Movies

సావిత్రిని మరిపించిన సౌందర్య

సావిత్రిని మరిపించిన సౌందర్య

సావిత్రి వెండితెరకి దొరికిన అరుదైన అభినేత్రి. చారడేసి కళ్లతో వీక్షకుల హృదయాలపై మంత్రజలం చల్లిన మహానటి. నిండైన విగ్రహం…నటనలో నిగ్రహం. పెదాలపై చిరునవ్వులతో సినీకళామతల్లి సిగలో ఒద్దికగా ఒదిగిన వెన్నెల పువ్వు. ఓ చూపుతో…చిన్ని కదలికతో చెప్పగల భావాల్ని చక్కగా చూపగల నేర్పరి. అందుకే… ఆనాటికి, ఈనాటికి సావిత్రిని మించిన అభినేత్రి లేదని సినీ పండితులు చెప్తుంటారు. అయితే… ఆ మహానటి లేని లోటు మరే నటి పూడ్చలేకపోయినా… ఆ తరువాత ప్రతి తరంలోనూ ఒక్కో నటి సావిత్రిని గుర్తు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఆ కోవలో చెప్పుకోదగ్గ నటి సౌందర్య. సన్నజాజి స్వప్నించినట్లు… గులాబీ అత్తరు జల్లినట్లు… ఏ అదృశ్య చిత్రకారుడో మరో అద్భుత చిత్రాన్ని లిఖించినట్లు… వెండి తెరపై ఆ స్వప్న లోకాల సౌందర్య రాశి తనని తానూ అందంగా ఆవిష్కరించుకుంటే… ఆమె సౌందర్య. అసలు పేరు సౌమ్య. మంత్రనగరిలోకి ఏతెంచిన తరువాత పేరు సౌందర్య. అందం… అభినయం చెట్టాపట్టాలేసుకుంటే… సొగసు…సోయగం కరచాలనం చేసుకుంటే… సౌమ్యం… చిరస్మరణీయ చిరుదరహాసం గాఢంగా కౌగిలించుకుని తెరపై సాక్షాత్కరిస్తే… ఆమె అచ్చం సౌందర్యలా ఉంటుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వెండి తెరకు అలుముకున్న కన్నడ కస్తూరి. కాటుక కళ్లతో మెస్మరైజ్‌ చేసే సౌందర్య లహరి… స్వప్న సుందరి.

హీరోయిన్స్‌ వస్త్రాల విషయంలో అతి పొదుపును పాటిస్తూ ప్రత్యేక నృత్యతారలు అవసరం లేని విధంగా ఆడిపాడుతూ వెండి తెరపై అందాలను స్వేచ్ఛగా ఆరబోస్తున్న నేపథ్యంలో కూడా తనని తాను ప్రత్యేకంగా ఆవిష్కరించుకున్న తీరు సౌందర్యకు ఆభరణంగా మారింది. రాజీలేని డ్రెస్‌ కోడ్‌ ఆమెని సినీ రాణిని చేసింది. ఎక్సపోజింగ్‌ విషయంలో తన పట్టు సడలించకుండానే… చక్కనైన డ్రెస్‌ కోడ్‌తో అటు ప్రేక్షకులను, ఇటు సినీ వర్గాలనూ అలరించి అందలమెక్కింది. గ్లామర్‌ కన్నా యాక్టింగ్‌ గ్రామర్‌ తెలుసుకుని సినీ చరిత్ర పుస్తకంలో తనకంటూ ఓ పేజీని కేటాయించుకున్న అందాల అభినేత్రి సౌందర్య. హ్యాట్సాఫ్‌తో ది గ్రేట్‌ స్టార్‌.

సినీ వినీలాకాశంలో ఈ అభినయ తారక ఎప్పుడు ఉదయించిందో… ఎన్నాళ్లు… ఎన్నేళ్లు వెన్నెలల్ని పంచిందో… యావత్‌ వీక్షక లోకం సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే వంద చిత్రాలు చేసేసింది. కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కనిపిస్తూ ఎక్కడ చూసినా సౌందర్య మానియాతో యువ హృదయాలు ఉప్పొంగిపోయేలా విజయవంతమైన సినీయానాన్ని కొనసాగించింది. కర్ణాటక కోలార్‌ జిల్లా ముల్‌ బగల్‌లో 1976 జులై 18న జన్మించిన సౌందర్య… చిత్రసీమలో అనతి కాలంలోనే విజయ తారగా చరిత్ర సృష్టించి … వచ్చిన పని అయిపోయిందన్నట్లు…మరెన్నటికీ తిరిగిరాలేని లోకాలకు తరలిపోవడం ఆ అభినేత్రిని తలచుకున్నప్పుడల్లా అభిమానుల్ని వెంటాడే పెను విషాదం. వందకు పైగా సినిమాలు చేసి… ఇంకా చేయవలసిన చిత్రాలు… పనులు ఎన్నో ఉన్నా… కర్కశ మృత్యు రక్కసి విమాన ప్రమాదంలో ఆమెను పొట్టన పెట్టుకుంది. ఇలాంటి ఓ వేసవిలోనే… మండే ఎండల ఎన్నికల సమయంలో ఏప్రిల్‌ నెల 2004 సంవత్సరం 17వ తేదీన బీజేపీ ప్రచారం కోసం వెళ్లబోతూ… ఎగేరి విమానం కుప్ప కూలిపోవడంతో సౌందర్యను మృత్యువు కబళించింది.