Health

ఇండియాలో 20వేలు దాటాయి-TNI కరోనా కథనాలు

Coronavirus Cases Cross 20000 In India-TNILIVE Corona Bulletin

* చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్ట్‌ కిట్ల పనితీరుపై వచ్చిన ఆరోపణలపై తాజాగా చైనా స్పందించింది. ‘ర్యాపిడ్‌ కిట్లు సరిగా పనిచేయడంలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన ఏజెన్సీతో చర్చిండంతోపాటు వారికి అన్నివిధాల సహకరిస్తాం. విదేశాలకు ఎగుమతి చేసే వైద్య పరికరాల నాణ్యతలో చైనా ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది’ అని భారత్‌లోని చైనా రాయబారి జీ రింగ్‌ వెల్లడించారు.

* అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మంగళవారం ఏకంగా 2751 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో అక్కడ మరణాల సంఖ్య 45,373కు పెరిగింది. ఇక సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు అంటే 24 గంటల్లో 40 వేల కేసులు వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో వైరస్ బారినపడ్డవారి సంఖ్య 8,26,240కి చేరింది.
ఇక అమెరికాలో కరోనా మహమ్మారి ఈ ఏడాదిలో మరోసారి విజృంభిస్తుందని ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనాతో పాటు ఫ్లూ కూడా అదే సమయంలో ప్రతాపం చూపుతుందని తెలిపారు. రెండు ఒకేసారి విజృంభిస్తే పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించారు.

* కృష్ణాజిల్లా, గన్నవరం ఎయిర్ పోర్ట్ కి భారత వాయుసేనకు చెందిన ఎల్ 76 విమానం చేరుకుంది. భారీగా వైద్య పరికరాలు మాస్కూలు, శానిటైజర్లు, మందుల లోడ్ తో గన్నవరం విమానాశ్రయానికి సైనిక విమానం చేరుకుందని అధికారులు తెలిపారు. విమానంలోని బాక్సులను జాగ్రత్తగా దిగిమతి చేస్తున్న గన్నవరం విమానాశ్రయ సిబ్బంది. దగ్గరుండి పర్వేక్షించిన విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన రావు, విమానాశ్రయ ఏసీపీ వెంకటరత్నం మరియు సిబ్బంది.

* ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోన పాజిటివ్ కేసులు. 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు. పెరిగిన కేసులతో కలుపుకొని ఏపీలో 813కు చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య.

* కరోనా కట్టడిలో భాగంగా మరో కీలక కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆరోగ్య సేత యాప్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా టెలిఫోనిక్ సర్వే చేపట్టనుంది. ప్రజల నుంచి కరోనా వైరస్‌కు సంబంధించి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఈ టెలిఫోనిక్ సర్వే నిర్వహించబోతోంది. కరోనా వ్యాప్తి, లక్షణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడుగుతారు. తద్వారా ఏ ఏ ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ణీఛ్) ద్వారా ఈ సర్వేను చేపట్టనుంది కేంద్రం. 1921 నెంబర్ ద్వారా మొబైల్ ఫోన్లకు కాల్ వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

* కరోనా నియంత్రణ చర్యల కోసం విరాళాలు ఇచ్చే దాతలు కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ ప్రారంభించింది. దాతలు 040- 2111 11 11 హెల్ప్‌లైన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించింది. ‘చేయూత’ మొబైల్‌ యాప్‌ ద్వారా వివరాలు అందజేయవచ్చని తెలిపింది. విరాళాల సొమ్మును పేదలకు ఉచిత భోజనం కోసం ఖర్చచేస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అన్నపూర్ణ మొబైల్‌ క్యాంటీన్‌ ద్వారా ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

* కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ నెల 27న అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ అమలు తీరు, కరోనా కేసుల నమోదుపై సమీక్షించనున్నారు. అలాగే, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, లాక్‌డౌన్‌ మినహాయింపుల అంశంపైనా సమీక్షించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కాన్ఫరెన్స్‌ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

* భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20వేలు దాటేసింది. ఈ రోజు సాయంత్రం 5గంటల వరకు దేశంలో 20471 కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 3960 మంది డిశ్చార్జి కాగా.. 652 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు, కొవిడ్‌ 19 మహమ్మారి మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చింది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 5221 మందికి కరోనా సోకగా.. 251 మరణాలు నమోదయ్యాయి.