* అగ్రరాజ్యం అమెరికాపై కరోనా వైరస్ పగబట్టింది. తాజాగా అక్కడ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఊహించని విధంగా అమెరికాలో కొవిడ్ 19 వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా నమోదుకానన్ని కేసులు, అత్యధిక మరణాలతో సతమతమవుతున్న అమెరికా.. ఇకపై పెను సవాలును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం అర్థరాత్రి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 7,06,309కి చేరింది. మృతుల సంఖ్య 36,607గా నమోదైంది. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 58,478కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 3,856 మంది మృతిచెందారు. ఇందులో కరోనా అనుమానిత మరణాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక అత్యధిక మరణాల్లో రెండో స్థానంలో ఉన్న ఇటలీలో వైరస్ సోకినవారి సంఖ్య 1,72,434కి పెరిగింది. మృతుల సంఖ్య 22,745గా నిర్ధరణ అయ్యింది. ఈ దేశంలో గత 24 గంటల్లో 575 మంది మృతిచెందారు. స్పెయిన్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,90,859కి చేరింది. మృతుల సంఖ్య 20,002గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 687 మంది మరణించారు. మరోవైపు ఫ్రాన్స్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,09,252 కాగా, మృతులు 18,681. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 761 మంది మరణించారు.
* కరోనా దృష్ట్యా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపట్టిందని ఏపీ వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న కార్యాచరణను ఉపరాష్ట్రపతి ప్రశంసించారని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దక్షిణకొరియా నుంచి కిట్లు ఎగుమతి చేసుకొని కరోనా నిర్థరణ పరీక్షలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఏడు వైరాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో ఐదు ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మరికొన్ని రోజుల్లో రోజుకు 12వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నాం’’ అని వివరించారు.
* గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహా నగరంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. బాధితులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తెలిపారు. అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించామన్నారు.
* దేశ రాజధాని నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దిల్లీలోని జహంగిర్ పురి ప్రాంతంలో ఒక్క కుటుంబంలోనే 26 మంది కరోనా పాజిటివ్ వచ్చినట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ప్రాంతం ఇప్పుడు కంటైన్‌మెంట్ జోన్‌లో ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 71 కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా బయటకు వస్తున్నారని అన్నారు.
* ‘జీవితం ఎవడినీ వదిలి పెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది’ ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. కరెక్టే.. జీవితంలో ప్రతి ప్రశ్నకూ కాలం దగ్గర సమాధానం ఉంటుంది. అయితే, ఆ సమాధానం ఎలా ఉంటుందో ఎవరూ ముందే ఊహించలేరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. 2020 జనవరి 1న ఎన్నో కొత్త ఆశలతో, కొత్త ఆలోచనలతో, ఇంకెన్నో కొత్త ఆశయాలతో కొత్త ఏడాది ప్రారంభించారు. మూడు నెలల్లో పరిస్థితులు మారిపోతాయని ఎవరైనా ఊహించి ఉంటారా? అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అనుకుని ఉంటారా? ప్రపంచవ్యాప్తంగా కరోనాకు ముందు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం!
* కరోనా మహమ్మారి రోజురోజుకూ భారత్‌లో తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ రోజు సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా 14792 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొవిడ్ -19తో పోరాడి 2015 మంది కోలుకోగా.. 488 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 3323 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 331 మంది అక్కడ డిశ్చార్జి అయ్యారు. 201మంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత దిల్లీలో 1707 కేసులు నమోదైతే వారిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గుజరాత్‌లో ఈ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 1272 కేసులు నమోదు కాగా.. 48మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లో 1355 కేసులు నమోదు కాగా.. వారిలో 69మంది కోలుకున్నారు.. మరో 69మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ 1323 మందికి ఈ వైరస్ సోకగా.. 283మంది కోలుకున్నారు. 15మంది మరణించారు.