* కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న గృహహింస కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయని జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ తాజా గణాంకాలను విడుదల చేసింది. కేవలం మార్చి 23 నుంచి ఏప్రిల్ 16 మధ్య కాలంలో ఎన్‌సీడబ్ల్యూకు అందిన 587 ఫిర్యాదుల్లో 239 గృహహింసకు సంబంధించినవని తెలిపింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 22 మధ్య 123 గృహహింస కేసులు నమోదుకాగా, గత 25 రోజుల్లో ఈ సంఖ్య 239కి చేరిందని వెల్లడించింది. లాక్‌డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో బాధితురాలు, నిందితుడు ఒకే చోట ఉండటంతో ఈ కేసులు సంఖ్య మరింత పెరుగుతోందని ఎన్‌సీ డబ్ల్యూ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు.
* ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన ఓ మహిళ మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు శీతల పానీయాలు అందించిన వీడియో రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అమె వివరాలు తెలుసుకొని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ఆమెతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ అమ్మతనానికి మేమంతా చలించిపోయాం. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై మీరు చూపిన ప్రేమకు మేమంతా సెల్యూట్ చేస్తున్నామమ్మా’’ అంటూ ధన్యవాదాలు తెలిపారు.
* ‘జీవితం ఎవడినీ వదిలి పెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది’ ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. కరెక్టే.. జీవితంలో ప్రతి ప్రశ్నకూ కాలం దగ్గర సమాధానం ఉంటుంది. అయితే, ఆ సమాధానం ఎలా ఉంటుందో ఎవరూ ముందే ఊహించలేరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. 2020 జనవరి 1న ఎన్నో కొత్త ఆశలతో, కొత్త ఆలోచనలతో, ఇంకెన్నో కొత్త ఆశయాలతో కొత్త ఏడాది ప్రారంభించారు. మూడు నెలల్లో పరిస్థితులు మారిపోతాయని ఎవరైనా ఊహించి ఉంటారా? అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అనుకుని ఉంటారా? ప్రపంచవ్యాప్తంగా కరోనాకు ముందు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం!
* కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం సీఎం సహాయనిధికి రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం తమ నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మొత్తం రూ.6.37 కోట్లు విరాళమిస్తున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లికి లేఖను అందించింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లను మంత్రి అభినందించారు.
* టీఎన్‌జీవో ఆధ్వర్యంలో నారాయణగూడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. దాదాపు 200 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..‘‘ కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని నాకు ఏ దేవుడూ లేడు. వైద్యుడే దేవుడు అన్నారు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు దాడి చేస్తున్నారు. వైద్యులపై దాడిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వైద్యులు.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం కొరత వల్ల ఇబ్బందిపడుతున్నారు. రక్తం కొరత రాకుండా రక్తదానానికి ప్రజలు ముందుకు రావాలి. విపత్కర సమయంలో 200 మంది ఉద్యోగులు రక్తదానం చేయడం హర్షణీయం’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో 31 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 603కు చేరింది. ఇప్పటి వరకు చికిత్స పొంది 42 మంది డిశ్ఛార్జి అయ్యారు. 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 546 మంది చికిత్స పొందుతున్నారు.
* విజయవాడలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఒక్క విజయవాడ నగరంలోనే 58కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 30 కేసుల్లో వైరస్ వ్యాప్తికి గల కారణాలు కనుక్కోలేకపోయామని కలెక్టర్ ఇంతియాజ్ చెబుతున్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్ చెప్పారు. మరోవైపు కరోనా మహమ్మారి బారిన పడి జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 546 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఏకంగా ఒక ఐఏఎస్ అధికారి సతీమణికి కూడా కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమె కర్నూలులో ఉన్నారు. తన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆయనను పరామర్శించేందుకు వారం రోజుల క్రితమే ఆమె కర్నూలు వెళ్లారు. ఆమె తండ్రి మరణించడం.. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ జిల్లా అధికారులు అప్రమత్తమై కుటుంబ సభ్యులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి భార్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె కర్నూలులోనే క్వారంటైన్‌లో ఉన్నారు.
* కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రధాని మోదీ నియమించిన కేంద్ర మంత్రుల కమిటీ ఇవాళ భేటీ అయ్యింది. కేంద్ర మంత్రి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో సమావేశమైన ఈ బృందం.. లాక్‌డౌన్ పొడిగింపు, ఏప్రిల్ 20 నుంచి దేశంలోని నాన్ హాట్‌స్పాట్ జోన్లలో పాక్షికంగా అనుమతించే ఆర్థిక కార్యకలాపాలపై చర్చించినట్లు సమాచారం. మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలు, కొవిడ్ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను అనుమతించే విషయాలపై పలు మంత్రిత్వ శాఖల నుంచి మంత్రుల బృందం ఇప్పటికే సమాచారం తీసుకుంది.
* కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ట్విటర్ వేదికగా సూచనలు, సలహాలు చేశారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం భారీ సవాలే అయినప్పటికీ.. సంక్షోభం నుంచి గట్టెక్కడానికి నూతన పరిష్కారాల ఆన్వేషణకు ఇది మంచి అవకాశమన్నారు. ఇందుకోసం భారతీయ నిపుణుల సంఘాలు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, డేటా నిపుణులను సమాయాత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు.
* కేంద్ర ప్రభుత్వం ఈనెల 20 నుంచి టోల్ ఫీజులు అమల్లోకి వస్తాయని జారీ చేసిన ఉత్తర్వులను లాక్‌డౌన్ ముగిసే వరకు నిలుపుదల చేయాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నేషనల్ హైవే ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. లాక్‌డౌన్ ఉన్నంత కాలం టోల్ మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరింది. ప్రస్తుతం కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన లారీలు రాష్ట్రానికి తిరిగి రాక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు రవాణా రంగానికి ఆమోద యోగ్యంగా లేవని పేర్కొంది.
* చైనాలో ఆవిర్భవించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను సర్వ నాశనం చేస్తుంది. పేదా, ధనిక అనే తేడాల్లేకుండా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే లక్షల మంది బాధితులుగా మారారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తుండడంతో వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు ‘ఇంటి నుంచే పని’ చేయాలని ఆయా సంస్థలు ఆదేశిస్తున్నాయి.
* పీఎం-కేర్స్‌కు రూ.35వేల విరాళం ఇచ్చి మాజీ ఎంపీతో పాటు మరో ఐదుగురు బెయిల్ పొందిన ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. బెయిల్ కావాలంటే విరాళం ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి షరతు విధించారు. దీన్ని అంగీకరించిన వారు ఇటు బెయిల్ పొందడంతో పాటు.. కరోనాపై పోరులో భాగం కావాలన్న ప్రధాని మోదీ పిలుపును సైతం అందిపుచ్చుకున్నారు. భాజపా మాజీ ఎంపీ సోమ్ మరండీ సహా మరో ఐదుగురు 2012లో నిర్వహించిన రైల్ రోకో కేసులో దోషులుగా తేలారు.