Editorials

అందరిదీ ఒక బాధ. ఈయనది గ్రే బాధ.

అందరిదీ ఒక బాధ. ఈయనది గ్రే బాధ.

పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్ధిని బయట పెట్టుకుంది. ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారిని ఓడించేందుకు తిరుగులేని పోరాటం చేస్తుంటే.. పాక్‌ మాత్రం అదేదో అత్యవసర కార్యమన్నట్లు నిషేధిత ఉగ్రవాదుల జాబితాను సవరించింది. ప్రపంచ దేశాలు మహమ్మారి మెడలు వంచేందుకు వ్యుహాలు రచిస్తూ తీరిక లేకుండా ఉంటే.. దాయాది దేశం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా 1,800 మంది నిషేధిత ఉగ్రవాదుల్ని జాబితా నుంచి తొలగించింది. అందులో 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జకీర్‌-ఉర్‌-రెహ్మాన్‌ లఖ్వీ సైతం ఉన్నట్లు సమాచారం. దీన్ని అమెరికాకు చెందిన ఓ అంకుర సంస్థ బయటపెట్టింది.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న క్యాస్టెల్లమ్‌.ఏఐ అనే టెక్నాలజీ కంపెనీ ప్రకారం.. 2018లో నిషేధిత జాబితాలో 7,600గా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య.. ఇప్పుడు 3,800కి చేరింది. గత మార్చి నుంచి ఏకంగా 1,800 మందిని ఈ జాబితా నుంచి తొలగించినట్లు క్యాస్టెల్లమ్‌ గుర్తించింది.

పాకిస్థాన్‌ను ఇప్పటికే ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) ‘గ్రే’ జాబితాలో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై జూన్‌లో మరోసారి సమీక్ష జరపనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌లిస్ట్‌ ముప్పు తప్పించుకునేందుకే పాక్‌ ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏఫ్‌టీఎఫ్‌ సిఫార్సుల్ని సమర్థంగా అమలు చేస్తున్నామని నమ్మబలికించడానికే ఈ కార్యానికి శ్రీకారం చుట్టినట్లు అర్థమవుతోంది. నిషేధిత ఉగ్రవాదుల్ని తొలగించినపుడు ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ, వాటిని పాక్‌ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఈ మేరకు ప్రముఖ అమెరికన్‌ దినపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. తొలగించిన తీరు, వేగం పలు అనుమానాలకు తావిస్తోందని నిపుణులు అభిప్రాయపడటం గమనార్హం.