Editorials

ఐన్‌స్టీన్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన రాయ్-ఇన్నయ్య ముచ్చట్లు

ఐన్‌స్టీన్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన రాయ్-ఇన్నయ్య ముచ్చట్లు

ఆకాశం నుండి ఊడిపడి జమ్మి చెట్టులో ఇరుక్కున్నట్లు

ఎమ్.ఎన్.రాయ్ అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలో తారస్థాయికి చేరుకున్న తరువాత పార్టీ కోరికపై చైనా వెళ్ళి అక్కడ సంక్షోభాన్ని పరిష్కరించటంలో అవాంతరాలు ఎదుర్కొని బరోడిన్ తో తలపడి మొత్తం మీద తప్పించుకుని బతికి బయటపడ్డారు. ఆయన్ను చైనా వెళ్ళమని పార్టీ మాత్రమే కాక స్టాలిన్ ప్రత్యేకంగా కోరాడు. కానీ రాయ్ అడిగినదానికి చైనా నుండి వెంటనే సమాధానం చెప్పలేక తటపటాయించిన స్టాలిన్ ఆలస్యంగా టెలిగ్రాం పంపించి పరిస్థితి విషమించేవరకు సాగదీశాడు. అలాంటి దశలో ఎమ్.ఎన్.రాయ్ తిరిగి రష్యా రాగా స్టాలిన్ ఆయన మీద అలిగి మాట్లాడలేదు. కమ్యూనిస్టు పార్టీలో అగ్రస్థాయిలో వున్న ఎమ్.ఎన్.రాయ్ కు జబ్బు చేస్తే కనీసం మంచి ఆసుపత్రిలో చేర్చడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అలాంటి స్థితిలో లూసీ గైస్లర్ సహాయంతో రష్యా నుండి ఇంచుమించు తప్పించుకుని జర్మనీ వచ్చాడు. అప్పటి నుండి రాయ్ జీవితంలో మళ్ళీ పెద్ద మార్పులు సంభవించాయి. చైనాలో రాయ్ ప్రవర్తన గురించి స్టాలిన్ ఏమీ మాట్లాడలేదు. కమ్యూనిస్టు పార్టీ కూడా సంవత్సరం ఆగి ఆ తరువాత ఆయన్ను ఖండించి పార్టీ నుంచి తొలగించారు. ఈలోగా రాయ్ తన చైనా పాత్రను గురించి విపులంగా వివరించారు. జర్మనీలో ఆగస్ట్ తాల్ హైమర్ కొత్తగా నాలుగవ ఇంటర్నేషనల్ స్థాపించాడు. రాయ్ ఆయనతో చేతులు కలిపి సిద్ధాంతాలను ఆచరణలను రాయ్ తో ఆరంభించాడు. ఏమైనా కమ్యూనిస్టు పార్టీకి రాయ్ కు తెగతెంపులు జరిగాయి. రష్యాలో టాటస్కీ క్రమేణా రాయ్ కు దగ్గరైనా స్టాలిన్ తో టాటస్కీకి వున్న విరోధం వలన రాయ్ ఇమడలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన చైనా పాత్రను, కమ్యూనిస్టు పార్టీ ధోరణిని రాయ్ వివరించాడు. తాను తప్పు చేసినట్లుగానీ, వక్రమార్గంలో పోయినట్లు కానీ స్టాలిన్ ఎక్కడా అనలేదు. ఏమైనా కమ్యూనిస్టు పార్టీకి మాత్రం రాయ్ ఉద్వాసన పలికాడు. జర్మనీలో దాదాపు రెండేళ్ళపాటు ఆగస్ట్ తాల్ హైమర్ తో కలిసి వున్నాడు. ఆయన పత్రికల్లో విపులంగా రాశాడు. రాయ్ పెట్టిన పత్రికలన్నీ ఆగిపోయాయి.

జర్మనీలో వుండగా భారత విప్లవకారులు జర్మనీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు రాయ్ కు సన్నిహితులయ్యారు. వారి ద్వారా ఇండియాలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాట విషయాలను రాయ్ తెలుసుకున్నాడు. జర్మనీలో వుండగానే సైన్సు బాగా అధ్యయనం చేశాడు. ఐన్ స్టీన్ వంటి వారితో సన్నిహితుడయ్యాడు.

ఈ నేపథ్యంలో ఎమ్.ఎన్.రాయ్ కు సన్నిహితంగా వచ్చిన ఎలెన్ రాయ్ కు అనేక విధాల తోడ్పడింది. ఆమె మేథావి. వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు స్విట్జర్ లాండ్ లో కూడా వున్నారు. ఈలోగా భారత కమ్యూనిస్టులు చిలవలు పలవలుగా రాయ్ పై దుష్ప్రచారాలు చేశారు. ఇండియా రావడానికి నిర్ణయించుకున్న రాయ్ 15 సంవత్సరాల తరువాత ఆయా దేశాల మీదుగా కరాచీ చేరుకున్నారు. ఆయన ఇండియా వచ్చేసరికి సన్నిహిత మిత్రురాలు లూసీ గైసనర్ కూడా ఓడలో బొంబాయి చేరుకున్నది. కానీ బ్రిటీషువారు ఆమెను ఓడరేవు నుండి వెనక్కు పంపించేశారు. ఆ తరువాత రాయ్ మహమ్మూద్ అనే పేరుతో కొన్నాళ్ళు చెలామణి అయ్యారు. అప్పుడు కరాచీలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వచ్చి పాల్గొన్నాడు. ఆయన ఎవరైనదీ ఒక్క జవహర్ లాల్ నెహ్రూకు మాత్రమే తెలుసు. కాంగ్రెస్ వర్గాలు ఆయన ప్రసంగాలను, మేథస్సును గమనించి ఆశ్చర్యపోయారు. కొందరు గాంధీకి ప్రత్యామ్నాయంగా మంచి నాయకుడు వచ్చాడని భావించారు. దీనంతటిపై బ్రిటీషు గూఢచారులు కన్నేసి వుంచారు. కరాచీ కాంగ్రెస్ సభల తరువాత రాయ్ అలహాబాదు వెళ్ళి నెహ్రూ గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లో పర్యటించి బొంబాయి చేరుకున్నారు. అక్కడ వి.బి.కర్నిక్ మరికొందరు మిత్రులు ఆయనకు ఆశ్రయమిచ్చి రహస్యంగా కొన్నిచోట్లకు తిప్పారు. ఇదంతా బ్రిటీషువారు గమనిస్తున్నా స్పష్టత రాకపోవడంతో తొందరపడి చర్య తీసుకోలేదు. కమ్యూనిస్టులు మాత్రం రాయ్ పై కన్నేసి వుంచారు. చివరకు ఆయన వుంటున్న నివాస రహస్యాన్ని పోలీసులకు చేరవేశారు. ఇందులో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పాత్ర కూడా వున్నది. వారిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఒక తెల్లవారుఝామున రాయ్ ను అరెస్టు చేశారు. అంతటితో దేశవ్యాప్తంగా పత్రికల్లో రాయ్ వార్త పతాక శీర్షికల్లో వచ్చింది. సుప్రసిద్ధ సైంటిస్టు నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ అప్పుడు అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో వున్నాడు. ఆయన వెంటనే బ్రిటీషు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మేథావిపై దయగా వ్యవహరించాలని హతమార్చరాదని రాయ్ ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు.

##################
జైలులోను విప్లవ జీవితాన్ని గడిపిన ఎమ్.ఎన్.రాయ్

విదేశాలలో 15 సంవత్సరాలపాటు అనూహ్య చరిత్రను సృష్టించిన ఎమ్.ఎన్.రాయ్ ఇండియాకు వచ్చారు. రావడంతోనే కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొని ప్రాథమిక హక్కుల తీర్మానం అవసరమని చెప్పి సంచలనం సృష్టించాడు. కాంగ్రెస్ క్యాంపులో ఆయన్ను కలిసిన జవహర్ లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోసు ఆశ్చర్యపోయారు. తన ఇంటికి వచ్చి గడపమని నెహ్రూ ఆయన్ను ఆహ్వానించారు కూడా. కానీ రాయ్ రాకను గాంధీ ఆహ్వానించలేదు. ఈలోగా రాయ్ రాకను పసిగట్టిన బ్రిటీషువారు వెంటాడటం ప్రారంభించారు. అనంతరం రాయ్ బొంబాయి వచ్చి తన మిత్రులతో కలిసి కార్యక్రమాలకు ఉద్యమించారు. జర్మనీలో వుండగా భారత విప్లవకారులు కొందరు రాయ్ కు దగ్గరయ్యారు. వారు ఇండియాకు వచ్చినా రాయ్ తోపాటు పనిచేశారు. బొంబాయిలో మణిబెన్ కారా, వి.బి.కర్నిక్, డాక్టర్ షెట్టి, ఎ.బి.షెట్టి, చార్లెస్ మస్కారేండస్ బొంబాయిలో రాయ్ కు సహకరించి పనిచేశారు. తయ్యాబ్ షేక్ జర్మనీ నుంచి తిరిగి వచ్చి ఎ.కె.హింద్ పేరుతో తోడ్పడ్డారు. కార్మిక రంగంలో ఉద్యమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇదంతా జరుగుతుండగా వెంటాడుతున్న బ్రిటిష్ గూఢచారులు 1931 జూలై 21న అర్థరాత్రి ఒక మిత్రుడు ఇంట్లో నిద్రిస్తున్న రాయ్ ను అరెస్ట్ చేశారు. కోర్టులో విచారణ జరిపి 12 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. దీనిపై శిక్ష తగ్గించాలని ప్రీవి కౌన్సిల్ వరకు అప్పీలు పోయింది. స్టాఫర్డ్ క్రిప్ట్స్ రాయ్ తరఫున వాదించారు. కింది కోర్టులో కైలాసనాథ కట్జూ, డి. సన్యాల్ రాయ్ అడ్వకేట్లుగా పనిచేశారు. విచారణ అనంతరం ఆరేళ్ళ జైలు శిక్ష ఖాయపరిచారు. బరెల్లి, అల్మోరా, డెహ్రాడూన్ జైళ్ళలో రాయ్ సాధారణ ఖైదీగా గడపవలసి వచ్చింది. అయితే ఎండాకాలం బరెల్లీ జైలు దుర్భరం కాగా అల్మోరాకు మార్చారు. రాయ్ జైలులో తరచు జబ్బుపడుతూ వచ్చారు. జైలులో రాయ్ ఒక పిల్లికి పాలుపోసి పెంచారు. దానిని పరిశీలించి పిల్లి ఆత్మకథ అంటూ ఆసక్తికరమైన వైజ్ఞానిక గ్రంథాన్ని వ్రాశారు. జైలు నుండి ఉత్తరాలు చాలా పరిమితంగానే రాయనిచ్చారు. పారిస్ లో వున్న ఎలెన్ కు ఉత్తరాలు రాస్తూ, కొన్ని ఉత్తరాలు సైంటిస్టుల నుద్దేశించి రాశారు. వాటికి సమాధానం వచ్చినప్పుడు ఎలెన్ తిరిగి పంపించింది. ఇతర రాజకీయ సంబంధమైన ఉత్తరాలు సెన్సార్ చేసేవారు. అయితే తోటి ఖైదీలు కొన్ని ఉత్తరాలు బయటికి పంపటానికి సహకరించారు. ఆ విధంగా రాజకీయ సహచరులకు మిత్రులకు ఉత్తరాలు రాయగలిగాడు. రాజకీయపరిణామాలు దేశంలో ఎలా జరుగుతున్నాయో తెలుసుకుంటుండేవాడు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి ఉత్తరాలు రాశారు. ఆయన జైలు ఉత్తరాలు ఎంతో మెచ్చుకుని కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా దానికి సుదీర్ఘ పీఠిక రాశారు. శాస్త్రీయమైన విషయాలలో జస్టిస్ సులేమాన్ వంటివారితో అభిప్రాయ భేదాలను కూడా రాయ్ జైలు నుండే రాశారు. వీటన్నింటికి మించి ఆధునిక విజ్ఞాన శాస్త్రపు తాత్విక ఫలితాలు అనేపేరిట 5వేల పేజీలు రాయడం ఆశ్చర్యకరమైన విషయం. సైన్స్ తో, సైన్టిస్టులతో అంత లోతైన పరిశీలన, పరిచయాలు బహుశా జర్మనీలో వుండగా ఏర్పడి వుండాలి. మెటీరియలిజం అనే పుస్తకం కూడా జైలు నుండే రాశారు. ఆ విధంగా జైలులో బాధలు పడుతూనే రచనలు మాత్రం నిర్విరామంగా జరిపారు.

ఫాసిజంపై ఒక ప్రామాణిక రచన చేశారు. ఇస్లాం చారిత్రక పాత్రని గురించిన రచన బాగా ఆకట్టుకున్నది. జైలు ఖైదీ డైరీ అనే పేరిట ఆయన రచనలు బయటికి వచ్చిన తర్వాత కొన్ని వెలువడ్డాయి. మొత్తం మీద ఆరేళ్ళ జైలు జీవితం ముగించుకుని 1936 నవంబరు 20న డెహరాడూన్ జైలు నుండి బయటికి వచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ ఖుర్షీద్ లాలా, మణిబెన్ కారా, వి.బి. కర్నిక్, డాక్టర్ షెట్టి జైలు వెలుపల స్వాగతం పలికారు. అప్పటి నుండి 13 మోహినీ రోడ్ లో ఒక ఇంట్లోనే రాయ్ స్థిరపడ్డారు. ఆయన విడుదలయ్యేనాటికి పారిస్ నుండి ఎలెన్ వచ్చి చేరింది. వారిరువురూ డెహరాడూన్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని జీవితమంతా దంపతులుగా గడిపారు.