Politics

జగన్ అంకెలపై బాబు అనుమానాలు

జగన్ అంకెలపై బాబు అనుమానాలు

వైకాపా నేతల నిర్వాకం వల్లే ఏపీలో కరోనా విస్తరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పేదల ప్రాణాలతో ఆడుకునే హక్కు వైకాపాకు లేదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరును తప్పుబట్టారు. పాజిటివ్‌ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌బులెటిన్లలో బోగస్‌ అంకెలున్నాయని ఆరోపించారు. కరోనా కేసులు దాచిపెడితే అత్యంత ప్రమాదమని హెచ్చరించారు. రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలపై కేంద్రానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని.. జిల్లా యంత్రాంగం లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో తేడాలున్నాయన్నారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘సీఎం డ్యాష్‌ బోర్డు అంకెలకు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి లెక్కలకు పొంతన లేదు. మొన్న సాయంత్రం 11,613 నమూనాలు పరీక్షించినట్లు సీఎం డ్యాష్‌ బోర్డులో చూపించారు. నిన్న ఉదయానికి 20,235 నమూనాలు పరీక్షించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 7 ల్యాబ్‌ల్లో రోజుకు 990 పరీక్షలు చేస్తామని గతంలో మీరే చెప్పారు. అలాంటిది 12 గంటల్లో 8,622 పరీక్షలు ఎలా చేశారు?లాక్‌డౌన్‌ ఎత్తివేయించాలని వైకాపా నేతలు ఆలోచిస్తున్నారు. స్థానిక ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాలపై వారికి లేదు. వైకాపా నేతల అశ్రద్ధ, అబద్ధాల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతోంది. సీఎం జగన్‌ అసమర్థత వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వ్యాక్సిన్‌ వస్తేనే కరోనా నివారణ సాధ్యం. అప్పటివరకు నియంత్రణే తప్ప నివారణ సాధ్యం కాదు. ఎవరి సలహాలు వినకపోవడం.. తోచిందే చేయడం సరికాదు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.