లాక్‌డౌన్ వేళ.. ఓ రైతును పోలీసులు కారణం లేకుండానే కొట్టి చంపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఏప్రిల్ 16వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జబల్‌పూర్‌కు చెందిన రైతు బన్షీ కుష్వాహా తన వ్యవసాయ పొలం వద్ద పనులు ముగించుకుని 16వ తేదీన సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో పోలీసులు అతడిని ఆపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ కోపం అయ్యారు. ఇక్కడ జూదం ఆడుతున్నారని, వివరాలు చెప్పాలని పోలీసులు డిమాండ్ చేశారు. జూదం గురించి తనకేమీ తెలియదని రైతు బన్షీ పోలీసులకు చెప్పాడు. రైతు చెప్పిన మాటలు పోలీసులు వినిపించుకోకుండా లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఏప్రిల్ 19న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. రైతును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ సోమవారం రైతు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల కొట్టడం వల్లే రైతు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు జబల్‌పూర్ పోలీసులు వెల్లడించారు.
రైతును కొట్టి చంపినందుకు ఆరుగురి సస్పెన్షన్
Related tags :