కరోనా పరీక్షల విషయంలో వెనకడుగు వేయొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను జగన్ అభినందించారు. నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని.. ఇప్పటివరకు మొత్తంగా 48,034 పరీక్షలు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన ర్యాపిడ్ కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని వివరించారు. నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ కిట్లతో ఇప్పటివరకు 14,423 టెస్టులు నిర్వహించామని.. వాటిలో 11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే చేసినట్లు చెప్పారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో చేసిన పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. వీటిని నిర్ధారణ కోసం పీసీఆర్ టెస్టులకు పంపించామని అధికారులు సీఎంకు వివరించారు. దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్ల పనితీరు బాగుందని అధికారులు సీఎంకు తెలిపారు.
కరోనా పరీక్షలపై నిర్లక్ష్యం తగదు
Related tags :