* అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యవసరాలు కాని వస్తువులను ఈ-కామర్స్ కంపెనీలు విక్రయించడానికి లేదని స్పష్టంచేసింది. ఈ-కామర్స్ విక్రయదారులు ఉపయోగించే వాహనాలకు ముందుస్తు అనుమతి తప్పనిసరి అని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.
* రైళ్లు, విమాన సర్వీసులు ప్రారంభించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ స్పష్టంచేశారు. మే 3 తర్వాత రైళ్లు, విమాన సర్వీసులు ప్రారంభించే అంశంపై ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. రైళ్లు, విమానాలు నడిపేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైనా తేదీని నిర్ణయించిందా? అన్న ప్రశ్నకు ‘‘ఏదో ఒక రోజు సేవలు పునరుద్ధరించాలి. ప్రస్తుతానికి అది ఏ రోజన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దీని గురించి చర్చించడం ఫలితం లేనిదే అవుతుంది. మేం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాం’’ అని జావడేకర్ తెలిపారు.
* జనవరి- మార్చి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏకీకృత ప్రాతిపదికన రూ.7,280.22 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,300.81 కోట్లతో పోలిస్తే లాభం 15.4 శాతం పెరగడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం చివర్లో కరోనా వైరస్ కారణంగా ప్రభావం పడినప్పటికీ, వడ్డీ ఆదాయం అండతో లాభంలో వృద్ధిని నమోదుచేసింది. ఏకీకృత ఆదాయం కూడా ఏడాదిక్రితం నమోదైన రూ.33,260.48 కోట్ల నుంచి పెరిగి రూ.38,287.17 కోట్లకు చేరింది. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం 17.7 శాతం పెరిగి రూ.5,885.12 కోట్ల నుంచి రూ.6,927.69 కోట్లకు చేరింది. ఇక స్టాండలోన్ ఆదాయం రూ.35,917.63 కోట్లుగా నమోదైంది. ఏడాదిక్రితం ఇదే సమయంలో నమోదైన రూ.31,204.46 కోట్లతో పోలిస్తే ఆదాయం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం కూడా రూ.13,089.50 కోట్ల నుంచి పెరిగి రూ.15,204.10 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 4.3 శాతంగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి 1.36 శాతం నుంచి 1.26 శాతానికి తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి కూడా 0.39 శాతం నుంచి తగ్గి 0.36 శాతానికి పరిమితమైంది. మొండి బకాయిలకు కేటాయింపులు ఏకీకృత ప్రాతిపదికన రూ.4,216.50 కోట్లకు పెరిగాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో చేసిన రూ.2,063.50 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రెట్టింపు పైగా పెరగడం గమనార్హం. ఇక ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్జించిన లాభాల నుంచి ఎటువంటి డివిడెండ్లు చెల్లించడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది.
* హాలీవుడ్‌కు చెందిన ఎస్‌టీఎక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో విలీనం అవుతున్నట్లు భారత సినీ నిర్మాణ సంస్థ, పంపిణీదారు అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ శనివారం ప్రకటించింది. మొత్తం షేర్ల రూపంలో ఈ విలీనం జరగనుంది. ఆరేళ్ల కిందట ఏర్పాటైన ఎస్‌టీఎక్స్ ఇప్పటికే హాలీవుడ్‌లో 34 సినిమాలు నిర్మించింది. ఇందులో హస్లర్స్, బాడ్ మామ్స్ సినిమాలు రెండూ కలిసి 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.10,500 కోట్లు) గ్రాస్‌ను వసూలు చేశాయి.
* కొవిడ్-19తో భారత్ చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లు ముందుకొచ్చాయి. సహాయ కార్యక్రమాల నిమిత్తం రూ.38.3 కోట్లను వెచ్చించనున్నట్లు ఈ సంస్థలు ప్రకటించనున్నాయి. ఇందులో భాగంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విరాళంగా ఇవ్వడం, నిత్యావసర వస్తువులను అందిస్తున్న సంస్థలకు నిధుల సాయం అందించనున్నట్లు తెలిపాయి. ఈ రెండు సంస్థల సాయానికి తోడు వాల్‌మార్ట్ ఫౌండేషన్ కూడా రూ.7.7 కోట్లను విరాళంగా ఇవ్వనుంది. పేద ప్రజలకు సాయం చేస్తున్న గూన్జ్, శ్రీజన్ ఎన్‌జీఓలకు ఈ నిధులను అందజేయనుంది.