Movies

ఇలియానా కూడా రూమరేనా?

Ileana And Pawan Kalyan Telugu Movies News

పవన్ కల్యాణ్ రాజకీయాల బాట పట్టి సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. వాస్తవానికి ఇక సినిమాలు చేయనని చెప్పిన పవన్.. రీసెంట్‌గా తన మనసు మార్చుకున్నారు. రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయాలనే నిర్ణయానికి వచ్చిన ఆయన వరుసగా మూడు సినిమాలకు సైన్ చేశారు. అందులో మొదటిది ‘వకీల్‌సాబ్’ చిత్రం 80 శాతం షూటింగ్ కూడా జరుపుకుందని టాక్. రెండోవది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. మూడోది హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ మూడు కాకుండా ఇంకొన్ని సినిమాలు చేస్తున్నాడనే టాక్ వినిపించినా వాటిపై అధికారికంగా మాత్రం ఎటువంటి న్యూస్ బయటికి రాలేదు. ఇక 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వకీల్‌సాబ్’ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. దీనికి కారణం హీరోయిన్. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్ రెడీ చేశారట. చాలా తక్కువ నిడివి ఉన్న ఈ పాత్ర కోసం ఇప్పుడు ‘వకీల్‌సాబ్’ టీమ్ చూస్తుంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదు. రీసెంట్‌గా శృతిహాసన్ కూడా ఈ సినిమాలో చేయడం లేదని క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ పాత్ర కోసం హీరోయిన్ ఇలియానాని సంప్రదిస్తున్నారనే టాక్ టాలీవుడ్‌లో వినబడుతుంది. ప్రస్తుతం సినిమాలేవీ లేని ఇలియానా.. ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపిందని అంటున్నారు. పవన్ కల్యాణ్‌లో అల్రెడీ ‘జల్సా’ చిత్రంలో నటించిన ఇలియానా.. మరోసారి అతనితో జతకట్టేందుకు ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో గట్టిగానే వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముంది? నిజంగానే ఇలియానాని ఓకే చేశారా? లేదంటే ఇది కూడా రూమరేనా? వంటి విషయాలు తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.