* వారిద్దరికీ పెళ్లి కుదిరింది. వివాహం చేద్దామంటే జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయితే, గతంలో వరుడు చేసిన సాయానికి పోలీసులే వారికి ప్రత్యుపకారం చేశారు. వారి పెళ్లికి సాయపడ్డారు. చివరికి పోలీస్‌స్టేషన్ ఆవరణలోని సిబ్బంది సమక్షంలో అనుకున్న సమయంలోనే వారిద్దరూ ఒక్కటయ్యారు. లాక్‌డౌన్ వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ పెళ్లి జరిగింది.
* గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 19 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 177కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరులో 5, నరసరావుపేటలో 5, దాచేపల్లిలో 4, చిలకలూరిపేటలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో గుంటూరు నగరంలో కొవిడ్ బాధితుల సంఖ్య 106కు చేరింది.
* గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడి పండ్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1600 టన్నుల మేర మామిడిని రైతులు తీసుకొచ్చారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇవాళ అర్ధరాత్రి నుంచి మూడు రోజుల పాటు గడ్డిఅన్నారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో రైతులు ఒక్కసారిగా మార్కెట్‌కు తరలివచ్చారు. మామిడి అధికంగా రావడంతో మార్కెట్‌లో రద్దీ నెలకొంది.
* తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఔషధాల కోసం బయటకు వెళ్లినప్పుడు ఇబ్బందులు రాకుండా వారితో పాటు వారి సహాయకులకు పోలీసులు పాస్‌లు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ వేళ దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గణేష్ కర్నాటి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. దివ్యాంగులకు అవసరమైన అత్యవసర చికిత్సలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ విభాగాల వైద్య సిబ్బందికి వివరించాలని హైకోర్టు తెలిపింది. నిత్యావసరాలు, ఔషధాలను దివ్యాంగుల ఇంటి వద్దకే చేర్చేలా ఏర్పాట్లు చేయాలని సర్కారుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
* కరోనా భయం ప్రజల్లో మానవత్వాన్ని మంట కలిపింది. కృష్ణ జిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంక గ్రామంలో మృతదేహం కలకలం రేపింది. విజయవాడలో అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని ప్రైవేటు అంబులెన్స్‌లో తీసుకువచ్చి రోడ్డుపై వదిలేయడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. మోపిదేవిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు కొంతకాలంగా పెద్దపులిపాకలో నివాసముంటున్నాడు. కొద్దిరోజులుగా ఆయన కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి వెంకటేశ్వరరావు మృతి చెందగా… మృతదేహాన్ని సొంతూరుకు తీసుకువచ్చారు. ఇదే గ్రామంలో నివాసముంటున్న మృతుడి సోదరుడు అన్న మృతదేహాన్ని తన ఇంటికి తీసుకువెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో అంబులెన్స్ సిబ్బంది తెల్లవారు జాము మూడు గంటల సమయంలో మృతదేహాన్ని గ్రామంలో రోడ్డుపై దింపి వెళ్లిపోయారు. ఎక్కడో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తిని అర్ధరాత్రి తమ గ్రామానికి ఎందుకు తీసుకువచ్చారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలంటూ మృతుడి భార్యపై ఒత్తిడి తెచ్చారు. వెంకటేశ్వరరావు ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందాడని పోలీసులు నచ్చజెప్పినా మృతుడి సోదరుడు, గ్రామస్థులు వినిపించుకోలేదు. దీంతో మృతదేహాన్ని పోలీసులు పెద్దపులిపాకకు తరలించారు.
* కొవిడ్-19పై పోరాటానికి ఆయుర్వేద ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రోగనిరోధక శక్తి పెంచి వైరస్, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే ‘ఫిఫట్రాల్’ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
* కరోనాపై యావత్ దేశం పోరాడుతున్న వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇకపై ఎవరైనా కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు 1987 నాటి అంటురోగాల చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ మీడియాకు వివరించారు.
* కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. రాష్ట్రంలో కొంత మందికి వైరస్ లక్షణాలు 28 రోజులవరకు బయటపడటం లేదని.. దీని వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఇకపై 14 రోజులు కాకుండా 28 రోజులు ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది
* చైనాలోని వుహాన్ నగరాన్ని లాక్‌డౌన్ చేసిన తర్వాత ఏం జరిగింది? ప్రపంచ దేశాలకు తెలిసింది కొద్ది సమాచారమే. ఎందుకంటే ఆ దేశంలో మీడియాపై ఆంక్షలు ఉంటాయి. సాధారణంగా అక్కడేం జరిగినా బయటకు పొక్కదు. చాలా అంశాలు సెన్సార్ అవుతాయి! ఈ నేపథ్యంలో ఓ రచయిత్రి రాసిన వివరాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. చైనా అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని పొందిన రచయిత్రి ఫాంగ్‌ఫాంగ్. ప్రస్తుతం ఆమె వయసు 64 ఏళ్లు. స్వస్థలం వుహాన్. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఆమె ఆన్‌లైన్ డైరీ రాయడం మొదలుపెట్టింది.
* కరోనా వ్యాప్తి విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 24 మంది మృతిచెందారన్నారు. ప్రస్తుతం 669 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 120 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశామని మంత్రి వివరించారు. గుంటూరు కలెక్టరేట్‌లో మరో ఇద్దరు మంత్రులు సుచరిత, మోపిదేవితో కలిసి జిల్లాలోని పరిస్థితులపై ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని మంత్రి నాని తెలిపారు.
* రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులు కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతకు బలమైన సంకేతంగా అభివర్ణించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్, జియోలో వాటా కొనుగోలుపై ఆయన ముకేశ్ అంబానీకి అభినందనలు తెలిపారు. ‘‘ఫేస్‌బుక్‌తో జియో ఒప్పందం ఆ రెండు సంస్థలకు మాత్రమే లాభదాయకం కాదు. సంక్షోభంలో ఈ ఒప్పందం కుదిరినప్పటికి, కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతకు ఇది బలమైన సంకేతం. ప్రపంచం మొత్తానికి భారత్ అభివృద్ధి కేంద్రంగా మారుతుందనే వాదనను ఇది బలపరుస్తుంది. ముకేశ్ గొప్పగా చేశావ్ ’’ అని మహీంద్రా ట్విటర్లో పేర్కొన్నారు.