Agriculture

వ్యవసాయం చేసుకోవచ్చు…ప్రభుత్వం ఆదేశాలు

Indian Government Releases Lock Down Policy Enabling Agriculture

జీవితాలను రక్షించుకుంటూనే జీవనోపాధి పొందడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కొనసాగించుకోవడానికి ఇప్పటికే అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి కొత్తగా మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలవుతాయి. మిగిలిన 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. ఈ-కామర్స్‌ సంస్థలు సరఫరా చేసే అన్ని వస్తువులకూ ఇటీవల మినహాయింపునిచ్చిన హోంశాఖ ఆదివారం ఆ వెసులుబాటును రద్దు చేసింది. టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు వంటివి కాకుండా అత్యవసర వస్తువుల సరఫరాకు మాత్రమే వాటికి అనుమతిచ్చింది. వస్తువుల జాబితా సుదీర్ఘంగా ఉన్నందున వాటన్నింటినీ అనుమతిస్తే కచ్చితంగా లాక్‌డౌన్‌పై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో కొన్నింటినే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.