Movies

కెమెరా మాంత్రికుడు మార్కస్ బార్ట్లీ

Remembering veteran DOP Marcus Bartley On his birthday

‘పాతాళభైరవి’లోని ఒక దృశ్యంలో మాంత్రికుడు ఉజ్జయిని నగరం వచ్చి, ప్రజల్ని ఆకర్షించి వాళ్లకి కావలసిన వస్తువుల్ని తన దగ్గర ఉన్న, ‘మంత్రాల డబ్బా’ నుంచి తీసి ఇస్తూ ఉంటాడు. తోటరాముడికి విశేషమైన ధనం కావాలి గనక, అ డబ్బాను లాక్కుని పారిపోతాడు. ఒక అడవిలాంటి ప్రదేశానికి పరుగెత్తి, నోటి కొచ్చిన మంత్రం చెబుతూ డబ్బా వెతుకుతాడు. అదే సమయానికి దూరం నుంచి బొబ్బల్లాంటి నవ్వులతో మాంత్రికుడు వస్తాడు. ఈ అడవి, చెట్లు అవుట్‌డోర్‌. మాంత్రికుడు రాముడి దగ్గర కొచ్చి, ‘అందులో ఏముందిరా, అంతా మన మంత్రశక్తిలో ఉంది’ అన్నప్పుడు అక్కడి నుంచి ఇన్‌డోరు. ఇక్కడ బార్‌ట్లీ, అప్పుడు అవుడ్డోర్‌లో తీసిన ఎండ వెలుతురుని సరిగ్గా మాచ్‌ చేస్తూ ఫ్లోర్‌లో లైటింగ్‌ చేసి, తీసి తేడా తెలియనీయలేదు! ఈ సందర్భంలో కళాదర్శకుల్ని, ఎడిటర్‌నీ కూడా మనం అభినందించాలి. అవుడ్డోర్‌లో ఆ చెట్టు, పరిసరాలు ఎలా ఉన్నాయో, అలాగే సెట్టువేసి మాచ్‌ చేశారు. ఎక్కడ షాట్‌ కట్‌ అయిందో తెలియనీయకుండా, ఎడిటర్‌ తన నైపుణ్యం చూపాడు. ఈ దృశ్యం సినిమాలో చూస్తున్నప్పుడు అవుడ్డోర్‌ నుంచి, ఇన్‌డోర్‌కి మారిన విషయం ఛట్టున ఎవరూ గుర్తుపట్టలేదు! అందుకే ఈ టెక్నికల్‌ స్థాయి అంతర్జాతీయ చిత్ర ప్రముఖుల్ని విస్మయ పరచింది. 1950-51 సంవత్సరాల మధ్య, అంటే 67 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా అంతటి ఖ్యాతిని ఆర్జించింది. ఛాయాగ్రాహకుడు మార్కస్‌ బార్‌ట్లీ చేసిన వెండితెర మాయాజాలానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మార్కస్‌ బార్‌ట్లీ (ఏప్రిల్‌ 22, 1917) జయంతి. విజయవారు సంస్థ ఆరంభిస్తూనే మార్కస్‌ బార్‌ట్లీని తమ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. తమ చిత్రం ఉన్నంత కాలం ఆయన బయటి చిత్రాలు చెయ్యకూడదు. మధ్యలో విరామం వస్తే చేసుకోవచ్చు. ‘షావుకారు’, ‘పాతాళబైరవి’, ‘పెళ్లి చేసిచూడు’, ‘చంద్రహారం’, ‘మిస్సమ్మ’ మొదలైనవాటన్నింటికి బార్‌ట్లీ ఛాయాగ్రాహణ దర్శకుడు. మధ్యలో కె.వి.రెడ్డి వాహినికి ‘పెద్దమనుషులు’ తీశారు. దానికి కొండారెడ్డి ఛాయాగ్రాహకుడు. కొండారెడ్డి బార్‌ట్లీ దగ్గరే శిక్షణ పొందారు. బార్‌ట్లీ, కెమెరాలు, లెన్స్‌లూ అన్నీ సర్వీస్‌ చేసేవారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఆ సర్వీసింగ్‌ వృత్తి చేపట్టారు.