వేసవిలో తక్కువ తేమ అవసరమయ్యే కూరగాయల సాగుతో ఆదాయం బాగుంటుందని సంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి సునీత పేర్కొన్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను అరికట్టేందుకు.. అందుబాటులో ఉండే కొద్దిపాటి నీటిని సక్రమంగా వినియోగించుకుంటే అధిక దిగుబడితోపాటు మెరుగైన రాబడులు వస్తాయని తెలిపారు.
అనువైన పంటలు : వేసవిలో.. టమాట, బెండ, క్యాబేజి, కాలిఫ్లవర్, ఫ్రెంచిబీన్స్, క్యారట్, ఉల్లి, గోరుచిక్కుడు, తోటకూర, పాలకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, బీర, సొర, కాకర, వంగలను విత్తొచ్చు.
సస్యరక్షణ చర్యలు
* రసంపీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. కలిపి విత్తనశుద్ధి చేయాలి. నారుమళ్లపై షేడ్‌నెట్ ఏర్పాటు చేస్తే.. రసంపీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్య అదుపులో ఉంటుంది.
* నీటి యాజమాన్యం సరిగ్గా లేకపోతే టమాట, పుచ్చలో కాయపగుళ్లు వస్తాయి. నివారణకు.. సక్రమ నీటి యాజమాన్యంతోపాటు లీటరు నీటికి బోరాక్స్ లేదా ఆల్‌బోర్ 3 గ్రా., చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
* తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతలకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు పూత దశలో 10 లీటర్ల నీటికి.. సైకోసిల్ 2.5 గ్రా., మాలిక్ హైడ్రజైడ్ 0.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
* ఆకుకూరల పంటల్లో ఆకు దిగుబడికి లీటరు నీటికి.. 20 గ్రా. యూరియా కలిపి పిచికారీచేయాలి.
* పొటాష్‌ను సరైన మోతాదులో వాడితే.. మొక్కలకు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
* కిలో యూరియాకు అరకిలో పొటాష్‌ను తప్పనిసరిగా వాడాలి.
* పూత, పిందె రాలకుండా, పిందె బాగా గట్టిపడటానికి టమాట, వంగ వంటి పంటలకు నాలుగు లీటర్ల నీటికి.. ఒక మి.లీ. ప్లానోఫిక్స్ (ఎన్‌ఏఏ) కలిపి పిచికారీ చేయాలి. ఈ మందును పూత దశలో వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే పిందె రాలకుండా ఉంటుంది.
నీటి యాజమాన్యం
* వేసవిలో కూరగాయల నారును నీడకింద పెంచాలి. పొలంలో మొక్కలకు నీడనిచ్చేలా ఆముదం, మొక్కజొన్న వంటి ఎత్తు పెరిగే పంటలను ఉత్తర, దక్షిణ దిశలో నాటుకోవాలి.
* నేలలో తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, జీవన ఎరువుల వినియోగంతో మంచి ఫలితం ఉంటుంది.
* వరుసల మధ్య వరిగడ్డి, వేరుశెనగ పొట్టు, ఎండాకులు, పచ్చిరొట్టలను పరిస్తే నేలలో తేమ నిలుస్తుంది.
* బిందు, తుంపర్ల పద్ధతిలో.. కొద్ది నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలను సాగు చేయవచ్చు.
* సాధారణ పద్ధతిలో నీరిచ్చే పంటల్లో.. ఎండ తీవ్రత తగ్గించేందుకు సాయంత్రం వేళ నీరు చల్లాలి.