DailyDose

నేడు ఒక్కరోజే 1500కుపైగా కేసులు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Indian Corona Positive Cases On High Rise To 1540 On One Day

* దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 17,656కు చేరింది. గడిచిన 24 గంటల్లో (ఏప్రిల్‌ 20 సాయంత్రం 5 గంటల వరకు) కొత్తగా 1540 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 559కి చేరినట్లు తెలిపింది. 2841 మంది కోలుకున్నారు.

* తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రమంతా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు; ఇళ్లల్లోనూ భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై తమ సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయం తీసుకున్నాం. తీసుకున్న నిర్ణయాలు రేపటి నుంచి అమలు చేస్తాం. అత్యవసర సరకుల సరఫరా కొందరికి పాసులు ఇచ్చాం. వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్షించాలని నిర్ణయించాం. అవసరం లేకున్నా వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారి పాసులను రద్దు చేస్తాం. కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు కొనసాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పాసులు ఇస్తాం’’ అని వివరించారు.

* కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని మంత్రి కేటీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు. ఈఎస్‌ఐ, పీహెచ్‌సీలు.. ప్రైవేటు వైద్యుల సేవలు తీసుకోవాలన్నారు. సోమవారం ఆయన జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు అండగా నిలవాలి. ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించవద్దు. యాజమాన్యాలు కార్మికులకు జీతాలు చెల్లించాలి. పరిశ్రమలు 30 – 40శాతం సామర్థ్యం మేరకే నడవాలి. భౌతికదూరం అమలుపై పరిశ్రమలను అధికారులు తనిఖీ చేయాలి’’ అని సూచించారు.

* ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల వ్యవహారంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న వేళ సీఎం జగన్‌ స్పందించారు. ఆ కిట్లు ఎక్కడున్నా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని స్పష్టం చేశారు. ఒక్కో కిట్‌ను రూ.795కు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్‌ పేర్కొందని.. అయినా రూ.65 తక్కువకు ఏపీ ప్రభుత్వం ఆర్డర్‌ ప్లేస్‌ చేసిందని వివరించారు.

* ఏపీలో కరోనా టెస్ట్‌ కిట్ల కొనుగోలు వ్యవహారంపై అధికార వైకాపా.. భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా మధ్య ట్వీట్ల ప్రవాహం సాగుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర భాజపా గట్టి కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డిని ‘సూట్‌కేస్‌ రెడ్డి’ అని సంబోధిస్తూ భాజాపా అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. తాజాగా విజయసాయి రెడ్డిపై ఉన్న కేసుల జాబితాను ట్విటర్‌లో ఉంచింది. ‘కాస్త కళ్లజోడు తుడిచి పెట్టుకుని చూడండి.. ఇది ఏపీ భాజపా.. కరోనా వచ్చి ఇప్పుడు రాష్ట్రం క్వారంటైన్‌లో ఉంటే.. తాను చేసిన పనులతో విజయసాయి రెడ్డి 2012లోనే క్వారంటైన్‌లో ఉన్నారు’ అని వ్యాఖ్యా్నించింది. ‘పైత్యంతో ఉన్న కాస్త పరువును తీసుకోకండి. ఇవి మీ డిగ్రీలు కాదు.. నేర ఘనతలు’ అంటూ కేసుల జాబితాను ట్విటర్‌లో పోస్టు చేసింది.

* ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైకాపా పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అందుకు ప్రభుత్వం 3 వారాల గడువు కోరింది. దీనికి అంగీకరించిన ధర్మాసనం ఈ మేరకు గడువిచ్చింది. పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. రంగులు తొలగించేందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చింది.

* కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఇది మంచి పరిణామమే.. కానీ, కరోనా వ్యాప్తిపై సరైన అవగాహన లేక.. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు చూసి కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ మాస్కులకు బదులు ఎన్‌-95‌ మాస్కులు వాడుతున్నారు.. సొంత వైద్యం, సొంత శానిటైజర్‌ తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అతిగా ఖర్చు చేస్తున్నారు. కరోనా భయంతో ఇలాంటి వాటిపై ఖర్చులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

* కరోనా దెబ్బకు మనంతా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండిపోయాం. రోజూ చేసిన పనులే చేస్తుంటాం. మరి ఇంట్లో గ్లౌజులు వాడటం ఎందుకు? ఒకవేళ బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే సమయంలో గ్లౌజులు వాడొచ్చు. అయితే వాటిని రీయూజ్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. చేతులకు ఎలా వైరస్‌ అంటుకుంటుందో.. గ్లౌజులకు అలాగే అంటుకుంటుంది. కాబట్టి సర్జికల్‌ గ్లౌజులు వాడకుండా, సింగిల్ యూజ్‌ గ్లౌజ్‌లు వాడటం, ఏదైనా పని చేసినప్పుడు వెంటనే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం మంచిది. వైద్య సిబ్బందికి ఆ గ్లౌజులు తప్పనిసరి. వాటిని వారికే ఉండనిద్దాం.

* ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైకాపా పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అందుకు ప్రభుత్వం 3 వారాల గడువు కోరింది. దీనికి అంగీకరించిన ధర్మాసనం ఈ మేరకు గడువిచ్చింది. పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది.

* దేశంలోని కొవిడ్‌-19 బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలేమీ కనిపించడం లేదని ఐసీఎంఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ గంగాఖేడ్కర్‌ అన్నారు. ఇది కలవరపెట్టే అంశమని ఆయన పేర్కొన్నారు. ‘80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. అలాంటి వారిని ఎలా గుర్తించాలన్నదే మా ఆందోళన. కాంటాక్టులను వెతికి పట్టుకోవడం మినహా మరో అవకాశం లేదు’ అని గంగాఖేడ్కర్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 17,000 దాటేసింది. 543 మంది వ్యాధితో చనిపోయిన సంగతి తెలిసిందే.

* మైనారిటీలపై భారత్‌ పక్షపాత వైఖరిని అవలంబిస్తోందన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇది, పాక్‌ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించటానికి ఆ ప్రభుత్వం చేస్తున్న అసంబద్ధమైన ప్రయత్నమని భారత్‌ పేర్కొంది.‘‘తమ కొవిడ్‌-19 విధానంపై చెలరేగుతున్న విమర్శల నుంచి తప్పించుకొనేందుకు మోదీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వక, హింసాత్మక వైఖరిని అవలంబిస్తోంది. దీనితో వేల మంది ఆకలితో, నిరాశ్రయులై భాధపడుతున్నారు. ఇది జర్మనీలో నాజీలు యూదులపై అవలంబించిన విధానం మాదిరిగా ఉంది’’ అని ఇటీవల పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్ ట్విటర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.