవసరాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేకిన్‌ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టిసారించామన్నారు. లాక్‌డౌన్‌లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్లు లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశాలున్నాయన్నారు. వలస కూలీలు, కార్మికులకు ఆహారం, వసతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.

* రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భౌతికదూరం పాటించేలా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

* తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 19న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నెలాఖరు వరకు ఉండగా.. కేంద్రం దేశ్యవాప్తంగా వచ్చేనెల మూడో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈనెల 20 నుంచి కొన్ని మినహాయింపులను కూడా కేంద్రం ప్రభుత్వం ఇచ్చింది. ఈనేపథ్యంలో.. లాక్‌డౌన్‌ను మే 3వరకు యథావిధిగా కొనసాగించాలా? వద్దా?. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు కొత్తగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 534కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 14 మంది మృతి చెందగా, 20 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నారు.

* కరోనా టాస్క్‌ఫోర్స్‌ నుంచి ఆంథోనీ ఫౌసిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలగిస్తే తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఇటలీ అంటువ్యాధుల ఆస్పత్రి సైంటిఫిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గియుసెఫ్‌ ఇప్పొలిటో అన్నారు. ప్రస్తుత మహమ్మారి నుంచి ఇటలీతో పాటు ప్రపంచాన్ని రక్షించేందుకు ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వైట్‌హౌజ్‌ ఏర్పాటు చేసిన కరోనా టాస్క్‌ఫోర్స్‌లో ఫౌసి కీలక సభ్యుడు. వైరస్‌ నియంత్రణ చర్యలు ముందుగానే చేపట్టివుంటే మరికొందరి ప్రాణాలు కాపాడేవాళ్లమని ఈ మధ్యే సీఎన్‌ఎన్‌తో ఆయన అన్నారు. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘ఇది ఫౌసిని తొలగించాల్సిన సమయం’ అని మరొకరు చేసిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్‌ చేశారు. దీంతో ఆయనకు ఉద్వాసన తప్పదని అంతా భావించారు. ప్రస్తుతానిని ఆయన ఉద్యోగానికి ముప్పు లేదని సోమవారం ట్రంప్‌ స్పష్టం చేశారు. మీడియా వ్యవహారాల్లో తలదూర్చొద్దని చెప్పారని తెలిసింది.

* దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవ్వరూ ఇల్లు దాటి బయటకు రావొద్దని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నా కొన్నిచోట్ల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్న పోలీసులు కొన్నిసార్లు చిన్నపాటి శిక్షలు విధిస్తున్నారు. మహారాష్ట్రలోని పుణెలో గురువారం ఉదయం వాకింగ్ కోసం బయటకు వచ్చిన వారిని యోగా చేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అందరిని వరసలో నిల్చోబెట్టి మైక్‌లో ఆదేశాలిస్తూ సూర్య నమస్కారాలు సహా పలు ఆసనాలు సాధన చేయించారు.

* రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కోరారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కోసం బస్తాలను త్వరగా అందించాలని.. లోడింగ్, అన్‌లోడింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్నిచోట్ల డ్రా విధానం, మరికొన్ని చోట్ల టోకెన్ విధానం అమల్లో ఉండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని.. ఒకే విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరి పంటకు రూ. 1,835 మద్దతు ధర కల్పించినప్పటికీ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. కందులు కొనుగోలు చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో తక్షణమే నగదు జమచేయాలని.. కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వం పేదలకు రాయితీపై అందించాలని కోరారు.

* రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతోనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆంగ్ల మాధ్యమంపై తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. తెదేపా నేతలంతా వారి వారి పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తుంటే.. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా అని నిలదీశారు. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అనిల్‌కుమార్‌ మండిపడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజలకు సాయం అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

* రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్తగా అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచామని.. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే పేదలకు రూ.2వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు. అలా ఇంటికి వెళ్లే వారంతా పౌష్టికాహారం తీసుకునేలా సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు.

* కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతో తితిదే కీలక నిర్ణయ తీసుకుంది. మే 3వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, మే 31 వరకు ఆర్జిత సేవలూ రద్దు చేసింది. ఇప్పటికే బుక్‌చేసుకున్న వారు తమ టికెట్ల వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ పంపాలని సూచించింది. దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవల వివరాలను helpdesk@tirumala.orgకి పంపాలని తితిదే అధికారులు కోరారు.

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే సరిపోదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ అన్నారు. గురువారం దిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ‘‘లాక్‌డౌన్‌ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుంది.. ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశముంది. కరోనాతో పోరాటానికి వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాలి’’అని అన్నారు.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్డు, స్నాప్‌డీల్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు వాటి సేవలను కొనసాగించేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం మార్గదర్శకాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంస్థల ద్వారా మొబైల్‌ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ సామగ్రి విక్రయాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.