Sports

నేను గెలుస్తామనుకోలేదు

Kaif Recalls 2003 Natwest Final Tourney

టీమ్‌ఇండియా సాధించిన అద్భుత విజయాల్లో 2003 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ ఒకటి. ఇంగ్లాండ్‌తో జరిగిన కీలకపోరులో భారీ ఛేదనకు దిగిన భారత్‌ ఒక దశలో ఓటమి అంచుల్లో చిక్కుకుంది. కానీ, యువ క్రికెటర్లు యువరాజసింగ్‌, మహ్మద్‌ కైఫ్‌ అంచనాలకందని బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించారు. నాటి చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకున్న కైఫ్‌, యువీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా కైఫ్‌ మాట్లాడుతూ నాటి మ్యాచ్‌లో యువీ ఔటవ్వగానే టీమ్‌ఇండియా ఓడిపోతుందని అనుకున్నట్లు చెప్పాడు. కాగా, ఆ మ్యాచ్‌లో కైఫ్‌ 87 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, యువీ 69 పరుగులు చేసి ఔటయ్యాడు. 326 పరుగుల లక్ష్యాన్ని కైఫ్‌ చివరివరకూ క్రీజులో ఉండి జహీర్‌ఖాన్‌ సాయంతో జట్టును గెలిపించాడు. ‘యువీ ఆరోజు నువ్వు ఔటవ్వగానే మ్యాచ్‌ ఓడిపోతామనుకున్న. మనం గెలుస్తామనుకోలేదు. అప్పటికే నేను కుదురుకున్నాను. నువ్వు క్రీజులో ఉన్నావు. దాంతో చివరివరకూ మనం క్రీజులో ఉంటే కచ్చితంగా గెలుస్తామని భావించా. కానీ, నువ్వు ఔటయ్యేసరికి చాలా నిరాశ చెందా’ అని కైఫ్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు. అనంతరం మ్యాచ్‌ గెలిచాక నాటి సారథి సౌరభ్‌ గంగూలీ లార్డ్స్‌ మైదానం బాల్కనీలో టీమ్‌ఇండియా జెర్సీ విప్పితిప్పడం అందరికీ తెలిసిందే. కైఫ్‌ ఇంకా మాట్లాడుతూ.. 2000 అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో యువరాజ్‌(58; 25 బంతుల్లో) ఆసీస్‌పై బాదిన అర్ధ శతకం కూడా తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో మిచెల్‌ జాన్సన్‌, షేన్‌వాట్సన్‌ లాంటి ఆసీస్‌ కుర్రాళ్ల బౌలింగ్‌ను ఉతికారేశాడని కైఫ్‌ వెల్లడించాడు. అనంతరం యువరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ తామిద్దరం టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ను మార్చేశామని చెప్పాడు. ఇప్పుడు భారత జట్టులో చాలా మంది మంచి ఫీల్డర్లు ఉన్నారని చెప్పాడు.