WorldWonders

లాక్‌డౌన్‌లో పెళ్లి. బైక్‌పై 850కిమీ వెళ్లి…

Uttar Pradesh Man Bikes From Punjab For His Wedding During LockDown

పెళ్లి కోసమని ఒక యువకుడు బైక్‌పై తన స్నేహితులతో కలిసి పగలు, రాత్రి తేడా లేకుండా దాదాపు 850 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇంకా 150 కిలోమీటర్లు వెళితే తన గమ్యాన్ని చేరుకుంటాననే సంతోషంలో ఉన్న యువకుడు క్వారంటైన్‌ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ వింత ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన సోనూ కుమార్‌ చౌహాన్‌ అనే 24 ఏళ్ల వ్యక్తి పంజాబ్‌లోని లుధియానాలోని టైల్స్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించకముందు ఏప్రిల్‌ 15న సోనూ పెళ్లి నిశ్చయం అయింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సోనూ పంజాబ్‌లోనే చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడడంతో ఎలాగైనా వెళ్లాలని భావించాడు. నేపాల్‌ సరిహద్దులో ఉన్న మహారాజ్‌గంజ్‌ జిల్లాలో సోనూ పెళ్లి జరగనుంది. అయితే లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దవడంతో తమ సొంత బైకులపై దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. సోనూ తన ముగ్గురు స్నేహితులతో కలిసి లుధియానా నుంచి రెండు బైక్‌లపై బయలుదేరారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దాదాపు 850 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇంకా 150 కిలోమీటర్లు చేరితే గమ్యస్థానం చేరుకుంటామనేలోపు ఆదివారం ఉదయం యూపీలోని బలరామ్‌పూర్‌ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్‌ విస్తురిస్తున్న సమయంలో ఇలా ప్రయాణం చేయడమేంటని ఆగ్రహించిన పోలీసులు సోనూతో సహా మిగతా ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించారు. ఇదే విషయమై సోనూ చౌహాన్‌ను కదిలించగా.. ‘ఈ సమయంలో ఇలాంటి ప్రయాణం చేయడం రిస్కే. కానీ పెళ్లి కావడంతో ఈ పని చేయాల్సి వచ్చింది. ఇంకో 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మా ఊరికి వెళ్లేవాడిని. కానీ పోలీసు అధికారులు అడ్డుకొని ఇప్పుడు నీ పెళ్లి కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారని’ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయమై బలరాంపూర్‌ ఎస్పీ దేవ్‌ రాజన్‌ వర్మ మాట్లాడుతూ.. ‘బలరాంపూర్‌ జిల్లా సరిహద్దుకు వద్దకు రాగానే సోనూ చౌహాన్‌తో పాటు మిగతా ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించాం. 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం కరోనా పరీక్షలో నెగిటివ్‌ వస్తే వారిని వదిలేస్తాం.అంతవరకు క్వారంటైన్‌లో ఉండాల్సిందే’ అంటూ స్పష్టం చేశారు.