DailyDose

చైనా ఆర్థిక వ్యవస్థకు పతనసమయం-వాణిజ్యం

చైనా ఆర్థిక వ్యవస్థకు పతనసమయం-వాణిజ్యం

* కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిస్థితుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్న్ శక్తికాంతదాస్‌ అన్నారు. అన్నింటినీ అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై వైరస్‌ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న బ్యాంకు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పలు కీలక ప్రకటనలు చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

* దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చిన్నతరహా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌(ఎస్‌టీపీఐ)ల కేంద్రంగా పనిచేసే చిన్న ఐటీ సంస్థలకు నాలుగు నెలల పాటు అద్దెను మినహాయిస్తూ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్‌తో చోటుచేసుకున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అర్హతగల ఐటీ సంస్థలు మార్చి 1 నుంచి జూన్‌ 30 వరకూ అద్దె చెల్లించనవసరం లేదని తెలిపింది.

* కరోనా వైరస్‌ చైనా ఆర్థిక వ్యవస్థను భారీ స్థాయిలో కుంగదీసింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆ దేశ వృద్ధిరేటు దశాబ్దాల కనిష్ఠానికి దిగజారింది. గత మూడు నెలల కాలంలో వైరస్ విజృంభణతో కొనసాగిన కఠిన ఆంక్షలే దీనికి కారణమని నివేదికలు స్పష్టం చేశాయి.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో, ప్రపంచ దేశాలకు తన వంతు సాయం అందించేందుకు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారాసిటమాల్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే పారాసిటమాల్ తయారీలో ఉపయోగించే ముడిసరుకుల ఎగుమతులపై మాత్రం ఎప్పటిలానే నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ‘‘పారాసిటమాల్ ఫార్ములా నుంచి తయారు చేసిన మాత్రలు ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తక్షణం రద్దు చేస్తున్నాం. అయితే పారాసిటమాల్‌ తయారీలో ఉపయోగించే ఫార్మా పదార్థాల ఎగుమతిపై మాత్రం నిషేధం కొనసాగుతుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

* దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్‌బీఐ పలు చర్యలు ప్రకటించడం కలిసొచ్చింది. వ్యవస్థలోకి నిధులు మళ్లించడం, రివర్స్‌ రెపో రేట్‌ తగ్గించడం, మొండి బాకీలకు సంబంధించిన నిబంధనలు సడలించడం సహా తీసుకున్న పలు చర్యలతో ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ 986.11 పాయింట్లు లాభంతో 31,588.72 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 273.95 పాయింట్లు ఎగబాకి 9వేల పాయింట్ల మార్కును దాటి 9,266.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.39గా ఉంది.

* కొవిడ్‌-19 నియంత్రణ చర్యలకు మద్దతుగా రూ.30 కోట్ల సాయం చేయనున్నట్లు ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. పీఎం-కేర్స్‌ వంటి వాటికి విరాళం ఇవ్వడంపై బ్యాంక్‌ స్పష్టత ఇవ్వలేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఫేస్‌ మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లు, గ్లౌవ్స్‌ వంటి వాటిని సరఫరా చేశామని, విధులు నిర్వర్తిస్తున్న ఆరోగ్య అధికారులకు వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)ని అందించడానికి కృషి చేస్తున్నట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వివరించింది. పీఎం-కేర్స్‌ నిధికి అందించే విరాళాల కోసం ప్రత్యేక ఖాతాను తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపింది.