DailyDose

సోనియాకు భజాపా హితవు-తాజావార్తలు

సోనియాకు భజాపా హితవు-తాజావార్తలు

* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశాన్ని గట్టెక్కిస్తుందని 93.5% భారతీయులు విశ్వాసంతో ఉన్నారు. ముప్పు నుంచి దేశం సమర్థంగా బయటపడుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారని గురువారం విడుదలైన ఓ సర్వే తెలిపింది.

* కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ చిల్లర రాజకీయాలు చేయొద్దని భాజపా విమర్శించింది. తమ పార్టీ మత విభేదాలు సృష్టించడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పష్టం చేశారు. స్థాయి తక్కువ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్‌కు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ప్రభుత్వాన్ని సోనియా గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నుంచి 3 నెలల వరకు యజమానులు ఇంటి అద్దెలు వసూలు చేయరాదని తెలంగాణ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా అడగరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మూడు నెలల తర్వాత బకాయిలను వాయిదాల్లో తీసుకోవాలని ఇంటి యజమానులను ఆదేశించింది. అద్దెలు ఇవ్వాలని, ఖాళీ చేయాలని వేధించొద్దని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై అంటువ్యాధుల నిరోధక చట్టం- 1897, విపత్తు నిర్వహణ చట్టం- 2005 కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పురపాలిక కమిషనర్లకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

* కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచనలు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులను కోరారు. కరోనా పరిష్కారాలకు వారంతా మద్దతివ్వాలన్నారు. బెంగళూరులో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ కాపిటలిస్ట్‌ వాణి కోలాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మెడ్‌టెక్‌, మెడికల్‌ డివైస్‌, బయోటెక్‌ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కరోనాపై పోరులో భారత్‌ త

* దేశ రాజధాని నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు జహంగీర్‌ పురిలోని హెచ్‌ 3 బ్లాక్‌లోని మూడు వీధుల్లో 46 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆ ప్రాంతంలోని మరికొన్ని వీధుల్ని సైతం అధికారులు మూసివేశారు.

* ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సీనియర్‌ ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్‌ నెల వేతనాల్లో కోత విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు సంస్థ సీఈవో రణొజోయ్‌ దత్త వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉద్యోగులకు మెయిల్‌ చేశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు మాత్రం కోత విధించిన వేతనాలు తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. మిగతావారికి పూర్తి వేతనం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

* కరోనా వైరస్‌పై పోరాడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందికి తక్షణమే రక్షణ పరికరాలు అందించాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్నికి లేఖ రాశారు. ట్రూనాట్‌ కిట్ల సాయంతో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా 16వేల పరీక్షల ఫలితాలు పెండింగ్‌లో ఉండటం సరికాదన్నారు. రాష్ట్రంలో సరైన టెస్టింగ్‌ ల్యాబ్‌లు లేకపోవడంతోనే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని.. ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రైవేట్‌ ల్యాబ్‌ల సహకారం తీసుకునే వెసులుబాటు ఉన్నా ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, ఆరోగ్యసిబ్బంది, పోలీస్‌, రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికులకు ఇంతవరకూ రక్షణ పరికరాలు అందజేయకపోవడం దురదృష్టకరమన్నారు. నాణ్యతలేని పరికరాలు అందజేయడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు విమర్శించారు. క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వారిపట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవుపలికారు.

* ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి సీఎం జగన్‌ ఆలోచనా విధానాలే కారణమని ఆయన విమర్శించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ అవినీతికి, రాజకీయాలకే జగన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు. కరోనా కట్టడికి పొరుగు రాష్ట్రాలు చిత్తశుద్ధి చూపాయి కాబట్టే అక్కడ కేసులు పెరగడంలేదని యనమల అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందుచూపు లేని కారణంగానే కొవిడ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

* కరోనా పరీక్షల విషయంలో వెనకడుగు వేయొద్దని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను జగన్‌ అభినందించారు. నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశామని.. ఇప్పటివరకు మొత్తంగా 48,034 పరీక్షలు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన ర్యాపిడ్‌ కిట్లకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని వివరించారు. నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ కిట్లతో ఇప్పటివరకు 14,423 టెస్టులు నిర్వహించామని.. వాటిలో 11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే చేసినట్లు చెప్పారు. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో చేసిన పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. వీటిని నిర్ధారణ కోసం పీసీఆర్‌ టెస్టులకు పంపించామని అధికారులు సీఎంకు వివరించారు. దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందని అధికారులు సీఎంకు తెలిపారు.