ఓ చిన్నారిని మృత్యువు ఊహించని రీతిలో పొట్టన పెట్టుకున్నది. నాలుగేండ్ల పసిబాలుడిపై పందులు దాడి చేసి చంపాయి. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని వస్తాపురం తండాకు చెందిన కేశవనాయక్, చిట్టిలు దంపతులు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు విష్ణువర్ధన్ (4) ఉన్నారు. భర్త ఆటో నడిపిస్తుండగా, భార్య కూలీ పనిచేస్తూ సైదాబాద్ సింగరేణికాలనీలోని గుడిసెల్లో నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో తల్లి ఇంట్లో బట్టలు ఉతికి ఆరవేస్తుండగా, విష్ణువర్ధన్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంటి సమీపంలో ఉన్న పందుల గుంపు వచ్చి బాలుడిపై ఒక్కసారిగా దాడిచేసింది. సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లాయి. ఈ లోపు బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పందుల నోట్లో ఉన్న బాలుడిని విడిపించినా ఫలితం లేకపోయింది. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావటంతో ఆ బాలుడు కొద్ది సమయంలోనే ప్రాణాలు విడిచాడు. అప్పటి వరకు తమ కండ్ల ముందే ఎంతో చక్కగా ఆడుకుంటున్న బాలుడు విగతజీవిగా పడి ఉండి మరణించటంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. కాగా, స్థానికంగా పందులను పెంచుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సంఘటనాస్థలాన్ని మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ సందర్శించి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగేళ్ల బాలుడిని చంపిన వరాహాలు
Related tags :