DailyDose

జాక్‌మాను దాటేసిన అంబానీ-వాణిజ్యం

జాక్‌మాను దాటేసిన అంబానీ-వాణిజ్యం

* ఫేస్‌బుక్ , రిలయన్స్ జియో మెగా డీల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. అతిపెద్ద డీల్ గా నిలిచిన రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటాను ఫేస్‌బుక్‌ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్త రిలయన్స్ తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుదవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు పది శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాల అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

* లాక్‌డౌన్‌ వేళ వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం పెరిగింది. దీనికి తోడు జూమ్‌ యాప్‌ అంతగా శ్రేయస్కరం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో జూమ్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది. దీంతో హ్యాంగ్‌ అవుట్‌ మీట్‌ను గూగుల్‌ మీట్‌గా మార్చి తీసుకొచ్చింది. అందులో ఇప్పుడు గూగుల్‌ కొత్త సదుపాయాలను జోడించింది.

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను దార్లకు అదనపు కరవు భత్యం చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జనవరి 1 నుంచి చెల్లించాల్సి ఉన్న అదనపు కరవు భత్యాన్ని చెల్లించబోమని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జనవరి 1 నుంచి జులై 1 వరకు చెల్లించాల్సిన అదనపు కరవు భత్యాన్ని కూడా రద్దుచేసినట్టు ఆ శాఖ తెలిపింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆ శాఖ నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ఈ నిర్ణయం వల్ల 2020×21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.37,530 కోట్లు ఆదా అవుతుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలకు అధిక మొత్తంలో కేటాయింపులు అవసరమైనందున ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా పైకి ఎగబాకాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 146 పాయింట్లు లాభపడి 31,538 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 58 పాయింట్లు ఎగబాకి 9,245 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.43 వద్ద కొనసాగుతోంది. కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పుంజుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* కరోనా వైరస్‌ నియంత్రణ కోసం విక్రయశాలల దగ్గర సామాజిక దూరం, టోకన్ల వ్యవస్థ వంటి నిబంధనలు పాటించడంతో, రిటైలర్ల నిర్వహణ వ్యయాలు 35 శాతం వరకు పెరగొచ్చని ఫ్యూచర్‌ రిటైల్‌ ఎండీ రాకేశ్‌ బియానీ పేర్కొన్నారు. వ్యాపారాలు క్రమంగా పెరుగుతునప్పటికీ.. సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షల వల్ల విక్రయశాలలకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. ‘చిన్న విక్రయశాలల నిర్వహణ వ్యయాలు 30- 35 శాతం పెరగొచ్చు. ఇక పెద్ద విక్రయశాలల విషయానికొస్తే 10-15 శాతం అధికం కావొచ్చు’ అని రిటైలర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. డెలివరీ సేవలకు గిరాకీ పెరిగిందని, రిటైలర్లు పూర్తిస్థాయిలో వినియోగదార్లకు సేవలు అందించడానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల వల్ల ఉద్యోగులకు నైపుణ్యాలు కల్పించాల్సిన అవసరం వచ్చిందన్నారు.