పుదీనాను తరచూ వంటల్లో ఉపయోగించడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే పుదీనాలో బోలెడన్ని ఔషధ గుణాలుంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు, సి, డి, ఇ, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. మరి ఆరోగ్యపరంగా పుదీనాతో ఎన్ని లాభాలున్నాయో ఒకసారి చూద్దామా..?
1. పుదీనాను తరచూ ఆహారంలో తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
2. శ్వాస సంబంధ సమస్యలకు కూడా పుదీనా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి
దాంట్లో నాలుగైదు చుక్కల పుదీనా నూనె వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
3. పుదీనా.. అలర్జీ, ఉబ్బసం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో
ఉపయోగించడంతోపాటు, అచ్చం పుదీనాను పచ్చడి రూపంలో కూడా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
4. పుదీనా టీ తాగడం ద్వారా జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
5. పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను తరచూ
నమలడంవల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది.
ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది కాబట్టే పుదీనాను సకల ఔషధ గుణాల ఖజానాగా చెప్పవచ్చు.