చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేస్తోంది. చిన్నదేశం, పెద్దదేశమని లేదు, అన్ని ఖండాల్లోనూ పాకుతోంది. దీని దెబ్బకు సగం ప్రపంచానికి పైగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఈ మహమ్మారి గురించి చైనా అగ్రనాయకత్వానికి ముందే తెలుసని కానీ వెంటనే హెచ్చరించకపోవడంతో ప్రపంచానికి పెనుముప్పుగా మారిందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నెలలో చైనా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా లక్షలాదిమంది వుహాన్ నగరానికి చేరుకున్నారు. అప్పటికే ఆ నగరంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని చైనా పెద్దలకు సమాచారమందింది. జనవరి 14 నుంచి 20 వరకు వుహాన్‌లో భారీ ఎత్తున వినోద కార్యక్రమాలు, విందులు జరిగాయి. ఈ ఆరురోజుల్లోనే వేలాదిమంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. చివరకు 20 న అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. అయితే అప్పటికే వుహాన్ నుంచి వేలాదిమంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు. దీంతో వారు వెళ్లిన దేశాల్లోనూ వైరస్ వ్యాపించడం మొదలైంది. కరోనా వైరస్ మహమ్మారి అని ముందే ప్రకటించివుంటే యావత్ ప్రపంచం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టివుండేది. చైనాలో ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో కరోనాకు సంబంధించిన వార్తలు వెలువడలేదు. దీంతో ప్రపంచదేశాలన్నీ ఆ వ్యాధిని చైనాకు సంబంధించిన అంశంగానే పరిగణించాయి. దక్షిణకొరియా, వియత్నాం, థాయ్‌లాండ్.. తదితర దేశాలకు వైరస్ పాకింది. అక్కడ కేసులు బయటకు రావడంతో ప్రపంచం తన దృష్టిని కరోనాపై సారించింది. 2019 డిసెంబరు 2020 జనవరి మాసాల్లో కరోనా చైనాలో పలుచోట్ల వ్యాపించిందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. అప్పటికే కరోనా సమాచారాన్ని బయటకు వెల్లడించారని కొందరు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇతరులు ఎవరూ అక్కడి సమాచారాన్ని బయటపెట్టలేదు. చివరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించినా అప్పటికే వైరస్ వాహకుల నుంచి ఇతర దేశాలకు అక్కడ నుంచి వందలమందికి పాకిపోయింది. జనవరి 14 నుంచి 20 మధ్య మహమ్మారి గురించి చైనా ప్రకటించివుంటే ఇతర దేశాలు తగు జాగ్రత్తలు తీసుకునేవి. ఇంతటి నష్టం వాటిల్లివుండేది కాదని వైద్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పింగూ….అప్పుడు నిద్రపోయావా?
Related tags :